మెదక్‌ జిల్లాలో అగ్నిపర్వత లావా బూడిద

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం హస్తాల్‌పూర్‌ గ్రామంలో అగ్నిపర్వతం లావాకు సంబంధించిన బూడిద గుట్టలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు బీవీ భద్రగిరీష్‌ గుర్తించారు.

Published : 01 Feb 2023 04:58 IST

గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం

ఈనాడు, హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం హస్తాల్‌పూర్‌ గ్రామంలో అగ్నిపర్వతం లావాకు సంబంధించిన బూడిద గుట్టలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు బీవీ భద్రగిరీష్‌ గుర్తించారు. గ్రామం శివార్లలోని నరసింహస్వామిగుట్టకు ఆగ్నేయంగా కిలోమీటరు దూరంలో సుమారు అర కి.మీ. పరిధిలో రెండు అడుగుల లోతులో బూడిద విస్తరించి ఉన్నట్లు కనుగొన్నారు. గ్రామంలోని పాండవుల గుట్టపై చరిత్ర పూర్వ యుగం నాటి రాతి చిత్రాలు ఉండటం, ఆ చుట్టుపక్కల సూక్ష రాతి పరికరాలు లభించడం, ఇనుము కరిగించిన ఆనవాళ్ల కారణంగా ఈ బూడిదను ఇనుము కరిగించిన కొలుముల నుంచి వచ్చినట్లు గ్రామస్థులు భావించేవారు. తాజాగా ఆ బూడిద నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా దానిలో దాదాపుగా కర్బనం లేదని, కిలోకు సుమారు 5 మిల్లీగ్రాముల వరకు గంధకం ఉన్నట్లు తేలింది. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చకిలం వేణుగోపాలరావు ఈ వివరాలను పరిశీలించి ఈ బూడిద 75 ఏళ్ల క్రితం ఇండోనేసియాలో బద్దలైన లోబా అగ్నిపర్వత లావా బూడిదగా నిర్ధారించవచ్చని చెప్పారని భద్రగిరీష్‌ తెలిపారు. సుమత్రా దీవుల్లోని టోబా అగ్నిపర్వతం పేలి వెలువడిన బూడిద నీటి ప్రవాహాల్లో కలిసి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. మంజీరా నదిలో కలిసే హరిద్రానది ఒడ్డున హస్తాల్‌పూర్‌ గ్రామం ఉండటంతో ఇక్కడికి చేరుకొని ఉండొచ్చని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని