బ్రహ్మోత్సవం.. భక్తుల భాగ్యోత్సవం..!

‘నరసింహా... లక్ష్మీనరసింహా...శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా...’ అంటూ భక్తి పారవశ్యంతో ఆ పంచనార సింహుడిని కొలిచే దివ్య క్షేత్రమే యాదాద్రి.

Updated : 23 Mar 2022 16:46 IST

బ్రహ్మోత్సవం.. భక్తుల భాగ్యోత్సవం..!

‘నరసింహా... లక్ష్మీనరసింహా...శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా...’ అంటూ భక్తి పారవశ్యంతో ఆ పంచనార సింహుడిని కొలిచే దివ్య క్షేత్రమే యాదాద్రి. స్వయంభువుగా వెలిసిన స్వామికి ఏటా పదకొండు రోజులపాటు బ్రహ్మోత్సవాల్ని నిర్వహించడంతో యాదాద్రి మహా పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ఆధ్యాత్మిక విశ్వనగరిగా రూపుదిద్దుకున్న ఆ దివ్యక్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకూ అంగరంగ వైభవంగా  జరిగే ఆ ఉత్సవ విశేషాలు...

భగవంతుని ఆరాధించి చేసేవే బ్రహ్మోత్సవాలు... శక్తినీ భక్తినీ పెంచుకునే మహోత్సవాలు. ‘ఉగ్రవీరం... మహావిష్ణుం...’ అంటూ ఆ నరహరిని స్వయంగా అర్చించాకే బ్రహ్మ సృష్టికార్యాన్ని ప్రారంభించాడట. సింహరూపుడైన ఆ శ్రీహరి అంటే అంత భక్తి ఉంది కాబట్టే ఆ చతుర్ముఖుడే ఈ బ్రహ్మోత్సవ సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడట.

ఇల వైకుంఠంలో జరిగే ఈ ఉత్సవాల్లో యాదగిరీంద్రుని వైభవం కనులారా కాంచడానికి  భక్తకోటి తరలివస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న యాదగిరి గుట్టలో పూర్వం ఉత్సవాలను భక్తులే మూడురోజులపాటు జరిపేవారు. అందుకే వాటిని భక్తోత్సవాలుగా పిలిచేవారు. 110 సంవత్సరాల క్రితం నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అవీ ఐదురోజులపాటు మార్గశిర మాసంలో జరిగేవట. ఆ మాసంలో ఉత్సవాలు జరపడం అశాస్త్రీయమని భావించి 1964 నుంచి ఫాల్గుణమాసంలో 11 రోజులపాటు నిర్వహిస్తున్నారు. 1975 నుంచి ఈ బ్రహ్మోత్సవాలకోసం ప్రభుత్వం తరపు నుంచి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఎందుకీ ఉత్సవం?

గుడిలో కొలువైన స్వామికి నిత్య పూజలు చేస్తుంటారు కదా... మరి ఏడాదికోసారి ఈ ఉత్సవాలు ఎందుకూ అనే సందేహం రావచ్చు. దాని వెనుకా ఓ కారణం ఉంది. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే. కానీ ఆగమశాస్త్ర పద్ధతుల్లో చేపట్టిన ఆలయాల్లో అప్పట్లో మూలవిరాట్టు సందర్శనకి అట్టడుగువర్గాల్ని ఒప్పుకునేవారు కాదు. కానీ భగవంతుడిని భక్తులకు దూరం చేయడంపై కొందరు అభ్యంతరం లేవనెత్తడంతో ఏటా ఉత్సవాల నిర్వహణ చేపట్టారట. ఆ ఉత్సవాల్లో పాల్గొన్నవారికి మూలవిరాట్టుని దర్శించిన పుణ్యమే దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా మొదలుపెట్టిన ఉత్సవాల్ని ఐదు రోజులు నిర్వహిస్తే క్షేత్రాలనీ పదకొండు రోజులపాటు నిర్వహిస్తే మహాపుణ్యక్షేత్రాలనీ అంటారు. ఆ విధంగా దివ్యక్షేత్రంగా విలసిల్లుతోన్న యాదగిరి బ్రహ్మోత్సవ సమయంలో ముక్కోటి దేవతల విడిదిగా మారుతుంది. ఆ సందర్భంగా సకల దేవతల్నీ శాస్త్రోక్తంగా ఆహ్వానించి, వేదోక్తంగా పూజలు చేస్తారు. వేదపండితుల చతుర్వేద పారాయణాలూ అర్చకుల మంత్రోచ్చారణ, రుత్విక్కుల ప్రబంధ పారాయణాలతో వెలిగిపోతుంటుంది యాదాద్రి. పూర్వం చుట్టుపక్కల ప్రాంతాలకు గుట్టమీద నుంచి వేదమంత్ర ఘోషలు వినిపించేవట. ఆ పద్మనాభుడి కల్యాణాన్ని కనులారా చూడ్డానికి బ్రహ్మాది దేవతలూ పార్వతీ పరమేశ్వరులూ దిగివస్తారట. భక్తి పారవశ్యంతో చూస్తే- మహర్షులు చతుర్వేద పారాయణం చేస్తుంటే; హనుమ, గరుడ, విష్వక్సేనాదులు మైమరిచి నాట్యాలు చేస్తున్నట్లే అనిపిస్తుంది వేదాద్రి. అందుకే బ్రహ్మోత్సవ వేళ, యాదగిరి ... వేదగిరి... అన్న నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఆ సమయంలో క్షేత్ర మహత్యం రెట్టింపు అవుతుందనీ, భక్తసులభుడైన స్వామి కరుణా కటాక్షాన్ని కురిపిస్తాడనీ విశ్వసిస్తారు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఏటా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. విష్వక్సేనుడి పూజతో మొదలయ్యే ఈ ఉత్సవాలు అష్ణోత్తర శత ఘటాభిషేకంతో ముగుస్తాయి. ఉత్సవవేళ- ఆశ్రిత రక్షకుడు అధిరోహించే ప్రతి వాహనానికీ ఓ ప్రత్యేకత... అలాగే మురారి ముస్తాబు చేసుకునే ఒక్కో అలంకారం వెనుకా ఓ పౌరాణిక ప్రశస్తి.


1వ రోజు..

స్వస్తి వాచనంతో ఆలయశుద్ధిలో భాగంగా- అగ్నిప్రతిష్ఠ జరిపి జలాన్ని అర్చిస్తారు. ఆ జలంతో ఆలయం, తిరు వీధులు శుద్ధి చేస్తారు. ఎలాంటి ఆటంకాలూ రాకుండా ఉత్సవాలు నిర్వహించే బాధ్యతను సేనాధిపతి విష్వక్సేనుడికి అప్పగిస్తారు. సాయంత్రం పుట్ట బంగారం(మట్టి)లో నవధాన్యాలు నాటి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు.


2వ రోజు..

ధ్వజారోహణం... ఉత్సవాలకు ముక్కోటి దేవతల్నీ ఆహ్వానించే బాధ్యత శ్రీవారి ఇష్ట వాహనమైన గరుత్మంతుడిది. అందుకే శ్వేతవస్త్రంపై గరుడుడి రూపాన్ని చిత్రించి గర్భాలయం ముందున్న ధ్వజస్తంభంపై ఆ గరుడ కేతనాన్ని ఆరోహణ చేస్తారు. అదే దేవతలందరికీ ఆహ్వానపత్రిక. ఆపై సంరంభానికి విచ్చేసిన దేవతలకు భేరీపూజను నిర్వహిస్తారు. అంటే, అతిథి మర్యాదలతో సత్కరించడమన్నమాట.


3వ రోజు..

నిరంతర మంత్రపఠనం నరసింహుడిని శాంతింపజేస్తుంది. అందుకే వేదపఠనంకోసం రుత్విక్కులను రప్పిస్తారు. ఈ రోజునుంచే సింగార రాయుడికి అలంకారాలు మొదలు... ఉదయం మత్స్యావతారం అలంకారంలో సేవిస్తారు. రాత్రికి శ్రీదేవి, భూదేవి సమేతంగా శేషవాహనంపై ఊరేగిస్తారు. నేత్రపర్వంగా సాగే ఈ వేడుక చూడ్డానికి జనం బారులు తీరతారు.


4వ రోజు..

ఉదయాన్నే ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణుడుగా అలంకరించి రాత్రికి హంస వాహనంమీద ఊరేగిస్తారు. ఆ రోజున స్వామిని దర్శించుకున్నవాళ్లకి కలి ప్రభావం సోకదనీ మోక్షం ప్రాప్తిస్తుందనీ చెబుతారు.


5వ రోజు..

సృష్టి ప్రారంభంలో మర్రి ఆకుపై పవళించిన విష్ణుమూర్తిని వటపత్రశాయిగా కొలుస్తారు. అందుకే ఈ రోజున వటపత్రశాయి అవతారమెత్తి భక్తులతో జోల పాడించుకుని, రాత్రివేళ కోరికలు తీర్చే కల్ప వృక్షంపై ఊరేగుతాడా నరహరి.


6వ రోజు..

ఇంద్రుడి గర్వాన్ని అణిచి, ప్రజలకు అండగా ఉంటానని చాటిన గోవర్థనగిరిధారి అలంకారంలో సాక్షాత్కరిస్తాడు. ముద్దుగా ముస్తాబైన ఆ మురారిని చూసి ‘కొండవేల నెత్తినట్టి గోవిందా... నిన్ను గొండించేరు యశోదకు గోవిందా’ అన్న భక్తుల ఆలాపనలు అందుకుని, రాత్రికి తిరు వీధుల్లో సింహమ్మీద రాజసంగా ఊరేగుతాడు. ఆదిసింహం సింహవాహనమ్మీద ఊరేగే ఈ ఘట్టం మహాద్భుతం.


7వ రోజు..

అసురుల నుంచి సురులకు అమృతాన్ని అందజేసిన జగన్మోహిని అలంకారంలో ఆ జగన్మోహుడిని కొలుస్తారు. ప్రకృతి పరంగా అందే ఫలాలు కృషీవలులకు దక్కాలన్నదే ఈ అవతార లక్ష్యం. ఆ తరవాత స్వామి అశ్వవాహనరూఢుడై ఎదుర్కోలు సంబురానికి మండపానికి చేరతాడు. ఈ పర్వంలో పెళ్లిచూపులు, మాటామంతి, ముహూర్తం... అన్నీ జరుగుతాయి.


8వ రోజు..

ఉదయంవేళ ఆంజనేయుణ్ణి వాహనంగా చేసుకుని కోదండరామావతారంలో భక్తులకు కనిపిస్తాడు. రాత్రికి గజేంద్ర మోక్షానికి తార్కాణంగా అంబారీమీద ఊరేగుతూ భక్తుల కేరింతల మధ్య కల్యాణోత్సవానికి వేంచేస్తాడా పంచ నారసింహుడు. అర్ధరాత్రివేళ వరుడు నరసింగరాయుడు నవ వధువు శ్రీమహాలక్ష్మి మెడలో తాళికట్టే ఆ కల్యాణమహోత్సవాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.


9వ రోజు..

మహావిష్ణు రూపంలో గరుడ వాహనమ్మీద తిరు వీధుల్లో ఊరేగుతూ కర్మజ్ఞానాన్ని బోధిస్తాడు. సాయంత్రం దివ్యవిమాన రథోత్సవం.... ఈ సేవలో పాల్గొంటే మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతారు భక్తులు.


10వ రోజు..

పదోరోజు... నిరంతరం స్వామితోనే ఉండి సేవలందించిన సుదర్శనుడినే శ్రీచక్ర ఆళ్వారుడిగా కొలుస్తారు. ఈ రోజున ఆయనతో సహా స్వామికి తీర్థ స్నానం చేయించి, పుష్కరిణిలో విశేషపర్వం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రంలో పుష్పయాగానికి అత్యంత ప్రాధాన్యం. అందుకే ఈ రోజు రాత్రి సరసుడుగా మారిన సింహరాయుడు సిగ్గులమొగ్గవుతున్న శ్రీదేవితో పూలచెండులు ఆడుకునే ఘట్టాన్ని వినోదభరితంగా జరిపి దేవతోద్వాసన చేస్తారు.


11వ రోజు...

పదకొండో రోజు... గర్భాలయంలో వేదమంత్ర పఠనాల మధ్య అష్టోత్తర శతఘటాభిషేకం జరుగుతుంది. ఈ విధంగా స్వస్తివాచనంతో మొదలయ్యే శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు విశేష అభిషేకంతో పరిసమాప్తం అవుతాయి. ఈ పదకొండు రోజులూ యాదాద్రి విద్యుద్దీపకాంతులమధ్య దేదీప్యమానంగా వెలిగిపోతూ ‘ఓం నమో నారసింహాయ...’ ‘బ్రహ్మోత్సవం... భక్తుల భాగ్యోత్సవం...’ ‘యాదగిరి కొండల్లోన ఎంత సక్కని దేవుడవయ్యా...’ అన్న మంత్రోచ్చారణలూ సంకీర్తనలూ పల్లెపదాలతో దద్దరిల్లుతూ శోభాయమానంగా కనువిందు చేస్తుంటుంది. ‘పునర్దర్శనం ప్రాప్తిరస్తు...’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..