తెలుగు వికీపీడియన్‌ ఎల్లంకి భాస్కరనాయుడి కన్నుమూత

పదేళ్లుగా తెలుగు వికీపీడియా రచయితగా, విక్షనరీ, వికీసోర్స్‌లలో విశేష సేవలందించిన ఎల్లంకి భాస్కరనాయుడు(75) వృద్ధాప్య సమస్యలతో శనివారం సాయంత్రం

Published : 12 Sep 2022 03:49 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: పదేళ్లుగా తెలుగు వికీపీడియా రచయితగా, విక్షనరీ, వికీసోర్స్‌లలో విశేష సేవలందించిన ఎల్లంకి భాస్కరనాయుడు(75) వృద్ధాప్య సమస్యలతో శనివారం సాయంత్రం వనస్థలిపురంలోని తన ఇంటి వద్ద కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ నుంచి ఉద్యోగవిరమణ చేసిన ఆయన.. 2011 నుంచి వికీపీడియాలో ఎన్నో రచనలు చేశారు. తెలుగు వికీపీడియాలో రెండు లక్షల పైచిలుకు సవరణలలో 2,500 కొత్త వ్యాసాలను రాయడంతో పాటు, తెలుగు విక్షనరీలో 70 వేలకుపైగా పదాలకు తెలుగు అర్థాలు, వికీకామన్స్‌లో వేలాది బొమ్మలు, వీడియోలు చేర్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. అనేక సదస్సుల్లో పాల్గొని, ఇతర భాషా రచయితలకు మార్గనిర్దేశం చేశారు. చరిత్ర ప్రసిద్ధ హంపి, విజయనగరాలకు సంబంధించిన ఓ ఫ్రెంచి రచనను తెలుగులోకి అనువదించారు. వికీ రచనల ద్వారా అనేక పురస్కారాలు అందుకున్న నాయుడు.. 2015లో తిరుపతిలో జరిగిన తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. డా.అంగజాల రాజశేఖర్‌, తుమ్మల శిరీష్‌కుమార్‌, అర్జునరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి, గుళ్లపల్లి నాగేశ్వరరావు, తుమ్మపూడి సుజాత, బి.కె.విశ్వనాథ్‌, రవిచంద్ర, కె.వెంకటరమణ, యర్రా రామారావు తదితర తెలుగు వికీపీడియన్లు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని