కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణపై ఏపీ దాఖలుచేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదు

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలతోపాటు వాటి అవుట్‌లెట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని కృష్ణా ట్రైబ్యునల్‌-1 తీర్పు ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.

Updated : 01 May 2024 05:35 IST

సుప్రీంకోర్టులో వాదించిన తెలంగాణ
లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థానం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలతోపాటు వాటి అవుట్‌లెట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని కృష్ణా ట్రైబ్యునల్‌-1 తీర్పు ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుటకు విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద వ్యాజ్యాన్ని విచారించే అధికారం తమకు ఉందని కోర్టు పేర్కొనగా.. జల వివాదాలను విచారించే అధికారం కోర్టుకు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇది వరకే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో ధర్మాసనం ఈ కేసు విచారణార్హత, మధ్యంతర ఉపశమనం ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వంతోపాటు, ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు ఛైర్మన్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ జెన్‌కో సీఎండీలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని