Bhadrachalam: రేగా, పొదెం మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం

అధికారం శాశ్వతం కాదని, ప్రతిపక్షాలను గుర్తించాలని భద్రాచలం ఎమ్మెల్యే మండిపడగా ప్రభుత్వ విప్‌ను గౌరవించడం నేర్చుకో అంటూ పినపాక ఎమ్మెల్యే బదులిచ్చారు.

Updated : 25 Aug 2023 07:29 IST

రసాభాసగా బీసీలకు చెక్కుల పంపిణీ 

భద్రాచలం, న్యూస్‌టుడే: అధికారం శాశ్వతం కాదని, ప్రతిపక్షాలను గుర్తించాలని భద్రాచలం ఎమ్మెల్యే మండిపడగా ప్రభుత్వ విప్‌ను గౌరవించడం నేర్చుకో అంటూ పినపాక ఎమ్మెల్యే బదులిచ్చారు. ఈ వాగ్వాదం తార స్థాయికి చేరుకోవడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. గురువారం భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో చేపట్టిన బీసీ కుల చేతి వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ... నియోజకవర్గంలో అర్హుల జాబితా ఎవరు తయారు చేశారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రాన తనకు జాబితా చూపించకపోవడం పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ అధికారులతోపాటు కలెక్టర్‌ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు మాట్లాడేందుకు ప్రయత్నించగా తన నియోజకవర్గంలో ఆయన మాట్లాడవద్దని పొదెం పట్టుపట్టారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ కల్పించుకొని.. ఆయన విప్‌ హోదాలో ఉన్నందున ప్రభుత్వం తరఫున మాట్లాడతారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేగా మాట్లాడుతుండగా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ఆయన చేతిలో ఉన్న మైకును పొదెం లాక్కున్నారు. ఒక్కసారిగా ఇరు వర్గాల కార్యకర్తలు కేకలు వేయడంతో కొద్ది సేపు గందరగోళం చోటు చేసుకుంది. కొంత మంది నాయకులను ఆ వేదిక వద్ద నుంచి పోలీసులు బయటకు తీసుకెళ్లారు. తాను ప్రభుత్వ విప్‌గా వచ్చానని సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి చెప్పడానికి మీ అనుమతి అవసరం లేదని ఘాటుగా స్పందించారు. దరఖాస్తు చేసినవారిలో అర్హులైన వారందరికీ ఈ పథకం అందిస్తామని భరోసా కల్పించారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ వెల్లడించారు. వాదోపవాదాల మధ్యనే చెక్కులను పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని