ఉన్నతస్థాయి కమిటీ నివేదిక వచ్చేదాకా జీవో 111 షరతులు కొనసాగుతాయి

జీవో 111లోని షరతుల సడలింపుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించేదాకా ఆ జీవోలోని షరతులు కొనసాగుతాయని హైకోర్టుకు ప్రభుత్వం శుక్రవారం నివేదించింది.

Published : 23 Sep 2023 05:21 IST

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: జీవో 111లోని షరతుల సడలింపుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించేదాకా ఆ జీవోలోని షరతులు కొనసాగుతాయని హైకోర్టుకు ప్రభుత్వం శుక్రవారం నివేదించింది. జీవో 111లోని షరతులను తొలగిస్తూ.. వాటిపై అధ్యయనం చేయడానికి వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 69 జారీ చేశామని, కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. జీవో 111ను సవరించడాన్ని, ఈ ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ 2007లో ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ కౌంటర్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నీటి పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యకారక పరిశ్రమలు, హోటళ్లు, నివాస కాలనీల నిర్మాణాలను నిషేధిస్తూ 1996లో ప్రభుత్వం జీవో 111 జారీ చేసిందన్నారు. ఈ జీవో పరిధిలో 84 గ్రామాలున్నాయని తెలిపారు. కొన్ని నిబంధనలను సడలించామని, దీనిపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

కమిటీ నివేదిక అందాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా అయ్యేదన్నారు. ప్రస్తుతం నగరానికి సరఫరా అయ్యే మొత్తం నీటిలో జంట జలాశయాల నుంచి సరఫరా అయ్యేది 1.5 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుత తాగునీటి అవసరాలకు 12 టీఎంసీలు అవసరమని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గోదావరిల నుంచి 30 టీఎంసీలు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ హామీని రికార్డు చేయాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌.రవిచందర్‌, కె.ఎస్‌.మూర్తి కోరారు. జీవో 111 లక్ష్యం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం నివేదిక నిమిత్తం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని