రూ.1,544 కోట్లతో ఉమ్మడి నల్గొండ అభివృద్ధి

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌ను, తెరాసను గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 02 Dec 2022 04:30 IST

ఆరేడు నెలల్లో నిధులన్నీ ఖర్చుచేస్తాం
దండుమల్కాపూర్‌లో బొమ్మల పార్కు ఏర్పాటు
సమీక్షలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, నల్గొండ: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌ను, తెరాసను గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిగా మునుగోడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉమ్మడి నల్గొండ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి రుణం తీర్చుకుంటామన్నారు. జిల్లాలో రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోనే రానున్న కొద్ది నెలల్లో రూ.1,544 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. ఒక్క మునుగోడులోనే రూ.380 కోట్లు ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పనులన్నీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వీటికి అదనమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రులు జగదీశ్‌రెడ్డి, దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో కలిసి కేటీఆర్‌ మునుగోడులో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘తిరుమల తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేశాం. ఇప్పుడు రోజూ రూ.కోటి ఆదాయం వస్తోంది. 80 వేల మంది భక్తులు వస్తున్నారు. దామరచర్లలో నిర్మిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ఏస్థాయికి చేరుకున్నా విద్యుత్‌ కొరత ఉండదు. దండుమల్కాపూర్‌లో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేశాం. ఇందులోని 579 యూనిట్ల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అక్కడ త్వరలో బొమ్మల పార్కును 100 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా పది వేల మందికి ఉపాధి లభిస్తుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

* రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఎనిమిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 907 కి.మీ.ల రహదారులను రెండు వరుసలుగా విస్తరించినట్టు చెప్పారు. 6,391 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 880 గృహాలను లబ్ధిదారులకు ఇప్పటికే అందించామన్నారు. మిగతావి త్వరలోనే లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.

* గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు తమ శాఖ తరఫున ఎనిమిదేళ్లలో రూ.1,200 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

* మహిళా, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి మాట్లాడుతూ, కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలకు రూ.1,000 కోట్లతో రహదారులు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల క్రమబద్ధీకరణకు 20,444 దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన పూర్తయిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి నల్గొండజిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.


కొత్తగా నాలుగు చేనేత క్లస్టర్‌లు

కొత్తగా భువనగిరి, సంస్థాన్‌ నారాయణపురం, గట్టుప్పల, తెరటుపల్లిలలో చేనేత క్లస్టర్‌లను ఏర్పాటుచేస్తాం. నేతన్నలకు ఇస్తున్న రాయితీ పథకంలోనూ మార్పులుచేశాం. రాయితీ సొమ్ము ముందుగానే అందించాలని ఆదేశాలిచ్చాం. మునుగోడులో వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాం. నారాయణపురం మండల కేంద్రంలో రూ.కోటితో బంజారా భవన్‌ను నిర్మిస్తాం.

కేటీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని