London: లండన్‌ లూటన్‌ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం

కొత్తగా నిర్మించిన కారు పార్కింగ్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంతో లండన్‌లోని లూటన్‌ విమానాశ్రయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Updated : 12 Oct 2023 05:41 IST

కారు పార్కింగ్‌లో భారీగా మంటలు  
పదుల సంఖ్యలో విమానాల రద్దు

లండన్‌: కొత్తగా నిర్మించిన కారు పార్కింగ్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంతో లండన్‌లోని లూటన్‌ విమానాశ్రయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దీంతో వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. లూటన్‌ ఎయిర్‌పోర్టు సెంట్రల్‌ లండన్‌కు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఐరోపా దేశాలకు చౌక ధరలో సేవలందించే విమానయాన సంస్థలు సర్వీసులను నడుపుతుంటాయి. మంగళవారం సాయంత్రం బహుళ అంతస్థుల పార్కింగ్‌ భవనంలోని ఎగువున నిలిపిన కారు నుంచి మొదలైన మంటలు వేగంగా మిగతా భాగాలకు విస్తరించాయి. పార్కింగ్‌ గ్యారేజి టెర్మినళ్లు రెండు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. దట్టమైన పొగ కారణంగా ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అతికష్టం మీద మంటలు అదుపులోకి తెచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేయడంతో చాలా మంది ప్రయాణికులు సమీపంలోని రైల్వే స్టేషన్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. సాయంత్రం నుంచి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు ప్రారంభయ్యాయి. విమానాల రాకపోకలు మొదలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని