నాడు ప్రాణాలకు తెగించి.. నేడు మృత్యువుతో పోరాడుతూ..

తేలికపాటి యుద్ధవిమానాన్ని (ఎల్‌సీఏ) పరీక్షించడం అంటే కత్తిమీద సామే. ప్రయోగాల దశలో ఉన్న అలాంటి విమానం నడిపేటప్పుడు అందులో సాంకేతిక సమస్యలు ఎదురైతే పైలట్‌ ప్రాణాలకే ప్రమాదం. సరిగ్గా అలాగే తేజస్‌ యుద్ధవిమానాన్ని పరీక్షించే క్రమంలో అందులో పలురకాల సమస్యలు తలెత్తినా

Published : 09 Dec 2021 04:42 IST

 గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌కు వెల్లింగ్టన్‌ సైనికాసుపత్రిలో చికిత్స
గతంలో చూపిన సాహసానికి శౌర్యచక్ర అవార్డు బహూకరణ

దిల్లీ: తేలికపాటి యుద్ధవిమానాన్ని (ఎల్‌సీఏ) పరీక్షించడం అంటే కత్తిమీద సామే. ప్రయోగాల దశలో ఉన్న అలాంటి విమానం నడిపేటప్పుడు అందులో సాంకేతిక సమస్యలు ఎదురైతే పైలట్‌ ప్రాణాలకే ప్రమాదం. సరిగ్గా అలాగే తేజస్‌ యుద్ధవిమానాన్ని పరీక్షించే క్రమంలో అందులో పలురకాల సమస్యలు తలెత్తినా విమానాన్ని, దాంతోపాటు కింద నేల మీదున్న ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడుతూ అసమాన ధైర్యసాహసాలు, తెలివితేటలను ప్రదర్శించిన ధీరుడే భారత వైమానికదళం గ్రూప్‌ కెప్టెన్‌, శౌర్యచక్ర అవార్డు గ్రహీత వరుణ్‌ సింగ్‌. బుధవారం నాటి హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై, ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి. ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్‌లోని సైనికాసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు.

నాటి ఘటన ఇలా...
2020 అక్టోబరు 12న అప్పటి వింగ్‌ కమాండర్‌ వరుణ్‌సింగ్‌ తేజస్‌ యుద్ధవిమానాన్ని పరీక్షించేందుకు తీసుకెళ్లారు. అప్పటికే అందులో విమాన నియంత్రణ వ్యవస్థ (ఎఫ్‌సీఎస్‌), పీడన వ్యవస్థల్లో సమస్యలు ఎదురవ్వగా వాటిని సరిచేశారు. కానీ, పరీక్ష సమయంలోనూ విమానం బాగా ఎత్తులో ఉండగా కాక్‌పిట్‌లో పీడనం ఒక్కసారిగా తగ్గిపోయింది. అప్పుడు వరుణ్‌ లోపాన్ని గుర్తించి, తక్కువ ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లారు. అయినా ఎఫ్‌సీఎస్‌ విఫలమై విమానం మీద నియంత్రణ కోల్పోయారు. దాంతో విమానం ఎత్తు కూడా బాగా పడిపోయింది. ఇలాంటి సమయంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది, ప్రాణాపాయం సైతం పొంచి ఉంటుంది. అదే సమయంలో విమానం 10వేల అడుగుల ఎత్తున ఉండగా విమానంపై నియంత్రణ పూర్తిగా పోయింది. సాధారణంగా అయితే అలాంటప్పుడు పైలట్‌ విమానాన్ని వదిలేసి పారాచ్యూట్‌తో దూకేయొచ్చు. కానీ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా వరుణ్‌సింగ్‌ మాత్రం అసమాన ధైర్యసాహసాలు, నైపుణ్యం ప్రదర్శించి విమానాన్ని సురక్షితంగా దించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని