రాజ్‌భవన్‌లో సీతారామ కల్యాణం

రాజ్‌భవన్‌లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, సతీమణి సుమతి రాధాకృష్ణన్‌తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 18 Apr 2024 05:29 IST

పాల్గొన్న ఇన్‌ఛార్జి గవర్నర్‌ దంపతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, సతీమణి సుమతి రాధాకృష్ణన్‌తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించారు. శ్రీరాముడి అనుగ్రహం రాష్ట్రం, దేశంపై ఉండాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్‌ కార్యాలయం ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్‌, ఇతర కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


సీఎం స్వగ్రామంలో శ్రీరామనవమి

ముఖ్యమంత్రి సతీమణి హాజరు

వంగూరు, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీ సీతారాముల కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి ఎనుముల గీతారెడ్డి పాల్గొన్నారు. సీఎం సోదరుడు కృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


డ్రోన్‌ హనుమాన్‌ ప్రదక్షిణలు

శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్‌ గ్రామీణ మండలం కౌట్ల(కె) గ్రామ రామాలయం వద్ద థర్మాకోల్‌తో తయారు చేసిన హనుమాన్‌ రూపం ఆకట్టుకుంది. మాలధారులు తయారు చేసిన ఆ విగ్రహాన్ని డ్రోన్‌కు జతచేసి ఆలయం చుట్టూ వినూత్నంగా ప్రదక్షిణలు చేయించడంతో భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

 నిర్మల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే


రాజధానిలో వైభవంగా శ్రీరామనవమి శోభాయాత్ర

రాజధాని హైదరాబాద్‌ వీధులు జైశ్రీరామ్‌ నినాదాలతో మార్మోగాయి. భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌ నుంచి కోఠి వరకు శ్రీరాముని పల్లకీ సేవా శోభాయాత్ర బుధవారం నిర్వహించారు. సుమారు ఏడు కిలోమీటర్లు భక్తి పారవశ్యంతో సాగిన ఈ శోభాయాత్రలో ప్రధాన రహదారులన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. పురానాపూల్‌ చౌరస్తా వద్ద భక్త జనసందోహమిది.

 న్యూస్‌టుడే, ధూల్‌పేట, బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని