TSLPRB: అభ్యర్థి లేకున్నా సరే!.. ధ్రువపత్రాల పరిశీలనలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెసులుబాటు

ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలనలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెసులుబాటు కల్పించింది.

Updated : 12 Jun 2023 07:56 IST

రక్తసంబంధీకులతో పంపించినా పరిశీలించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలనలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెసులుబాటు కల్పించింది. అత్యవసర పరిస్థితుల్లో అభ్యర్థి రాకున్నా సరే ధ్రువీకరణపత్రాల్ని పరిశీలించాలని నిర్ణయించింది. అయితే ఆ అత్యవసర పరిస్థితిని తెలిపే ఆధారాలను మాత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని వివరిస్తూ అభ్యర్థి స్వయంగా దరఖాస్తు రాసి రక్తసంబంధీకులతో పంపిస్తే సరిపోతుంది. అది సరైనదే అని మండలి వర్గాలు భావిస్తే ఆ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనుంది. ఈనెల 14 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో 1,09,906 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. అంతకు ఒకరోజు ముందునుంచే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం కానుండడంతో పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌ ఎంపికకు దరఖాస్తు చేసిన వారిలో చాలామంది ప్రస్తుతం డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్నారు. అటు డిగ్రీ పరీక్షలు రాయడం.. ఇటు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరు కావడం ఒకేసారి ఎలా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ధ్రువీకరణపత్రాల పరిశీలన ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థనలు సామాజికమాధ్యమాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యంతరాలను ‘ఈనాడు’ మండలి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో తాజా వెసులుబాటును వినియోగించుకోవచ్చని మండలివర్గాలు స్పష్టంచేశాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను వీలైనంత తొందరగా ముగించడానికే మండలి ప్రాధాన్యమిస్తోంది. జులైలో తుది జాబితా ప్రకటించడంపైనే దృష్టి సారించింది. ఈక్రమంలో డిగ్రీ పరీక్షల కారణంతో ధ్రువీకరణపత్రాల పరిశీలన వాయిదా వేయడం సరికాదనే అభిప్రాయంతో ఉంది. అందుకే వెసులుబాటు కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని