Jacinda Ardern: మాతృత్వానికి అడ్డు కాకూడదనే రాజకీయాలకు గుడ్‌బై.. మాజీ ప్రధాని

మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు న్యూజిలాండ్ (New Zealand) మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ (Jacinda Ardern) తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంట్‌లో వీడ్కోలు సభలో ప్రసంగించిన ఆమె పర్యావరణ పరిక్షణ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Updated : 11 Apr 2023 15:16 IST

వెల్లింగ్టన్‌: మహిళలకు నాయకత్వానికి(Leadership), రాజకీయాలకు(Politics) మాతృత్వం(Motherhood) అడ్డు కాకూడదని న్యూజిలాండ్‌(New Zealand) మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ (Jacinda Ardern) అన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని పదవికి ఆమె రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో వీడ్కోలు సభలో ప్రసంగించారు. 

‘‘మంచి తల్లిగా ఉండేందుకే నేను రాజకీయాలను నుంచి వైదొలుగుతున్నా. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు, నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మాతృత్వం అడ్డంకి కాకూడదు. లేబర్‌ పార్టీ నాయకురాలిగా ఎన్నికైనప్పుడు నేను నా మాతృత్వాన్ని కోల్పోవాలని అనుకోలేదు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంతో సంతోషించా. రాజకీయ నాయకులు కూడా మనుషులే. వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రజలకు సేవ చేస్తారు. తర్వాత వారి కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. దేశానికి నాయకత్వం వహించడం ఎంతో ఉన్నతమైంది. ప్రస్తుతం వాతావరణ మార్పు మన ముందు ఉన్న పెద్ద సంక్షోభం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సందర్భంగా అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పర్యావరణ పరిక్షణ విషయంలో మాత్రం రాజకీయాలు చేయకండి. రాజకీయాలను దానికి దూరంగా ఉంచండి’’ అని జెసిండా తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

2017లో న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎన్నికైన జెసిండా.. 2018లో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రధానిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళా ప్రధానిగా నిలిచారు. పాక్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో తర్వాత వివిధ రంగాల్లో పనిచేసే మహిళలకు పెద్ద పీట వేస్తూ.. శక్తిమంతమైన మహిళా నేతగా ఎదిగారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో ఉగ్రదాడి, ప్రకృతి విపత్తు, కరోనా వంటి ఎన్నో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో దేశాన్ని నడిపించిన తీరు, ఉగ్రదాడి ఘటనలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన జెసిండా ‘క్రైసిస్‌ మేనేజర్‌’ అనే బిరుదును సంపాదించుకున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ కోల్పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని, మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు జెసిండా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని