సంక్షిప్త వార్తలు

బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నైరుతి ప్రాంతాలకు గురు, శుక్రవారాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో

Updated : 26 May 2022 06:41 IST

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నైరుతి ప్రాంతాలకు గురు, శుక్రవారాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కోటపల్లి(మంచిర్యాల జిల్లా)లో 4.9 సెంటీమీటర్లు, ఇదే జిల్లా నెన్నెలలో 3.2, మందలపల్లి(భద్రాద్రి)లో 2.6, తాండ్ర (నిర్మల్‌)లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా జైనథ్‌(ఆదిలాబాద్‌)లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


ఆహార పరిరక్షణ కార్యాలయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం అత్యధిక జిల్లాల్లో ఔషధ నియంత్రణ సంస్థకు, ఆహార పరిరక్షణ విభాగానికి సొంత భవనాల్లేవు. చాలాకాలంగా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్‌ సమీకృత భవన సముదాయాల్లోకి వీటి కార్యాలయాలను తరలించాలని నిర్ణయించింది. ఇటీవల అన్ని జిల్లాల ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ అధికారులతో మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సమీకృత భవన సముదాయాలు పూర్తి కావడంతో తక్షణమే వాటిలోకి మారిపోవాలని ఆదేశాలు జారీచేశారు. సొంత భవనాలు లేనిచోట ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ విభాగాల కార్యాలయాలకు సమీకృత భవనాల్లో చోటు కల్పించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ అధికారికంగా లేఖలు రాశారు. దీంతో స్పందించిన కలెక్టర్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలాచోట్ల అద్దె భవనాల్లో కనీస వసతులు కరవయ్యాయని, దస్త్రాలకు భద్రత లేదని, ప్రభుత్వ భవన సముదాయంలోకి మారడం ద్వారా సదుపాయాలు మెరుగవుతాయని, అద్దె భారం కూడా తప్పుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.


45వేల ఎకరాల్లో ఒకే కోత పత్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది 45వేల ఎకరాల్లో ‘ఒకే ఒకసారి దూది తీసి పంట ముగించే’(సింగిల్‌ పికింగ్‌) పత్తి పంట సాగుచేయించాలని వ్యవసాయశాఖను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ విధానంలో పత్తి సాగుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం తన ఛాంబర్‌లో అధికారులతో సీఎస్‌ సమీక్ష జరిపారు. గతంలో ఈ రకం సాగుకు విత్తన కంపెనీలు ప్రయోగాలు చేసిన ప్రాంతాల్లో దీనిని విస్తరించాలని చెప్పారు.  


సహజ సేద్యంపై మేనేజ్‌తో ఏపీ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: సహజసేద్యంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి మేనేజ్‌ సంస్థతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. బుధవారం రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి, మేనేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ఏపీలో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు, సహజ సేద్యం పథకం మంచి నమూనాలన్నారు. వ్యవసాయ వాణిజ్యవేత్తలను, అంకుర సంస్థల ప్రోత్సాహానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో మేనేజ్‌ సంస్థ మరో ఎంవోయూ చేసుకుంది.


‘పోడు’ దరఖాస్తుల పరిశీలన ఎప్పుడో?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు పరిష్కారం మరింత ఆలస్యం కానుంది. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిశీలనకు అనుమతులు, మార్గదర్శకాలు జారీ చేయలేదు. దరఖాస్తులన్నీ గ్రామ కమిటీల వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వానాకాలం పంటల సాగుకు దుక్కిదున్నేందుకు వెళ్తున్న గిరిజనుల్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. పోడుపై చట్టబద్ధ హక్కులు వచ్చేవరకు భూముల్లోకి వెళ్లవద్దని స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం గత నవంబరు 8 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 12 లక్షల ఎకరాల విస్తీర్ణంపై 3.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తక్కువ దరఖాస్తులు వచ్చిన గ్రామాలు, ఆవాసాల్లో నెల రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని.. ఆరు నెలల్లోగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నా.. క్షేత్రస్థాయి పరిశీలనకు మార్గదర్శకాలు వెలువరించలేదు.  జిల్లాకు 1-2 గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలు రాకపోవడంతో ఈ గ్రామాల్లోనూ దరఖాస్తుల పరిష్కారం నిలిచిపోయింది.


సమీకృత భవనాల్లోకి ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ కార్యాలయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం అత్యధిక జిల్లాల్లో ఔషధ నియంత్రణ సంస్థకు, ఆహార పరిరక్షణ విభాగానికి సొంత భవనాల్లేవు. చాలాకాలంగా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్‌ సమీకృత భవన సముదాయాల్లోకి వీటి కార్యాలయాలను తరలించాలని నిర్ణయించింది. ఇటీవల అన్ని జిల్లాల ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ అధికారులతో మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సమీకృత భవన సముదాయాలు పూర్తి కావడంతో తక్షణమే వాటిలోకి మారిపోవాలని ఆదేశాలు జారీచేశారు. సొంత భవనాలు లేనిచోట ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ విభాగాల కార్యాలయాలకు సమీకృత భవనాల్లో చోటు కల్పించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ అధికారికంగా లేఖలు రాశారు. దీంతో స్పందించిన కలెక్టర్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలాచోట్ల అద్దె భవనాల్లో కనీస వసతులు కరవయ్యాయని, దస్త్రాలకు భద్రత లేదని, ప్రభుత్వ భవన సముదాయంలోకి మారడం ద్వారా సదుపాయాలు మెరుగవుతాయని, అద్దె భారం కూడా తప్పుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.


కొత్తగా 49 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 49 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,92,997కు పెరిగింది. తాజాగా మరో 28 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 7,88,488 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 25న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 398 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,627 నమూనాలను పరీక్షించారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 34 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 28,052 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.


కాటన్‌ వస్త్రానికి కూలి పెంచాలని సమ్మె నేడు

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: కాటన్‌ వస్త్రానికి కూలి ధర పెంచాలని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పవర్‌లూం కార్మికులు, యజమానులు(ఆసాములు) గురువారం ఒక్క రోజు సమ్మె నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాటన్‌ వస్త్రాన్ని నడిపించే మరమగ్గాల కార్మికులకు 10 పిక్కులకు 40 పైసలు, యజమానులకు 80 పైసలు చెల్లిస్తున్నారు. కూలి ఒప్పందం ముగిసి మూడేళ్లవుతున్నా... పెంచడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని, కార్మికులకు 10 పిక్కులకు 55 పైసలు, యజమానులకు రూ.1.10 ఇవ్వాలని కోరుతున్నారు. ఆరు నెలల్లో కూలి ధరలు పెంచుతామని గతంలో జరిగిన చర్చల్లో జిల్లా కార్మికశాఖ అధికారులు హామీ ఇచ్చినా.. ఇంతవరకు ఆ దిశలో చర్యలు తీసుకోలేకపోయారని వారు వాపోయారు. సిరిసిల్ల ప్రాంతంలో పవర్‌లూం కార్మికులు 500 మంది, యజమానులు 100 మంది ఉంటారు.


బొగ్గు గనికి భూకేటాయింపులో మార్పు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి మండలాల్లో చేపట్టే బొగ్గు గనికి గతంలో కేటాయించిన భూమి విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థకు గతంలో 4,877 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, ప్రస్తుతం అంత అవసరం లేదని సంస్థ తెలుపడంతో అందులోనుంచి 3657.69 హెక్టార్లలో గని తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు ఇంధన శాఖతాజా ఉత్తర్వులో తెలిపింది. రామగిరి మండలం జల్లారం, రామయ్యపల్లి, సుందిళ్ల, లద్నాపూర్‌, ఉప్పలంకేశ్వరం, ముస్త్యాల, బుధవారంపేట, మంథని మండలం అక్కెనపల్లి, గుంజపడుగు, కన్నాల, పందులపల్లి, పుట్టపాక, రాచపల్లి, సిరిపురం, అద్రియాల నాగారం గ్రామాల్లోని ఈ భూముల్లో రాబోయే 50 ఏళ్ల పాటు బొగ్గు తవ్వకానికి కేటాయించినట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని