Kim-Putin: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. 10లక్షల ఫిరంగి గుండ్లు!

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాకు ఆగస్టులోనే దాదాపు 10లక్షలకు పైగా ఫిరంగి గుండ్లను ఉత్తర కొరియా పంపించి ఉండవచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం అంచనా వేసింది.

Published : 01 Nov 2023 19:32 IST

సియోల్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో మొదలుపెట్టిన దండయాత్రను (Russia Invasion).. గడిచిన 20 నెలలుగా రష్యా కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆయుధాల కోసం ఉత్తర కొరియా (North Korea) సహాయం తీసుకుంటోందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యాకు ఆగస్టులోనే దాదాపు 10లక్షల ఫిరంగి గుండ్లను ఉత్తర కొరియా పంపించి ఉండవచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం అంచనా వేసింది. ఉత్తర కొరియా నుంచి రష్యా ఆయుధాలు కొనుగోలు చేయనుందని గతంలో అమెరికా కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.

నౌకలు, ఇతర మార్గాల ద్వారా ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆగస్టులో దాదాపు 10లక్షల ఫిరంగి గుండ్లు తరలించినట్లు దక్షిణ కొరియా (South Korea) జాతీయ నిఘా విభాగం భావిస్తున్నట్లు స్థానిక చట్టసభ సభ్యుడు యూ సాంగ్‌-బుమ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా రష్యా ఆయుధ సామగ్రి డిమాండుకు అనుగుణంగా ఆయుధ కర్మాగారాలను పూర్తి స్థాయిలో నడిపిస్తోందని చెప్పారు. ఉత్పత్తిని భారీగా పెంచేందుకు జనసమీకరణ కూడా చేస్తోందన్నారు. ఇవే కాకుండా ఆయుధాలను ఎలా వినియోగించాలనే విషయాన్ని రష్యా అధికారులకు తెలియజేసేందుకు ఆయుధ నిపుణులను కూడా మాస్కోకు పంపించిందనే సంకేతాలు ఉన్నాయన్నారు. నిఘా విభాగంతో భేటీ అయిన అనంతరం యూ సాంగ్‌-బుమ్‌ ఈ విషయాలను వెల్లడించారు.

ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచండి

అగ్రరాజ్యం అమెరికాపై కాలుదువ్వే రష్యా, ఉత్తర కొరియా అధినేతలు.. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ సెప్టెంబర్‌లో భేటీ అయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతికను రష్యా అందించడం, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పుతిన్‌కు అవసరమైన మందుగుండు సామగ్రిని అందించేందుకు కిమ్‌ అంగీకరించారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లు, ఇతర మార్గాల్లో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే, వీటిని మాత్రం ఇరు దేశాలు ఖండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని