ప్రజా రవాణాలో విద్యుత్తు వెలుగులు

రానున్న రోజుల్లో ప్రజా రవాణాలో పెద్దఎత్తున విద్యుత్తు బస్సులు రానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పెరుగుతుండటంతో విదేశీ మారకద్రవ్యం ఏటేటా తరిగిపోతోంది. విదేశీ

Updated : 26 Sep 2022 05:02 IST

నిర్వహణ వ్యయం తక్కువ

కాలుష్యానికీ చెక్‌

టీఎస్‌ఆర్టీసీలో 40 విద్యుత్తు బస్సులు.. త్వరలో మరో 300

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న రోజుల్లో ప్రజా రవాణాలో పెద్దఎత్తున విద్యుత్తు బస్సులు రానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పెరుగుతుండటంతో విదేశీ మారకద్రవ్యం ఏటేటా తరిగిపోతోంది. విదేశీ మారకద్రవ్య వినియోగాన్ని నియంత్రించడంతో పాటు నగరాల్లో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు విద్యుత్తు బస్సులు అనివార్యమని కేంద్రం భావిస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే విద్యుత్తు వాహనాల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది.

తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 బస్సులను నడుపుతోంది. రానున్న రోజుల్లో మరో 300 దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. నాలుగేళ్లలో వాటి సంఖ్య నాలుగంకెల స్థాయికి చేరుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కరీంనగర్‌, వరంగల్‌లలోనూ నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది.

ఛార్జింగ్‌ సదుపాయాలు పెరిగితేనే..
ఛార్జింగ్‌ సదుపాయాల లేమి కారణంగా కేంద్రం ప్రధాన నగరాలకే విద్యుత్తు బస్సులను పరిమితం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 90 వరకు ఛార్జింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిలో సింహభాగం వ్యక్తిగత వాహనాల కోసం ఏర్పాటు చేసినవే. జాతీయ రహదారుల వెంట అక్కడక్కడా ఛార్జింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. 2025 నాటికి జాతీయ రహదారుల వెంట ఉన్న పెట్రోల్‌ బంకుల్లో కనీసం సగం చోట ఛార్జింగ్‌ సదుపాయం కల్పించాలని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ లక్ష్యాలను రూపొందించింది.


ప్రపంచస్థాయి ప్రమాణాలతో బస్సు తయారీ యూనిట్‌

-కేవీ ప్రదీప్‌, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌

ప్రస్తుతం ఏడాదికి వెయ్యి బస్సులు తయారు చేస్తున్నాం. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి అయిదు వేల బస్సులు, ట్రక్కులను తయారు చేస్తాం. మరో అయిదేళ్లలో ఏడాదికి పది వేల తయారీ సామర్థ్యానికి చేరుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. శంషాబాద్‌ సమీపంలోని సీతారాంపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం 150 ఎకరాల భూమి కేటాయించటంతో పాటు పలు ప్రోత్సాహకాలను అందించింది. అక్కడ వచ్చే 12 నెలల్లో అత్యాధునిక బస్సు తయారీ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాం. అందుకోసం మార్కెట్‌ నుంచి రూ.800 కోట్లు సమీకరించాలని నిర్ణయించాం. 12 రాష్ట్రాల్లో ఆర్టీసీలు మా బస్సులను నడుపుతున్నాయి. ఇప్పటివరకు వెయ్యి బస్సులను సరఫరా చేశాం. మరో 3,775 బస్సులకు ఆర్డర్లున్నాయి. ఒక దఫా ఛార్జింగ్‌ చేస్తే కనిష్ఠంగా 200 కిలోమీటర్లు, గరిష్ఠంగా 500 కిలోమీటర్లు నడిచే సామర్థ్యమున్న బస్సులను తయారు చేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ట్రక్కులనూ మార్కెట్‌లోకి తీసుకొస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని