Cyber Crime: హానిచేసే సమాచారం ఆటకట్టు

అంతర్జాలం వేదికగా జరుగుతున్న అడ్డగోలు ప్రచారాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పుడు వార్తలతో విద్వేషాలు రెచ్చగొట్టడం, అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి వాటిని అరికట్టడంపై దృష్టిపెట్టింది.

Updated : 20 Mar 2024 06:22 IST

రంగంలోకి భారత సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం
తప్పుడు వార్తల మూలాలు పసిగట్టి... నివారించే వ్యవస్థ

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాలం వేదికగా జరుగుతున్న అడ్డగోలు ప్రచారాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పుడు వార్తలతో విద్వేషాలు రెచ్చగొట్టడం, అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి వాటిని అరికట్టడంపై దృష్టిపెట్టింది. ఇలాంటి సమాచారం ఎక్కడుందో గుర్తించి... దాన్ని తొలగించేలా సదరు సంస్థను ఆదేశించే అధికారాన్ని భారత సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ)కి కట్టబెట్టింది. ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై ఏదైనా తప్పుడు సమాచారం అంతర్జాలంలో చెలామణి అవుతుంటే తక్షణమే దాన్ని తొలగించే అవకాశం ఉంటుంది.

సోషల్‌మీడియా వినియోగం విస్తృతమైన తర్వాత సమాచారం శరవేగంగా అందరికీ చేరిపోతుంది. ఇందులో పెద్దఎత్తున తప్పుడు సమాచారమూ ఉంటోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం, రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు అనని మాటలు అన్నట్లు గందరగోళం సృష్టించడం సాధారణమైపోయింది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి సమాచారాన్ని గుర్తించడం, దాన్ని తొలగించేలా సంబంధిత సంస్థను ఆదేశించడం స్థానిక యంత్రాంగానికి సవాలుగా మారింది. ఉదాహరణకు హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఏదైనా సందేశం ప్రసారం అవుతుందని ఎవరైనా గుర్తిస్తే, పోలీసులు దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. ఈ సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందో, దాని మూలం ఎక్కడుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతోంది.

ఇలాంటి సందర్భాల్లో ఆయా సంస్థలకు లేఖ రాసే అధికారం కేంద్ర ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ శాఖకు మాత్రమే ఉంటుంది. స్థానిక పోలీసులు సంబంధిత సంస్థకు లేఖ రాసినా ఉపయోగం ఉండడం లేదు. స్థానిక పోలీసులు సమాచార శాఖకు తెలియజేసి... ఆ శాఖ అధికారులు సంబంధిత సంస్థను చర్యలకు అదేశించేలోగా సదరు తప్పుడు సమాచారం జనాల్లోకి వెళ్లి తీవ్ర నష్టం చేస్తోంది. ఇటువంటి సందర్భాల్లో ఆలస్యాన్ని నివారించి, తప్పుడు సమాచారాన్ని సత్వరమే తొలగించేలా చూసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ‘ఐ4సీ’ని నోడల్‌ ఏజెన్సీగా గుర్తించింది. స్థానిక దర్యాప్తు సంస్థలు ఏవైనా తప్పుడు లేదా హానికరమైన సమాచారం వ్యాప్తి జరుగుతోందని గుర్తిస్తే అదే విషయాన్ని ‘ఐ4సీ’ చెప్పాల్సి ఉంటుంది. అది ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాప్తి చెందుతుందో ‘ఐ4సీ’ గుర్తిస్తుంది. దాన్ని వెంటనే తొలగించాలని సదరు సంస్థను ఆదేశిస్తుంది. ఇలా అదేశించే అధికారాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కొత్తగా ‘ఐ4సీ’కి కట్టబెట్టింది. దీంతో తప్పుడు సమాచారాన్ని గుర్తించి, తొలగించడం సులభమవుతుంది. ఇలాంటి సమాచారం వల్ల జరిగే నష్టాన్ని నివారించే అవకాశం ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని