కడెం ఎఫ్‌ఆర్వో కార్యాలయానికి తాళం

నిర్మల్‌ జిల్లా కడెం అటవీ రేంజ్‌ అధికారి కార్యాలయానికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీలత ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది తాళం వేశారు. అటవీ కార్యాలయం, సిబ్బంది నివాసాలకు సంబంధించి పెద్దూరు(కడెం) పంచాయతీకి రూ.1.33 లక్షల ఇంటి పన్ను

Published : 06 Jul 2022 05:41 IST

 ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేదని పంచాయతీ అధికారుల చర్యలు

కక్ష సాధింపు చర్యే: ఎఫ్‌ఆర్వో అనిత

కడెం, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా కడెం అటవీ రేంజ్‌ అధికారి కార్యాలయానికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీలత ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది తాళం వేశారు. అటవీ కార్యాలయం, సిబ్బంది నివాసాలకు సంబంధించి పెద్దూరు(కడెం) పంచాయతీకి రూ.1.33 లక్షల ఇంటి పన్ను బకాయి ఉందని, 12 ఏళ్లుగా చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారనే అభియోగంతో ఈ చర్యలు చేపట్టారు. గతంలో ఇచ్చిన నోటీసులకు జవాబు సైతం ఇవ్వలేదని, కార్యాలయాన్ని జప్తు చేస్తామని సోమవారం నోటీసు ఇచ్చి మంగళవారం సీజ్‌ చేశామని డీపీవో తెలిపారు. ఇది కక్షపూరిత చర్య అని ఎఫ్‌ఆర్వో అనిత అన్నారు. ‘‘సమీప దస్తురాబాద్‌ మండలంలో అటవీ స్థలాల్లో గ్రామ క్రీడాప్రాంగణాలు, ప్రకృతివనాల ఏర్పాటుకు అటవీ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశాం. అందుకే పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇలా రేంజ్‌ కార్యాలయానికి తాళం వేశారు’’ అని తెలిపారు. కార్యాలయం వెలుపల టెంట్‌ వేసుకుని సిబ్బందితో కలిసి మంగళవారం అటవీ అధికారులు విధులు నిర్వహించారు. శాఖాపరమైన చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా కార్యాలయానికి తాళం వేయడం సరికాదని, చట్టపరంగానే తామూ ముందుకు వెళతామని రేంజ్‌ అధికారుల సంఘం ఆదిలాబాద్‌ సర్కిల్‌ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని