చదివింది మరిచిపోతున్నాం!

రాష్ట్రంలో 15వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే.... పరీక్షల సమయం దగ్గరపడేకొద్దీ విద్యార్థులను భయం వెంటాడుతోంది. పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

Updated : 12 Mar 2023 08:52 IST

పరీక్షల ఒత్తిడిని భరించలేకపోతున్నాం
టెలీ మానస్‌ టోల్‌ఫ్రీ నంబరుకు ఇంటర్‌ విద్యార్థుల నుంచి ఫోన్ల వెల్లువ
వారంలో 300 మందికిపైగా కౌన్సెలింగ్‌


జవాబు రాయలేకపోతున్నా..

నేను బాగానే చదువుతున్నా. క్లాసులో అధ్యాపకులు అడిగినప్పుడు సరిగానే సమాధానాలు చెబుతున్నా. పరీక్షల్లో మాత్రం జవాబులు రాయలేకపోతున్నా. చదివింది మరిచిపోతున్నా. ఈ సమస్య నుంచి బయటపడేదెట్లా?

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆవేదన


గుర్తు రావాలంటే ఏం చేయాలి?

పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి. చదివింది మొత్తం గుర్తుండేందుకు ఏమైనా చిట్కాలు చెబుతారా?

ఇంటర్‌ ప్రథమ సంత్సరం విద్యార్థి అభ్యర్థన


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 15వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే.... పరీక్షల సమయం దగ్గరపడేకొద్దీ విద్యార్థులను భయం వెంటాడుతోంది. పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు టెలీ-మానస్‌ 14416 టోల్‌ఫ్రీ నంబరుకు వస్తున్న ఫోన్లే నిదర్శనం. చదివింది మరిచిపోతున్నామని, ఒత్తిడిని భరించలేకపోతున్నామని సైకాలజిస్టులకు వారు మొర పెట్టుకుంటున్నారు. పరీక్షల భయం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలుంటే ఫోన్‌ చేయాలని ఇటీవల ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. టోల్‌ఫ్రీ నంబరులో సైకాలజిస్టులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని, వారు కౌన్సెలింగ్‌ నిర్వహించి, పరిష్కారాలు సూచిస్తారని భరోసా ఇచ్చింది. ఈక్రమంలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల వ్యవధిలోనే 300కిపైగా ఫోన్లు వచ్చాయని టెలీ-మానస్‌ వర్గాలు తెలిపాయి. వీటిలో ఒకట్రెండు మాత్రమే పదో తరగతి వారి నుంచి ఉన్నాయని, మిగిలినవన్నీ ఇంటర్‌ విద్యార్థులే చేశారని వెల్లడించారు. అంటే... ఇంటర్‌ విద్యార్థులే అధికంగా ఒత్తిడికి గరవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎక్కువ మంది చదివింది గుర్తుండటం లేదని, మరిచిపోతున్నామని, ఆందోళనగా ఉందని, ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారని, వారికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని కౌన్సెలర్లు వివరించారు.

అధిక శాతం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే

ఫోన్‌ చేసిన విద్యార్థుల్లో 90 శాతానికిపైగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే ఉన్నారని ఓ కౌన్సిలర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల ఒత్తిడి ఒకటైతే... ఆ తర్వాత జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌లలో అర్హత సాధిస్తామా? మంచి ర్యాంకు వస్తుందా? అన్న ఆందోళన ఈ గ్రూపుల విద్యార్థుల్లో అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ ఫీజు చెల్లించి ప్రైవేట్‌, రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చదివే వారిపై ఇలాంటి ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మార్కులను, ర్యాంకులను కచ్చితంగా తెచ్చుకొని తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తే పిల్లలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

రాష్ట్రంలోనే కాదు... దేశవ్యాప్తంగా టోల్‌ఫ్రీకి విద్యార్థుల నుంచే అధిక శాతం ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీనికి విద్యార్థులతోపాటు మానసిక సమస్యలున్న వారు ఎవరైనా ఫోన్‌ చేయవచ్చు. గత అక్టోబరు నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60 వేల ఫోన్లు వచ్చాయి. అందులో అత్యధికం పరీక్షలకు సంబంధించిన సమస్యలే. ఆ తర్వాత మానవ సంబంధాలు(హ్యూమన్‌ రిలేషన్‌షిప్‌), ఆర్థిక సమస్యలు ఉన్నాయి.

ఇవీ మానసిక కౌన్సెలర్ల సూచనలు

చదివింది మరిచిపోతున్న, ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు టెలీ-మానస్‌ కౌన్సెలర్లు చెబుతున్న పరిష్కారాలు, సూచనలు ఇవీ...

* మొదట పరీక్షలంటే భయం వదలండి. మీరనుకున్నట్లు అవి భయపెట్టవు. ప్రశ్నపత్రం చూడగానే దీనికేనా అంత భయపడిందని అనుకుంటారు.

* మిమ్మల్ని మీరు తోటి విద్యార్థులతో అస్సలు పోల్చుకోవద్దు.  

* అర్ధరాత్రి వరకు చదవడం మంచిది కాదు. అలా చదివినా బుర్రకు ఎక్కదు. ఎక్కువ మంది ఈ తప్పే చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు నిద్రపోయి, ఉదయం 6 గంటలకు లేవండి. కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. కొద్దిసేపు వ్యాయామం/యోగా చేసి... అల్పాహారం తీసుకొని చదవడం ప్రారంభించాలి.

* ప్రతి 45 నిమిషాలు లేదా గంటకు ఒకసారి 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.

* ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ప్రణాళిక వేసుకొని అమలు చేయాలి.

* ఆయా అంశాలపై ముఖ్యమైన పాయింట్లు రాసుకొని... వాటిని తరచూ గుర్తుచేసుకుంటూ ఉండాలి.

పాఠాలను బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్‌లను అర్థం చేసుకొని చదవాలి. అందుకు మీ అధ్యాపకుల సహకారం తీసుకోండి.

* ఏకాగ్రతతో చదవడం ముఖ్యం. దాన్ని దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా చదువుకుంటున్న సమయంలో ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేయండి. టీవీలను కట్టేయండి.

* చదవడంతోపాటు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలను రాయడం, ప్రాక్టీస్‌ చేయడం అత్యంత ముఖ్యం.


ఏమిటీ టెలీ-మానస్‌?

టెలీ మెంటల్‌ హెల్త్‌ అసిస్టెన్స్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ అక్రాస్‌ స్టేట్స్‌ను... సంక్షిప్తంగా టెలీ-మానస్‌గా పిలుస్తారు. అంటే ఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తారు. దీనికి 14416 అనే టోల్‌ఫ్రీ నంబరును ఇచ్చారు. దేశంలో రోజురోజుకూ మానసిక సమస్యలు పెరుగుతుండటం, కరోనా మహమ్మారి తర్వాత సమస్య తీవ్రత మరింత ఎక్కువైన నేపథ్యంలో టోల్‌ఫ్రీ నంబరును ప్రవేశపెడతామని 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు 2022 అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మన రాష్ట్రంలో హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లో ఈ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బెంగళూరులోని నిమ్‌హాన్స్‌ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు కోరుకున్న భాషలో సమస్యను వివరించేలా టోల్‌ఫ్రీ నంబరును రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని