ఐఎంజీ భూకేటాయింపు వ్యవహారం.. సీబీఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్‌ విచారణ వాయిదా

ఐఎంజీ అకాడమీస్‌ భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 850 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్‌ మొదటివారానికి వాయిదా వేసింది.

Updated : 27 Mar 2024 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐఎంజీ అకాడమీస్‌ భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 850 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్‌ మొదటివారానికి వాయిదా వేసింది. క్రీడాభివృద్ధిలో భాగంగా స్టేడియాల నిర్మాణం, నిర్వహణ తదితరాల కోసం 850 ఎకరాల కేటాయింపులో అక్రమాలున్నాయని దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని న్యాయవాది టి.శ్రీరంగారావు 2012లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ సుజయ్‌పాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. సీబీఐతో విచారణ చేయించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి గడువు కావాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరారు. ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేయడాన్ని సమర్థిస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. అది తేలేదాకా పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలంటూ ఐఎంజీ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ కోరారు. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌తో ఇక్కడి ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధం లేదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు తెలిపారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని