Hamas: ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌ అగ్రనేత కుమారుడి మృతి?

Hamas: రఫా నగరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు తీవ్రం చేసింది. వీటిలో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే కుమారుడు హజెం హనియే మృతిచెందినట్లు సమాచారం.

Published : 11 Feb 2024 11:04 IST

గాజా: ఇజ్రాయెల్‌ తాజా వైమానిక దాడుల్లో హమాస్‌ (Hamas) అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే కుమారుడు హజెం హనియే (22) మృతి చెందినట్లు సమాచారం. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో అతడు చనిపోయాడని స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్‌ (Israel) సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు కాలేజీ విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు తీవ్రం చేసిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

రఫాలో శనివారం ఇజ్రాయెల్‌ (Israel) వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి. త్వరలో భూతల దాడులకూ సన్నద్ధమవుతున్నారని సమాచారం. గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. తాజాగా అక్కడ కూడా దాడులు ప్రారంభం కావటంతో సామాన్య పౌరులు కలవరపాటుకు గురవుతున్నారు.

రఫాపై దాడులను పలు దేశాలు తప్పుబట్టాయి. పౌరుల విషయంలో ఒక నిర్ణయానికి రాకుండా రఫాను ఆక్రమించుకోవాలనుకోవడం సరికాదని అమెరికా వాదిస్తోంది. గాజా జనాభాలో సగం మంది అక్కడే తలదాచుకుంటున్నారని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ అన్నారు. వేలాది మంది సామాన్య పౌరులు మరణించే ప్రమాదం ఉందని నెదర్లాండ్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సౌదీ అరేబియా హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని