హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బాధ్యతల స్వీకరణ

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ మంగళవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే.. జస్టిస్‌ సుజయ్‌పాల్‌తో ప్రమాణం చేయించారు.

Published : 27 Mar 2024 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ మంగళవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే.. జస్టిస్‌ సుజయ్‌పాల్‌తో ప్రమాణం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ చదివి వినిపించారు. జస్టిస్‌ సుజయ్‌పాల్‌ మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. 1964 జూన్‌ 21న జన్మించిన ఆయన బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్‌, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా... 2014 ఏప్రిల్‌ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో మార్చి 21న జస్టిస్‌ సుజయ్‌పాల్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరరావు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సుజయ్‌పాల్‌ కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్‌ సుజయ్‌పాల్‌ ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్‌లో కేసుల విచారణ చేపట్టారు. కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వస్తున్న జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు