ఈ పల్లెలు ప్రత్యేకం

మన దేశంలో చాలా గ్రామాలు రకరకాల కారణాలతో వార్తల్లో కనపడుతుంటాయి. తక్కువ ధరకే జీడిపప్పు అమ్ముతూ ఒకటి, కోతులను ప్రేమగా ఆదరిస్తూ మరొకటి, చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా పాలు అందిస్తూ ఇంకొకటి...

Updated : 07 May 2023 10:28 IST

ఈ పల్లెలు ప్రత్యేకం

మన దేశంలో చాలా గ్రామాలు రకరకాల కారణాలతో వార్తల్లో కనపడుతుంటాయి. తక్కువ ధరకే జీడిపప్పు అమ్ముతూ ఒకటి, కోతులను ప్రేమగా ఆదరిస్తూ మరొకటి, చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా పాలు అందిస్తూ ఇంకొకటి... ఇలా మూడు పల్లెలు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అవేంటో.. ఎక్కడున్నాయో మనమూ చూసొద్దాం పదండి.


పాలు అమ్మితే పాపం!

పాలధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మరోవైపు కల్తీలేని పాలు దొరకటమే గగనమవుతోంది. అదే గుజరాత్‌లోని కచ్‌ జిల్లా డోక్డా గ్రామానికి వెళితే కల్తీలేని స్వచ్ఛమైన పాలనీ, పెరుగునీ, నెయ్యినీ ఉచితంగా ఇస్తారు. ఎందుకంటే ఈ ఊళ్లో పాలూ, పాల పదార్థాలూ అమ్మితే పాపమని భావించి- ఆ గ్రామంతోపాటు, చుట్టుపక్కల పల్లెల్లో పాడిలేని వారికి ఫ్రీగా అందిస్తుంటారు.  ప్రజల్లో ఆ నమ్మకం బలపడటానికి కారణం... పీర్‌ సైయద్నా అనే సూఫీ సాధువు అయిదు వందల ఏళ్ల క్రితం డోక్డాకు వచ్చాడట. ఈ ఊళ్లో సంతోషం, ప్రశాంతత ఉండాలంటే పాలను అమ్ముకోవద్దని చెప్పాడట. అప్పట్నుంచీ గ్రామస్థులు పాలూ, పాల పదార్థాలూ అమ్మడం మానేశారట. కొన్నేళ్ల క్రితం డోక్డాకు అల్లుడుగా వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడి ఆచారాన్ని కాదని పాల అమ్మకం ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే అతను చనిపోవడంతో పాలను అమ్మకూడదనే డోక్డా వాసుల నమ్మకం ఇంకా బలపడిపోయింది. దాంతో వ్యవసాయ పనులకోసం పశువుల్ని పెంచుకుంటున్నవారంతా... లీటర్ల కొద్దీ కల్తీలేని పాలను గ్రామస్థులకూ, పొరుగు ఊళ్లకూ ఉచితంగా ఇస్తున్నారు.


జీడిపప్పు కేజీ రూ.15

జీడిపప్పు చూస్తే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది, కానీ వాటి ధర గుర్తొస్తే మాత్రం అయ్యబాబోయ్‌ అనిపిస్తుంది. మన దగ్గర ఎంత లేదనుకున్నా వాటి ధర కేజీ రూ.800- 1200 వరకైతే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆ జీడిపప్పు మనదేశంలోని ఓ ప్రాంతంలో కేజీ రూ.15-40కే దొరుకుతోంది. మరి అదెక్కడో తెలిస్తే మేమూ వెళ్లి తెచ్చుకుంటాం అనుకునే వాళ్లు ఝార్ఖండ్‌లోని నాలా గ్రామానికి వెళ్లాల్సిందే. మన దగ్గర రోడ్ల పక్కన గంపల్లో పండ్లూ, కూరగాయలూ అమ్మినట్టు- అక్కడ జీడిపప్పును అమ్ముతుంటారు. ధర తక్కువ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు అక్కడికెళ్లి చౌకగా జీడిపప్పును కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఈ చిన్న పల్లె ‘క్యాషూ సిటీ ఆఫ్‌ ఝార్ఖండ్‌’గా పేరు తెచ్చుకుంది. అంతా బాగుంది కానీ మరీ ఇంత చౌక బేరం ఎందుకూ అనుకుంటున్నారా! కొన్నేళ్ల క్రితం వరకూ ఈ గ్రామంలో సరిగా పంటలు పండేవి కావు. దాంతో కొంత కాలానికి పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. అది గమనించిన అటవీశాఖ అధికారులు 2010లో భూసార పరీక్షలు నిర్వహిస్తే- ఆ ప్రాంతం జీడి పంటలకు అనువైందని తేలింది. అప్పట్నుంచీ రైతులకు ఉచితంగా జీడి గింజలు ఇచ్చి సాగు చేయిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సాగైన జీడితోటలు మెరుగైన ఫలితాలను ఇవ్వడంతో... ఆ గ్రామ ప్రజలు వాటిని ఊళ్లోనే అమ్మడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు జీడి గింజలను కాల్చి, పగలగొట్టి పప్పుతీయకుండానే- పచ్చివాటినే వ్యాపారులు కొనుక్కుని వెళుతుంటారు.


కోతులకు కోట్ల ఆస్తి

కోతులు అడవుల్లోని కాయలూ పళ్లూ తిని కడుపు నింపుకుంటాయి. మనుషులేమో కలప కోసం అడవుల్ని నరికేయడంతో కోతులు ఆహారంకోసం పల్లెలవైపు వెళుతుంటాయి. ఆకలితో ఉన్న ఆ మూగ జీవాలను చూసి జాలిపడిన మహారాష్ట్రలోని ఉప్లా గ్రామస్థులు తినడానికి ఏదో ఒకటి పెట్టేవారట. వాటిని తరిమేయకుండా ప్రేమగా ఆదరించడం మొదలుపెట్టారట. క్రమంగా ఎవరింట్లో పెళ్లి, ఇతర శుభకార్యాలూ జరిగినా వాటికే ముందుగా ఆహారం పెట్టడం అలవాటు చేసుకున్నారట. స్తోమతను బట్టి మూడు నుంచి ఐదురోజులపాటు కోతులకూ విందుభోజనాలు పెట్టేవారట. ముందుచూపుతో ఆలోచించి ఆ గ్రామస్థుల పూర్వికులెవరో వాటికి ఊళ్లో దాదాపు 35 ఎకరాల భూమిని రాసిచ్చారు. గతేడాది రెవెన్యూ రికార్డులు తిరగేస్తున్న అధికారులకు ఆ విషయం తెలిసి విస్తుపోయారు. గ్రామానికి వెళ్లి చూస్తే ఇప్పటికీ రకరకాల పళ్ల చెట్లతో కోతులకు కడుపు నింపుతోంది ఆ భూమి. అటవీ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఆ స్థలంలో ఓ పాడుపడిన ఇల్లు కూడా ఉందట. కోతులకోసం అడవిలా మారిన ఆ ఖరీదైన స్థలాన్ని స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకోకుండా మూగజీవాలకే వదిలేసిన వాళ్లు ఎంతో గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు