Israel-Hamas: ఇజ్రాయెల్‌పై దాడి ఘటనలో ఉద్యోగుల పాత్ర.. కీలక నిర్ణయం తీసుకున్న యూఎన్‌ ఏజెన్సీ

గతేడాది ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి సుమారు 1200 మందిని బలిగొన్న ఘటనలో హమాస్‌కు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగులు సహాయం చేశారన్న ఆరోపణ నేపథ్యంలో అనుమానిత సిబ్బందిని తొలగించినట్లు ఆ ఏజెన్సీ ప్రకటించింది.   

Updated : 27 Jan 2024 09:20 IST

జెరూసలెం: పాలస్తీనా శరణార్థుల అభివృద్ధి, సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి (United Nations) ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ (Hamas) దాడి ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. ఆ నాటి దాడి ఘటనలో ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలను ఇజ్రాయెల్‌ అధికారులు తమకు అందజేశారని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజారిని పేర్కొన్నారు. మానవతా సాయం అందించే యూఎన్‌ ఏజెన్సీని రక్షించే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఇందులో ఎంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉంది.. వారు ఎలాంటి పాత్ర పోషించారన్న వివరాలు వెల్లడించలేదు. 

పాలస్తీనా ప్రజలపై ఐడీఎఫ్‌ దళాలు మారణకాండ ఆపాలని, గాజా పౌరులకు సహాయం అందించాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పిన వేళ.. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఈ ప్రకటన చేసిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రతినిధి ఐలాన్‌ లెవీ ఆరోపించారు. మరొక రోజు ఈ ప్రకటన చేసుంటే ఇది హెడ్‌లైన్లలో నిలిచేదన్నారు. యూఎన్‌ ఉద్యోగులకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇజ్రాయెల్‌ సమర్పించిందని లెవీ అన్నారు. మరోవైపు ఉద్యోగుల ప్రమేయం, విచారణ నేపథ్యంలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు సంబంధించి తక్షణమే సమగ్రమైన స్వతంత్ర సమీక్ష జరపనున్నట్లు యూఎన్‌ చీఫ్‌ గుటెరస్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ తెలిపారు. ఇలాంటి ఆందోళనల నేపథ్యంలో సదరు ఏజెన్సీపై వచ్చిన ఆరోపణలను సమీక్షించడానికి తాత్కాలికంగా నిధులను ఆపేసినట్లు అమెరికా తెలిపింది. ఇజ్రాయెల్‌పై దాడి ఘటనలో 12 మంది ఉద్యోగుల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు.

ఇక గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి ఘటనలో సుమారు 1200 మంది చనిపోయారు. 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్‌ బలగాలు హమాస్‌ లక్ష్యంగా గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 26,083 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని