పుట్టిల్లు

‘‘పిల్లలకి సడన్‌గా స్కూల్‌కి పదిహేను రోజులు సెలవులిచ్చారట. అల్లుడుగారు ఎలాగూ వర్క్‌ ఫ్రం హెూమ్‌ పెట్టుకోవచ్చుగా. అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్‌ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రెయిన్‌ టిక్కెట్లు దొరకవు కాబట్టి- ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు’’ చెప్పింది పద్మావతి.

Updated : 19 Nov 2023 02:16 IST

ఎస్‌.వి.సురేష్‌

‘‘మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్ళారు’’ కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహనరావు.

‘‘పిల్లలకి సడన్‌గా స్కూల్‌కి పదిహేను రోజులు సెలవులిచ్చారట. అల్లుడుగారు ఎలాగూ వర్క్‌ ఫ్రం హెూమ్‌ పెట్టుకోవచ్చుగా. అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్‌ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రెయిన్‌ టిక్కెట్లు దొరకవు కాబట్టి- ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు’’ చెప్పింది పద్మావతి.

‘‘అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జంటు పనులిక్కడ ఏమున్నాయి. పైగా పనిమనిషి ‘కూతురు పెళ్ళి’ అని ఇరవై రోజులు రానందిగా, ఆ విషయం చెప్పావా?’’ అడిగాడు మోహనరావు. ‘‘విసుక్కోకండీ. అలా చెబితే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టంలేదని అమ్మాయి అనుకోదూ. రానీయండి. వచ్చాక తెలుస్తుంది కదా... పనిమమనిషి రావడంలేదనీ వంటామె కూడా చీటికీ మాటికీ మానేస్తోందనీ...’’ సర్దిచెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది.

‘‘నీ స్పాండిలైటిస్‌కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా... కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి?’’ ప్రశ్నించాడు మోహనరావు నిష్టూరంగా.

భార్య కష్టపడుతుందే తప్ప అవతలివారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహనరావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ, కూతురితో అదే ఫోన్‌ కాల్‌ తాను మాట్లాడవలసి వస్తే తానూ రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలూ మనవడూ. నిజానికి భార్య వీక్‌నెస్‌ కూడా అదే.

‘‘రానీయండి... పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది? ఎలాగోలా సర్దుకుందాం. దానికీ కష్టం సుఖం తెలుసుగా... తానూ పూనేలో చేసుకునే వస్తోంది కదా’’ చెప్పింది పద్మావతి.
కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు.

స్వప్నకు పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. అబ్బాయికి ఆరేళ్ళు, అమ్మాయికి నాలుగేళ్లు. అల్లుడు విఘ్నేష్‌ పూనేలో ఒక ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురూ అల్లుడూ హైదరాబాద్‌లో వాలిపోతారు.

అక్కడవరకూ బాగానే ఉంది కానీ... అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే.
‘దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా?’ అని ఆలోచిస్తున్నాడు మోహనరావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహనరావుకు జాలివేసింది. వచ్చే ఏడాది ఆమె డెబ్భయ్యవ పడికి చేరుతుంది. తనకూ ఆమెకూ రెండేళ్ళు తేడా. నలభై అయిదేళ్ళ వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హెూదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కుకునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళూ కాలేజీలూ ఎంపికచేసి చేర్పించిన తర్వాత- ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్ళి చేశాక యూఎస్‌లో స్థిరపడ్డాడు. కూతురూ అల్లుడూ దేశంలోనే ఉంటున్నారు.

తాను రిటైరయ్యి పదేళ్ళయింది కానీ ఈనాటికీ ఆమెకు సుఖంలేదు. పిల్లల పెళ్ళిళ్ళూ పురుళ్ళూ, తరవాత వాళ్ళకూ పిల్లలకూ సపోర్ట్‌ చేయడం- ఈ పనులతోనే ఈ పదేళ్ళూ గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే రెండు, మూడేళ్ళ నుంచీ ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్నచిన్న ఇబ్బందులే రోజూ చికాకు పెడుతుంటాయి. అవి బయటి వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు.
‘ఆమెకు సుఖం లేదు’ మరోసారి అనుకున్నాడు మోహనరావు పద్మావతికి దుప్పటి కప్పుతూ.

*               *               *

‘‘అమ్మా, నేను బ్యూటీ పార్లర్‌కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్‌ కొడుకు బర్త్‌డే ఉందిగా వెళ్ళాలి. ఈ రోజు పార్లర్‌ పని పూర్తిచేసుకొస్తాను’’ వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది. డ్రాయింగ్‌రూమ్‌లో మనవరాలినీ మనవడినీ ఎంగేజ్‌ చేస్తున్న మోహనరావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది. ఈరోజు పనిమనిషీ వంటామే ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్‌లో సతమత మవుతోంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైమ్‌ పదకొండు గంటలైంది. పిల్లలకి పాలూ, పెద్దవాళ్ళకి ఒకటికి రెండుసార్లు కాఫీలతో ఇప్పటికి అందరి బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తయింది. పద్మావతి లంచ్‌ ఏర్పాటులో ఉండి ఉంటుంది.

కూతురూ అల్లుడూ వచ్చి వారం రోజులైంది. అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి తన రూమ్‌లోకి వెళ్ళి లాగిన్‌ అవుతాడు. రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగ్‌ అవుట్‌ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు.

స్వప్న రోజూ ఏదో ఒక బయటపని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్‌ అనీ మరో రోజు బ్యూటీపార్లర్‌ అనీ ఇంకోరోజు మరోపని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్‌ ఫంక్షన్లకూ స్నేహితుల ఇళ్ళకూ వెళ్ళిరావడం లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయడమూ. వీకెండ్స్‌ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరోచోటుకో వెళ్ళడం.

అల్లుడూ కూతురూ వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళడమే కుదరలేదు మోహనరావుకి. అసలు తను కిచెన్‌ నుంచి బయటపడితేగా. దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహనరావు గమనించాడు.

ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది... రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని.

స్వప్న అత్తగారింటిలో రెండు రోజులు ఉండి, తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి... పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూనే వెళ్ళిపోయారు.

స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహనరావు తన వియ్యంకుడికి ఫోన్‌ చేశాడు. ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన రెండు రోజులూ ఎలా ఉందని అడిగాడు.

దీనికి సమాధానం చెబుతుంటే... ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ రెండు రోజులూ పనంతా ఆమెపైనే పడిందట.

తెలిసినవారింట్లో ఎంగేజ్‌మెంట్‌ ఉంటే స్వప్న రెండు రోజులూ హడావిడిగా తిరుగుతూనే ఉందట.

స్వప్న రావడానికి ముందు యూఎస్‌ నుంచి కొడుకూ కోడలూ పిల్లలతో వచ్చి నెలరోజులుండి వెళ్ళారు. అప్పుడూ ఇదే కథ నడిచింది.

మోహనరావు చిన్నగా నిట్టూర్చాడు.

*               *               *

రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్‌ చేసింది.

‘‘అమ్మా, నేనూ ఆయనా పిల్లలూ వస్తున్నామే. ఓ వారం ఉండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్‌ వచ్చి’’ అంది.

‘‘తప్పకుండా రండి తల్లీ’’ అంది పద్మావతి.

పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారుపడింది.

‘‘నాన్నా, అమ్మ ఏదీ?’’ అని అడిగింది.

‘‘అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మరచిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు బాగోలేదు. రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది’’ చెప్పాడు మోహనరావు.

ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు.

‘‘వంటమనిషి మానేసింది. దాని కొడుక్కి మంచి జాబ్‌ వచ్చిందట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చరయ్యింది. ఈనెల రాలేనని కబురు చేసింది.’’

స్వప్న హతాశురాలైంది.

ఇప్పుడెలా? ఫ్లైట్‌ టిక్కెట్స్‌ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్‌ టిక్కెట్స్‌తో కలిపి బుక్‌ చేయించుకున్నారు.

ఇక తప్పక స్వప్న వంటా వార్పూ మొదలుపెట్టింది. రెండు పూటలా అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటోంది. రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది.

ఈ వారం రోజులూ స్వప్నకు ఊపిరి ఆడలేదు. ఒక గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసీ చేసీ నడుం నొప్పి పట్టుకుంది.

ఈ పదేళ్ళలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన...

‘ఇంత పనినీ ఇంత ఒత్తిడినీ అమ్మ ఎలా తట్టుకుంటోందీ, నలభై ఏళ్ళకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతోందే అలాంటిది డెబ్భై ఏళ్ళకు దగ్గరయిన అమ్మకు ఎంత కష్టం? పూనేలో తాను ఇద్దరికి ముగ్గురు మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు...’ అనుకుంది

*               *               *

ఆ తర్వాత మూడు నెలల వరకూ స్వప్న హైదరాబాద్‌ ఛాయలకు రాలేదు.

ఓరోజు పద్మావతికి ఫోన్‌ చేసి ‘‘అమ్మా, పిల్లలు నిన్నూ నాన్ననూ చూడాలని గొడవ చేస్తున్నారు’’ అంది.

‘‘దానికేముందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్‌ రండి’’ మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి.

‘‘వద్దమ్మా. మీరే పూనే రండి. నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు.

ఓ నెల విశ్రాంతిగా ఉందురుగాని... ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్టుని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను’’ అంది.

పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది.

‘‘ఈ నలభైయ్యేళ్ళూ హైదరాబాద్‌ నాకు పుట్టిల్లు. ఇకనుంచీ మా ఇల్లే మీకు పుట్టిల్లు... కాదనకండి’’ అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది.
పక్కనే పేపర్‌ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి.

కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహనరావు కళ్ళు మెరిశాయి తృప్తితో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..