మాజీ ఎమ్మెల్యే ఎన్‌.సుధాకర్‌రావు మృతి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.సుధాకర్‌రావు(73) బుధవారం రాత్రి కన్నుమూశారు.

Published : 14 Mar 2024 04:32 IST

పాలకుర్తి, రెజిమెంటల్‌ బజార్‌-న్యూస్‌టుడే, ఈనాడు-హైదరాబాద్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.సుధాకర్‌రావు(73) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1950లో జన్మించిన సుధాకర్‌రావు.. స్వస్థలం పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి. 1999 ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం(ప్రస్తుతం పాలకుర్తిలో అంతర్భాగం)లో తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన తండ్రి, మాజీ మంత్రి ఎన్‌.యతిరాజారావు ఏడుసార్లు, తల్లి విమలదేవి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత భారాస ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్‌గా సుధాకర్‌రావు విధులు నిర్వహించారు. ఆయన భౌతికకాయానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సుధాకర్‌రావు సేవలు చిరస్మరణీయం: కేసీఆర్‌

మాజీ ఎమ్మెల్యే ఎన్‌.సుధాకర్‌రావు మృతిపై భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డాక్టర్‌ సుధాకర్‌రావు మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని