close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనకీ ఓ బ్రాండ్‌ ఉండాలని!

మనకీ ఓ బ్రాండ్‌ ఉండాలని!

ఇంటెల్‌కి చిప్‌ తయారీ కంపెనీని అమ్మడం, ఎస్కిమోలకు ఐస్‌ అమ్మడం ఒక లాంటివే! ‘సాఫ్ట్‌ మెషీన్స్‌’ సహ వ్యవస్థాపకుడు మహేష్‌ లింగారెడ్డి ఆ పనేచేశాడు. ఇప్పుడు ‘స్మార్ట్‌రాన్‌’ ఉత్పత్తులతో భారత్‌ నుంచి ఓ అంతర్జాతీయ బ్రాండ్‌ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్‌ కేంద్రంగా ‘స్మార్ట్‌రాన్‌’ను ప్రారంభించిన మహేష్‌ ప్రస్థానం అతడి మాటల్లోనే...

విశాఖపట్నంలోని గీతం కాలేజీలో ఇంజినీరింగ్‌(ఈసీఈ) చేశాను. 1997లో ఇంజినీరింగ్‌ పూర్తి అయింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఎంపికయ్యాను. కానీ తయారీ రంగంలో ఉండాలనేది నా కోరిక. అందుకే అందులో చేరలేదు. ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌ నుంచీ జీఆర్‌ఈకి సిద్ధమయ్యేవాణ్ని. ఇంజినీరింగ్‌ పూర్తయిన ఏడాదే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టోలెడోలో ఎం.ఎస్‌. సీటు వచ్చింది. అక్కడ కూడా స్నేహితుల్లో చాలామంది శాప్‌, ఒరాకిల్‌ కోర్సులు చేసేవారు. నేను మాత్రం కోర్‌ సబ్జెక్ట్‌ అయిన ఎలక్ట్రానిక్స్‌పైనే దృష్టిపెట్టాను. ఎం.ఎస్‌. ఏడాదిలోనే పూర్తిచేశాను. తర్వాత నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక చిప్‌ తయారీ స్టార్టప్‌లో చేరాను. అక్కడ దాదాపు 100 మంది పనిచేసేవారు. అందరిలోకీ నేనొక్కడినే ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌ని. 1999 ప్రాంతంలో ఐటీ బబుల్‌ పేలింది. ఆ దెబ్బకు చాలా కంపెనీలు దుకాణం కట్టేశాయి. ఎవరికీ పెట్టుబడులు దొరికేవి కాదు. దాంతో కంపెనీలు ఐపీవోకి వెళ్లేవి. అక్కడ డబ్బు రాకపోతే మూతపడేవి. ఆ పరిస్థితే నేను పనిచేసిన కంపెనీకీ వచ్చింది. అందరూ ఉద్యోగాలు మానేశారు. ఏం చేయాలో తెలియక నేను అక్కడే ఉండిపోయాను. కంపెనీ సీయీవోతోపాటు ఏడుగురం మిగిలాం. అక్కడ ఏడాదిపాటు జీతం లేదు. ఆ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు. ఒక కంపెనీ సీయీవో దగ్గర రోజూ నేర్చుకునే అవకాశం ఎంత మంది ఫ్రెషర్స్‌కి వస్తుంది. ఆయన దగ్గర ఒకవైపు టెక్నాలజీ మరోవైపు బిజినెస్‌ పాఠాలు నేర్చుకున్నాను. ఆ అనుభవమే నాకు మిలియన్‌ డాలర్లు తెచ్చి పెట్టింది. తర్వాత ఆ కంపెనీని ఇంటెల్‌ చేజిక్కించుకుంది. అలా ఇంటెల్‌ ఉద్యోగిని అయ్యాను. అక్కడ నేను పనిచేసిన ఏడేళ్లలో మా బృందం మూడు కీలక ఉత్పత్తులు తెచ్చింది. 150 మంది ఉండే టీమ్‌కి లీడర్‌గా పనిచేశాను. అదే సమయంలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ చేశాను. ఇంటెల్‌ లాంటి పెద్ద కంపెనీల్లో ఆర్థికపరమైన అవధులూ, పరిమితులూ ఉండవు. కాబట్టి ప్రయోగాలకు మంచి అవకాశం దొరుకుతుంది. రిస్కు తీసుకునే ఉద్యోగులకు అవకాశం ఇస్తారు.

సొంత కంపెనీ
ఇంటెల్‌లో అంతా బావుండేది. కానీ సొంత సంస్థని ప్రారంభించాలనేది నా కల. ఇంటెల్‌లో పాలస్తీనాకు చెందిన సహోద్యోగి మహ్మద్‌ అబ్దుల్లాతో పరిచయం ఏర్పడింది. తను కంప్యూటర్‌ ఆర్కిటెక్ట్‌. మేం తరచూ పరిశ్రమలోని మార్పుల గురించి చర్చించేవాళ్లం. ‘ఇంటెల్‌కంటే మెరుగ్గా పనిచేసే ప్రాసెసర్‌ని మనం తయారుచేయాలి’ అనుకునేవాళ్లం. నిజానికి మైక్రోసాఫ్ట్‌, సిస్కోల నుంచి బయటకు వచ్చినవారి విజయగాథలు విన్నాం కానీ ఇంటెల్‌ నుంచి వచ్చిన వారి గురించి అలాంటివి వినలేదు. అయినా మాపైనా, సిలికాన్‌ వ్యాలీపైనా నమ్మకం ఉంచి ముందడుగు వేశాం. అక్కడ మన ప్రయత్నానికి వయసు, రంగు, జాతి ఇవేవీ అడ్డం కావు. కంప్యూటర్‌ పనిచేసే వేగాన్ని పెంచే చిప్స్‌ తయారుచేయాలనేది మా లక్ష్యం. కానీ అందుకు 5-10 ఏళ్లు పట్టొచ్చు. అన్నాళ్లు ఆదాయం లేకపోయినా కంపెనీని నడపగలగాలి. అదీ అసలైన సవాలు. ఇంటెల్‌ నుంచి బయటకు వచ్చాక ఆరు నెలలు ఖాళీగా ఉన్నాం. ఎందుకంటే, పొరపాటున కూడా ఇంటెల్‌లో ప్రాజెక్టుల్ని మేం అనుసరించకూడదు. తెలియక చేసినా కాపీరైట్‌ సమస్యలు వచ్చి చిక్కుల్లో పడొచ్చు. ఆ తర్వాత మేం పొదుపు చేసుకున్న దాదాపు కోటి రూపాయల పెట్టుబడికి తోడు మరో ఏంజిల్‌ ఇన్వెస్టర్‌ని సంస్రదిస్తే రూ.కోటి ఇచ్చారు. ఆ డబ్బుతో 2006లో ‘సాఫ్ట్‌ మెషీన్స్‌’ పేరుతో కంపెనీని ప్రారంభించాం. నేను హిందూ, మహ్మద్‌ ముస్లిం, మా మొదటి ఇన్వెస్టర్‌ ‘లూథరన్‌’ క్రిస్టియన్‌. అదే సిలికాన్‌ వ్యాలీ గొప్పతనం. ప్రారంభంలో ‘యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా’లో చదువుతున్న పరిశోధక విద్యార్థుల్ని ఉద్యోగులుగా చేర్చుకున్నాం. వాళ్లకి జీతంతోపాటు కంపెనీలో షేర్లు ఇచ్చాం. తర్వాత ఇంటెల్‌లో పనిచేసినవారిలో కొందరు వచ్చి చేరారు. వారంతా మమ్మల్ని నమ్మి వచ్చారు. కంపెనీలో చేరిన మొదటి పది మందిలో ఒక్కరు మాత్రమే మధ్యలో మానేశారు. మామధ్య అంతటి నమ్మకం, అనుబంధం ఉండేవి. డబ్బు ఉంటేనే కంపెనీ విస్తరణకూ, విలువైన మానవ వనరుల్ని పొందడానికీ అవకాశం ఉంటుంది. అందుకే రెండో దశలో ఇంటెల్‌లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన వారిని కలిసి పెట్టుబడులు సేకరించాం. అక్కడంతా డామినో ఎఫెక్ట్‌... ‘ఒకరివల్ల ఈ స్థాయికి వచ్చాను. నావల్ల ఇంకొందరు పైకి రావాలి’ అనుకుంటారు. 2008లో ఆర్థిక మాంద్యం మేం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఆ సమయంలో సగం మంది ఉద్యోగుల్ని తీసేయాలి లేదా జీతాల్ని సగం మేర తగ్గించుకోవాలి... ఇదే విషయాన్ని ఉద్యోగులకు చెప్పాం. మొత్తంమీద ఒక్కరిని కూడా తొలగించకుండా జీతాల్ని తగ్గించుకున్నాం. పెద్ద మొత్తంలో కోతకు సిద్ధపడ్డవాళ్లకి కంపెనీలో వాటాలు ఇచ్చాం. ఓ పక్క ప్రాజెక్టు ఆలస్యమవుతుంటే, మరోపక్క పెట్టుబడికి దార్లు మూసుకుపోయేవి. ఆ సమయంలో మాకో మెయిల్‌ వచ్చింది. మా హెచ్‌ఆర్‌, ఇతర సిబ్బంది అందులోని కొరియన్‌ ఫాంట్‌ చూసి స్పామ్‌ మెయిల్‌ అనుకొని డిలీట్‌ చేశారు. నా ఇన్‌బాక్స్‌లో ఉంటే ఎందుకో ఓపెన్‌ చేశాను. శామ్‌సంగ్‌ సీయీవో ఆఫీసు నుంచి వచ్చిందా మెయిల్‌. వాళ్లు మమ్మల్ని కలవాలనుకుంటున్నట్టు చెప్పారు. సంప్రదింపుల తర్వాత దాదాపు రూ.60 కోట్లు పెట్టుబడి పెట్టారు. అది రాత కాకపోతే మరేంటి! తర్వాత దశలో హైదరాబాద్‌, మాస్కోలలోనూ ఆఫీసులు తెరిచాం. ఒక్కోచోట వంద మంది పనిచేసేవారు. రష్యాలో అమెరికన్‌ కంపెనీల్ని ప్రోత్సహించడానికి ఆ ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేసి మా కంపెనీలో పెట్టుబడి పెట్టింది.

ఇంటెల్‌కే అమ్మేశాం
2015 చివరికి సాఫ్ట్‌ మెషీన్స్‌ సెమీ కండక్టర్లూ, ప్రాసెసర్లూ, చిప్‌లూ సిద్ధమయ్యాయి. ఆ దశలో కొన్ని పెద్ద కంపెనీలు మా సంస్థను కొనడానికి ముందుకు వచ్చాయి. చివరకు గతేడాది సెప్టెంబర్‌లో సుమారు రూ.2500 కోట్లకు ఇంటెల్‌ ‘సాఫ్ట్‌ మెషీన్స్‌’ను చేజిక్కించుకుంది. సంస్థలోని 300 మంది ఉద్యోగులూ ఇంటెల్‌లో భాగమయ్యారు. అప్పటివరకూ ఇంటెల్‌ బెంగళూరులో మాత్రమే ఉండేది. మావల్ల హైదరాబాద్‌కీ వచ్చింది. ఉత్పత్తి విభాగంలో అంకుర సంస్థని ప్రారంభించడం టెస్ట్‌ క్రికెట్‌ ఆడటం లాంటిది. ప్రతిభతోపాటు ఎంతో సహనం, ఓర్పూ ఉండాలి. చివరి వరకూ ఫలితం తెలీదు. అది తెలియడానికి మా కంపెనీకి ఎనిమిదేళ్లు పట్టింది. ఈ ప్రయాణంలో నైపుణ్యాలకంటే ఉద్యోగుల్నీ, పెట్టుబడిదారుల్నీ, కుటుంబ సభ్యుల్నీ ఒప్పించడమే గొప్ప విషయం. అందుకే అంటాను, సాఫ్ట్‌ మెషీన్స్‌ విజయం అందులో భాగమైన ప్రతి ఒక్కరిదీనూ.

స్వదేశీ బ్రాండ్‌
ఇంటెల్‌తో ఒప్పందం ముగిసిన తర్వాత రోజే ఇండియాకి వచ్చేశాను. ఓ ప్రొడక్ట్‌ కంపెనీని ప్రారంభించే ఉద్దేశంతో అప్పటికే ఇక్కడ ఏర్పాట్లు మొదలుపెట్టాను. అమెరికాలోనే ఆ పనిచేయొచ్చు. కానీ అమెరికా, జపాన్‌, కొరియా, చైనా... ఇలా ప్రతి దేశం నుంచి గ్లోబల్‌ ప్రొడక్ట్‌లు వచ్చాయి. భారత్‌ నుంచి ఎందుకు రావడంలేదన్న ప్రశ్న చాన్నాళ్లనుంచీ నా మెదడును తొలిచేది. 1990ల్లో మనం సాఫ్ట్‌వేర్‌ సేవల ద్వారా ఒక కొత్త మార్కెట్‌ సృష్టించుకున్నాం. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రోలాంటి విజయగాథలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ ప్రొడక్ట్‌ కంపెనీలవైపు అడుగులు వేయలేదు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’తో పెద్దగా మార్పు ఉండదు. ఫాక్స్‌కాన్‌ లాంటి కంపెనీ ఇండియాలో పుట్టాలి. ఇండియాలో ఫాక్స్‌కాన్‌ విభాగం రావడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇరాన్‌ మనకంటే చాలా చిన్న దేశం. ఎప్పుడూ పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ మనకంటే వాళ్లకి ఎక్కువ పేటెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించాక, భారత్‌లో పరిస్థితిని మార్చడానికి నా వంతు కృషి చేయాలనుకున్నాను. నిజానికి అమెరికా కేంద్రంగా కంపెనీ పెట్టడం తేలిక. అక్కడితో పోల్చితే ఇక్కడ సవాళ్లు ఎక్కువ. అయినా ఇక్కణ్నుంచి గ్లోబల్‌ ప్రొడక్ట్‌ తెస్తే డబుల్‌ కిక్‌ ఉంటుందనిపించి సిద్ధమయ్యాను. అలా మొదలైందే ‘స్మార్ట్‌రాన్‌’. 2014 ఆగస్టు నుంచి హైదరాబాద్‌లో మా పరిశోధన బృందం పనిచేస్తోంది. మా ఉత్పత్తులకు సంబంధించిన డిజైన్‌, ఇంజినీరింగ్‌ పనులు పూర్తిగా ఇండియాలోనే చేస్తున్నాం. వాటి డిఎన్‌ఏ ఇండియాదే. తయారీ మాత్రం విదేశాల్లో చేపడుతున్నాం. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలలోనూ ఆఫీసులు ఉన్నాయి. మన దగ్గర అందుబాటులోలేని చిన్న చిన్న సాంకేతిక అవసరాల్ని తీర్చడానికి రష్యాలో ఓ విభాగాన్ని ఏర్పాటుచేశాం. త్వరలో అమెరికాలోనూ ప్రారంభిస్తాం. ట్రేడ్‌ మార్కింగ్‌, న్యాయపరమైన అంశాలు మనకి కొత్త. అందుకే సాఫ్ట్‌ మెషీన్స్‌లో పనిచేసిన నిపుణుల్ని పిలిచి ఇక్కడ మా సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నాం.

ఆ మూలాలే కారణం 

అమ్మ... పారిజాతం, నాన్న... ఆదిశేషారెడ్డి. మా సొంతూరు ప్రకాశం జిల్లా కరేడు. సముద్రతీర గ్రామం. వ్యవసాయ కుటుంబం. మా తాత గ్రామ పెద్ద‌. నాన్నా, తాతా అడిగిన వారందరికీ సాయం చేసేవారు. నాయకత్వ లక్షణాలూ అక్కణ్నుంచే వచ్చాయనిపిస్తుంది. 20 ఏళ్ల వరకూ వూళ్లొ నేర్చుకున్న విలువలే నా ఎదుగుదలకు కారణం. 

* నా శ్రీమతి శిల్ప. వాళ్లది వరంగల్‌. అమెరికాలో ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్‌ చేసి ఇంటెల్‌లో పనిచేసేది. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయికి తొమ్మిదేళ్లు, పేరు గ్రీష్మ్‌. అమ్మాయికి ఏడేళ్లు. పేరు సమేయా.

* నిత్యం నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం నాకు అలవాటు. ఈ విష‌యంలో అమెరికాలో ఐటీ నిపుణుడిగా ప‌నిచేసే మా అన్న‌య్య వాసుదేవ‌రెడ్డి ఎంతో సాయం అందిస్తారు.

* ఈ రంగంలో నెట్‌వర్కింగ్‌ చాలా ముఖ్యం. ఇప్పటికీ దేశవిదేశాలు తిరుగుతూ పరిచయాలు పెంచుకుంటా. కంపెనీకి పెట్టుబడులూ, మానవ వనరులూ వచ్చేది వాటిద్వారానే.

* తీరిక వేళల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు చదువుతాను. 

* టీబుక్‌, టీఫోన్‌, ఎస్‌ఆర్‌టీ ఫోన్ల అమ్మకాలద్వారా రూ.60 కోట్లు వచ్చాయి. 2020కి రూ.1300 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నాం.

అన్నింటా స్మార్ట్‌
స్మార్ట్‌రాన్‌ ప్రధానంగా ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ)’, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లను జోడించి పనిచేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. మా సాంకేతికతకు ‘ట్రానిక్స్‌’ అని పేరుపెట్టాం. మున్ముందు ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ వినియోగం మరింత పెరగనుంది. అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌లాంటి పెద్ద కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఇటుగా అడుగులు వేస్తున్నాయి. మన దగ్గర ఇలాంటి కంపెనీలకు పెట్టుబడులు వచ్చే అవకాశం తక్కువ. మాకు రూ.1000 కోట్ల పెట్టుబడి అవసరం. ఇప్పటికి రూ.400 కోట్లు సేకరించాం. వచ్చే ఏడాది కాలంలో మరో అయిదారు వందల కోట్లు సేకరిస్తాం. మోటరోలా మొబైల్‌ విభాగానికి సీయీవోగా పనిచేసిన సంజయ్‌ ఝా, క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ లాంటివారు మా పెట్టుబడిదారుల్లో ఉన్నారు. అయినా మాకు 80 శాతం పెట్టుబడులు భారత్‌ వెలుపలనుంచే వస్తున్నాయి. సాఫ్ట్‌ మెషీన్స్‌లో పెట్టుబడిపెట్టిన వాళ్లలో కొందరు దీన్లోనూ పెట్టుబడులు పెట్టారు.

మా నుంచి ఇప్పటికే టీబుక్‌, టీఫోన్‌, ఎస్‌ఆర్‌టీ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. అవి మా ఉత్పత్తుల్లో ఒక భాగం మాత్రమే. ఇంకెన్నో రానున్నాయి. టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌... వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ రవాణా, వినోదం, ఆరోగ్యం, వ్యవసాయ విభాగాల్లో స్మార్ట్‌ సేవలు అందిస్తాం. మొత్తంగా జీవనశైలిని మెరుగుపరిచే సాంకేతికతని అభివృద్ధి చేస్తున్నాం. కెమెరా ఫేస్‌ రికగ్నిషన్‌ లాకర్‌, వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే గీజర్‌-ఛార్జర్‌-తలుపులు-కాఫీ మేకర్‌-టీవీ-లైట్లు-కిటికీలు... లాంటివి పరిశోధన దశను దాటి మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా భారతీయుల అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులు తేనున్నాం. సెన్సర్‌ సాయంతో గ్యాస్‌ సిలిండర్‌ బరువుని తెలుసుకునే పరికరాన్ని అభివృద్ధి చేశాం. మొత్తంగా స్మార్ట్‌ ఆఫీసుల్నీ, స్మార్ట్‌ ఇళ్లనీ స్మార్ట్‌ లైఫ్‌నీ అందులో భారతీయ బ్రాండ్‌ స్మార్ట్‌రాన్‌నీ త్వరలోనే చూడబోతున్నారు!

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.