పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు!

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి.. పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Updated : 09 Mar 2024 07:08 IST

ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ యోచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి.. పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంతమేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థికసాయం అందించింది. ఈ మేరకు గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి 2016-17లో ఒకసారి రూ.1,100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థికసాయం అందింది. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ సుమారు రూ.430 కోట్ల వరకు కేంద్రం నుంచి అందనున్నాయి.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విధించిన నిబంధనలు అంత అనుకూలంగా లేవన్నది అధికారుల అభిప్రాయం. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు సహాయాన్ని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండటంతోపాటు షరతులూ అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం రూ.72 వేలు మాత్రమే అందజేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నర మినహాయించి మిగిలిన రూ.మూడున్నర లక్షలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.

ఇళ్లపై రెండు లోగోలు..!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించే పక్షంలో తాము రూపొందించిన లోగోను విధిగా ముద్రించాలన్నది కేంద్రం విధించిన షరతుల్లో ఒకటి కాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లోగోను తయారు చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల్లో సైతం ఈ అంశాన్ని పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే కీలకం..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల పాత్ర కీలకంగా ఉంది. ఏ గ్రామంలో, పురపాలికల్లో ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలన్న అంశం నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులదే తుది నిర్ణయంగా ఉంది. ఇంటి నిర్మాణాన్ని రెండు దశల్లో పరిశీలించేందుకు గాను.. ‘చెకర్స్‌, మార్కర్స్‌’ పేరిట తనిఖీ అధికారులను ఎంపిక చేయడంలోనూ ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని