Israel-Hamas: ఐసీజే ఆదేశిస్తే కాల్పుల విరమణకు కట్టుబడతాం: హమాస్‌

Israel-Hamas: ఇజ్రాయెల్‌ మానవ హననానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ఐసీజే శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు ఆదేశిస్తే కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని హమాస్‌ ప్రకటించింది.

Published : 26 Jan 2024 08:31 IST

ద హేగ్‌: ఐరాస అత్యున్నత న్యాయస్థానం (International Court of Justice - ICJ) ఆదేశిస్తే ఇజ్రాయెల్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని హమాస్ (Hamas) గురువారం ప్రకటించింది. అయితే, ఇజ్రాయెల్‌ సైతం దాన్ని అమలు చేయాలని షరతు విధించింది. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న బందీలనూ విడిచిపెడతామని చెప్పింది. గాజా స్ట్రిప్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ (Israel) దిగ్బంధనానికి ముగింపు పలకాలని కోరింది. ఈ భూభాగంలోకి మానవతా సహాయం, పునర్నిర్మాణ సామగ్రిని అనుమతించాలని విన్నవించింది.

గాజాలో ఇజ్రాయెల్‌ మానవ హననానికి (యుద్ధ నేరం) పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ఐసీజే (ICJ) శుక్రవారం తీర్పు వెలువరించనుంది. అయితే ఈ కేసు తేలడానికి ఏళ్లు పట్టే అవకాశమున్నందున కనీసం ఇజ్రాయెల్‌ (Israel) దాడులను వెంటనే ఆపేలా ఆదేశాలివ్వాలని దక్షిణాఫ్రికా కోరుతోంది. గాజాలో హమాస్‌పై (Hamas) ఇజ్రాయెల్‌ సైనిక చర్య భారీ ప్రాణ నష్టానికి దారి తీస్తోందని, దానిని ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

సహాయం కోసం వేచి ఉన్నవారిపై దాడి

ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సంస్థలను ఇజ్రాయెల్‌ (Israel) పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజా మానవ హనన ఫిర్యాదుపై ఆ దేశం ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. దక్షిణాఫ్రికా కేసుకు లీగల్‌ ఫౌండేషన్‌ లేదని స్పష్టం చేసింది. ఆ దేశం రాజకీయ ఉద్దేశాలతో కేసు వేసిందని పేర్కొంది. ఐసీజే ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. తమని ఎవరూ ఆపలేరని.. హమాస్‌ను అంతమొందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని