ఉప్పు... కాస్త తగ్గించండి!

ఉప్పు(Salt)... అసలు లేకపోతే తినలేం. కాస్త తగ్గించినా వంటకం రుచిగా ఉండదు. చవగ్గానే దొరుకుతుంది కదా, మరికాస్త వేసుకుంటే ఏమవుతుందీ అనుకుంటే- ఆరోగ్యానికి (health) అదే పెద్ద ముప్పు అంటున్నారు పరిశోధకులు. మొత్తానికి ‘చిటికెడు ఉప్పు’ మనిషికి పెద్ద సమస్యే తెచ్చిపెడుతోంది.

Updated : 04 Dec 2022 14:40 IST

ఉప్పు... కాస్త తగ్గించండి!

ఉప్పు... అసలు లేకపోతే తినలేం. కాస్త తగ్గించినా వంటకం రుచిగా ఉండదు. చవగ్గానే దొరుకుతుంది కదా, మరికాస్త వేసుకుంటే ఏమవుతుందీ అనుకుంటే- ఆరోగ్యానికి అదే పెద్ద ముప్పు అంటున్నారు పరిశోధకులు. మొత్తానికి ‘చిటికెడు ఉప్పు’ మనిషికి పెద్ద సమస్యే తెచ్చిపెడుతోంది.

ప్పు లేని కూర యొప్పదు రుచులకు... అన్నాడు వేమన. నోరూరించేలా చేసిన నలపాకం అయినా చాలినంత ఉప్పు లేకపోతే రుచి పుట్టదంటుంది భాస్కర శతకం. లక్షాధికారైన లవణమన్నమె కాని.... అని కూడా అన్నారు కదా పెద్దలు. మరి అలాంటప్పుడు ఉప్పు వాడకుండా ఉండటం ఎలా సాధ్యం!

అంతెందుకూ... ఒక్కపూట కూరలో

కాస్త ఉప్పు (salt) తక్కువేస్తే ఇంట్లో ఎవరూ దాన్ని నోట్లోనే పెట్టరు. రుచికోసమే కాదు, ఆరోగ్యానికీ ఉప్పు అవసరమే. మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాల్లో సోడియం కూడా ఒకటి. అది శరీరంలో ద్రవ పదార్థాలన్నీ సమతూకంలో ఉండేలా చూస్తుంది. కండరాలూ నాడులూ సరిగ్గా పనిచేసేందుకూ తోడ్పడుతుంది. కణజాలం పోషకాలను గ్రహించి ఆరోగ్యంగా వాటి పని అవి చేయడానికి సోడియం కావాలి. ఆ సోడియం మనకు ఉప్పు ద్వారానే అందుతుంది.

మరింకేం... అందుకే కదా కూరల్లో చారుల్లో చారెడు ఉప్పేసుకుంటున్నాం. కమ్మగా వండుకు తింటున్నాం... అని మనం అనుకుంటున్నాం కానీ నిజానికి మనకి తెలిసి కొంతా తెలియకుండా ఇంకా ఎంతో... ఉప్పు శరీరంలోకి చేరుతోంది. దాంతో అది మోతాదు మించిపోతోంది. ఏదైనా మోతాదు మించితే ఏమవుతుందీ..? మంచి బదులు చెడు ఎదురవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే (health problems caused by salt).

ఆహారంలో అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటూ గుండెపోటు (heart attack) బారిన పడుతున్నారనీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనీ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మనదేశంలో కేవలం ఉప్పు ఎక్కువ వాడటం వల్ల గుండెజబ్బులు వచ్చి లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితం వరకూ రక్తపోటూ గుండె జబ్బులూ వయసు మళ్లిన వారికి వచ్చేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు సంభవించడం చూస్తూనే ఉన్నాం. పాతికేళ్ల వయసుకే బీపీ పెరిగిపోతోంది. జాతీయ పోషకాహార సంస్థ వారి అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 35 శాతం, పల్లెల్లో 25 శాతం అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. అందులో కొందరి పరిస్థితి గుండెపోటుదాకా దారితీయడానికి ఆహారపుటలవాట్లూ ప్రధాన కారణం కావచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం.

నిజానికి మొదట్లో ఉప్పును రుచికోసం కాకుండా ఆహారపదార్థాలను నిల్వ ఉంచడానికి వాడేవారు. ఉప్పు వేసిన ఆహారంలో సూక్ష్మక్రిములు పెరగవు. దాంతో అది కొంతకాలం నిల్వ ఉండేది. ఆహారవైవిధ్యం పెరిగేకొద్దీ ఉప్పు వాడకం పెరిగింది. సమస్యల్నీ పెంచింది. అందుకే ఇప్పుడు ‘ఉప్పు తగ్గించుకోండీ’ అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది.

ఉప్పే కారణమని రుజువేంటి?

పలు పరిశోధనలు చేశాకే శాస్త్రవేత్తలు ఉప్పు (Salt) తగ్గించమని చెబుతున్నారు. రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించి చేసిన నాలుగు ప్రముఖ పరిశోధనలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆహారంలో ఉప్పు కాస్త తక్కువ తినేవాళ్లకన్నా ఎక్కువగా తీసుకున్నవాళ్లలో ఈ సమస్యలూ ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. 2 లక్షల 30 వేలమంది జీపనశైలిని పదమూడేళ్ల పాటు పరీక్షించిన తర్వాతే- రక్తపోటు, గుండెపోటు సమస్య పెరగడం వెనక ఉప్పు పాత్ర ఉందని నిర్ధారించారు.

పై పరిశోధనలను సమీక్షిస్తూ 2020లో మరోసారి ఆరు లక్షల మందిని పరీక్షించగా- రోజువారీ ఆహారంలో గ్రాము ఉప్పు ఎక్కువైతే గుండెజబ్బుల రిస్క్‌ ఆరు శాతం పెరుగుతోందని తెలిసింది. ఉప్పుకీ బీపీకీ సంబంధం ఏమిటీ అంటే- ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయులను నియంత్రణలో ఉంచడానికి నీటి శాతం పెరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో గుండెపోటు, పక్షవాతం రావడమే కాక మూత్రపిండాల్లోనూ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు వివరిస్తున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు దారితీస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ ఒకటి. దానికి కారణాలపై జరిగిన అధ్యయనాల్లోనూ ఉప్పే దోషి అని తేలింది. 2016లో జపానులో నలభై వేల మందితో ఒక అధ్యయనం చేశారు. ప్రాసెస్‌ చేసిన మాంసం, కూరగాయల పచ్చళ్లు లాంటి ఉప్పు కాస్త ఎక్కువ పట్టే వంటల్ని ఇష్టపడుతున్నవారిలో క్యాన్సర్‌ రిస్క్‌ 30 శాతం ఎక్కువ ఉన్నట్లు గమనించారు. ఉప్పుకీ క్యాన్సర్‌కీ సంబంధం ఏమిటన్న దానిమీద ఇంకా పరిశోధనలు జరుగు తున్నాయి. ఉప్పు వల్ల కడుపులో హెలికోబాక్టర్‌ పైలొరి అనే సూక్ష్మక్రిములు ఎక్కువగా తయారవుతున్నాయనీ వాటి కారణంగా ఇన్‌ఫ్లమేషన్‌ మొదలై అల్సర్లకీ ఆ తర్వాత క్యాన్సర్‌కీ దారితీస్తుండవచ్చనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్‌కి దారితీసే అసాధారణ కణవిభజనకి ఉప్పు కూడా ఒక కారణం కావచ్చని భావిస్తోంది మరో పరిశోధన.

ఇవన్నీ చూశాకే ‘ఎందుకైనా మంచిది, ఉప్పు తగ్గించండీ’ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

అసలు ఎంత ఉప్పు తినాలి?

మన శరీరానికి కావలసిన సోడియం అందేది ఉప్పు ద్వారానే. అయితే ఉప్పులో సోడియం 40 శాతమూ క్లోరైడ్‌ 60 శాతమూ ఉంటాయి. శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం చాలు. అది అందాలంటే ఐదు గ్రాముల ఉప్పు సరిపోతుందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆమేరకు అన్ని దేశాల ప్రజలూ జాగ్రత్తపడితే ఏటా పాతిక లక్షల మరణాలను నివారించవచ్చంటోంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అయితే రెండున్నర గ్రాములే చాలంటుంది. ఉప్పు అనగానే మనం కూరల్లో వేసేది మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. కానీ రోజు మొత్తమ్మీద తీసుకునే ఆహార పదార్థాలన్నిటిలో కలిపి చూడాలి. టిఫిన్లూ, కూరలూ, చారులూ, పచ్చళ్లూ, చిరుతిళ్లూ, పెరుగూ, జావలూ... ఇలా అన్నింటిలోనూ ఉప్పు ఉంటుంది. వాటన్నిటిలోనూ కలిపితేనే 5గ్రాములు దాటకూడదన్నది లెక్క. ఇంకా పాలు, మాంసం లాంటి వాటిల్లో సహజంగానే కొంచెం సోడియం ఉంటుంది. దాన్నీ లెక్కలోకి తీసుకోవాలి.

అన్నింట్లో కలిసి ఎంతుందో ఎలా తెలుస్తుంది?

ముందు మనం చేత్తో వేస్తున్న ఉప్పు ఎంత ఉంటోందో చూడాలి. సాధారణంగా ఇళ్లలో వాడే టీస్పూనులో నాలుగు-ఐదు గ్రాములు పడుతుంది. అదే పెద్దగా ఉండే టేబుల్‌ స్పూన్‌ అయితే- 15 గ్రాములు. ఇంట్లో వాడుతున్న స్పూన్‌తో ఎంత ఉప్పు వస్తుందో ఒకసారి తూచి చూసుకోవాలి. మనిషికి ఐదు గ్రాముల చొప్పున ఇంట్లో ఎంత మంది ఉన్నారో అన్ని గ్రాముల ఉప్పు తీసి పక్కన పెట్టి ఆరోజు వంటకాల్లో అది మాత్రమే వాడాలి. అలా అలవాటు చేసుకుంటే క్రమంగా తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.

ఇక, బయట కొనుక్కునే రెడీ టు ఈట్‌, ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలన్నిటిలోనూ ఉప్పు ఉంటుంది. దాన్ని మనం కొలవలేం. కొన్ని ప్యాకెట్లమీద రాస్తారు కానీ ఆ సూచనలను చదివే అలవాటు చాలా మందికి ఉండదు. అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న రోజు ఇంట్లో వాడేది పూర్తిగా తగ్గించేయాలి.

అంతేకాదు, ఉప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఫలానా రకమైతే ఆరోగ్యానికి మంచిది అంటుంటారు వ్యాపారస్తులు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది- ఏ రకమైనా ఉప్పు ఉప్పే. దాని లక్షణాలేవీ మారవు. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యానికి మంచిదైన ఉప్పంటూ ఏదీ ఉండదు.

ఎలా తగ్గించవచ్చు?

ఉప్పు ఏయే పదార్థాల్లో ఉండే అవకాశం ఉందో తెలుసుకుంటే తగ్గించుకోవడం తేలిక. కొద్ది కొద్దిగా తగ్గిస్తూ పోతే కొన్నాళ్లకు రుచిలో ఏమాత్రం తేడా తెలియదంటున్నాయి పరిశోధనలు.

* బేకరీ ఉత్పత్తుల్లో కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉంటాయనుకుంటాం కానీ వాటిల్లో ఉప్పు కూడా ఉంటుంది. దాదాపు తీపి పదార్థాలు కాని స్నాక్స్‌ అన్నింటిలోనూ ఉప్పు ఉంటుంది. కొన్నిసార్లు తీపి పదార్థాల్లో కూడా ఆ తీయదనాన్ని పెంచడానికి చిటికెడు ఉప్పు చేరుస్తుంటారు. శాండ్‌విచ్‌ బ్రెడ్‌, సాస్‌లు, చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌, సూప్స్‌ లాంటి వాటిల్లోనూ ఉప్పు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను బాగా తగ్గించుకోవాలి.

* ప్రాసెస్డ్‌ మాంసం, చీజ్‌ ఉత్పత్తులు, సాసేజెస్‌ లాంటి వాటిల్లో ఉప్పు ఎక్కువే ఉంటుంది.

* రెడీ-టు-ఈట్‌, ప్యాకేజ్‌డ్‌ ఆహారపదార్థాల్లో ఉప్పు ఉంటుంది. అలాంటివి తీసుకుంటున్నప్పుడు ప్యాకెట్ల మీద వివరాలు చదవాలి. దానికి తగ్గట్టుగా ఇంట్లో ఇతర పదార్థాల్లో వాడే ఉప్పును తగ్గించుకోవాలి.

* పెరుగు, మజ్జిగ... తాజాగా చేసుకుంటే వాటిల్లో అదనంగా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైనింగ్‌ టేబుల్‌ మీద ఉప్పు జాడీ ఉంచుకోకపోవడమూ ఒక మార్గం.

* నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువ. అందుకని ఊరగాయలు తినడం బాగా తగ్గించుకోవాలి. వాటికన్నా తాజా కూరగాయలూ, పచ్చిమిర్చితో చేసే రోటి పచ్చళ్లు కొంత నయం.

* బాదం, పిస్తా లాంటివీ సెనగలూ బఠాణీలూ వేరుసెనగ పప్పూ... తదితరాలను మసాలా పేరుతో ఇతర పదార్థాలతో పాటు ఉప్పు బాగా వేసి వేయిస్తారు. వాటిని తరచుగా తినడం మంచిది కాదు.

* సాయంత్రం వేళ చాలామంది రకరకాల టిఫిన్లూ చిరుతిళ్లూ తింటారు. దాంతో రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తారు. వాటి బదులు పండ్లు తింటే- శరీరానికి కావలసిన విటమిన్లూ అందుతాయి, ఉప్పు మోతాదూ తగ్గుతుంది. పైగా బీపీని తగ్గించే పొటాషియం శరీరానికి అందుతుంది. పండ్లూ కూరగాయల్లోనూ శుద్ధిచేయని ఆహారపదార్థాల్లోనూ మాత్రమే ఈ పొటాషియం దొరుకుతుంది. పొటాషియం తక్కువ, సోడియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లే ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతోంది.

* ఈ మధ్య విదేశాల్లో లాగా మనదేశంలో కూడా కూరగాయల్నీ కోసి సిద్ధంగా ఉంచిన ముక్కల్నీ ప్యాక్‌ చేసి అమ్ముతున్నారు. వాటిని నిల్వ చేయడానికి ఉప్పు వాడతారు. అందుకని కూరగాయల్ని వాడేముందు ఒకసారి నల్లా కింద నీటిలో కడగాలి.

* బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, ఎంఎస్‌జి లాంటి సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలను రోజువారీ వంటల్లో వాడకూడదు.

* తరచూ మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలోని ఇతర టాక్సిన్లలాగే ఎక్కువ ఉన్న సోడియం కూడా బయటకు పోతుంది.

ఒకవేళ ఉప్పు తక్కువైతే..?

ఉప్పు ఎక్కువైతే ఎలా హానికరమో పూర్తిగా తగ్గించేసినా అంతే హానికరం. శరీరానికి అవసరమైన రెండు గ్రాముల సోడియం కూడా అందకపోతే...

బీపీ: బీపీ పడిపోతుంది. కళ్లు తిరగడం, చూపు మసకబారడం, స్పృహతప్పి పడిపోవడం, కుంగుబాటు లాంటి సమస్యలు వస్తాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి.

డీహైడ్రేషన్‌: రక్తం సరైన చిక్కదనంతో ఉండేందుకు సోడియం తోడ్పడుతుంది. ఎప్పుడైతే అది ఆహారంలో బాగా తగ్గిపోతుందో అప్పుడు డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. చర్మమూ నోరూ పొడిబారడం, అతిగా దాహం వేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

సోడియం: రక్తంలో సోడియం స్థాయులు తగ్గిపోతాయి. ఏమీ తినాలనిపించకపోవడం, వికారమూ, వాంతులూ... దీని లక్షణాలు. ఇది తీవ్రమైతే మూర్ఛ రావడం, మానసిక సంతులనం కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.

కొవ్వు: సోడియం తగ్గితే ఆటోమేటిగ్గా రక్తంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. పైగా అది చెడు కొవ్వుగా పేర్కొనే ఎల్‌డీఎల్‌ కొలెస్టరాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ కాబట్టి గుండెజబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది.

రెడీమేడ్‌ ఆహారంతో కష్టమేనేమో..!

వివిధ కారణాల వల్ల ప్రాసెస్డ్‌, రెడీమేడ్‌ ఆహారం తీసుకోవడం ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఇలా ఉప్పు, చక్కెర లాంటి వాటిని నియంత్రించడం కాస్త కష్టమే. ఇళ్లలో వాడకం మన చేతుల్లో ఉంటుంది కానీ బయట తినే ఆహారంలో ఏవి ఎంత పరిమాణంలో ఉంటాయో చెప్పలేం. అందుకే- నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు చేసుకోవడం అనేది వ్యక్తిగత బాధ్యత. అలాంటి వాతావరణాన్ని కల్పించడం సామాజిక బాధ్యత. కానీ పరిస్థితి ఆ స్థాయి దాటి తీవ్రంగా తయారైనందున ఇప్పుడు ప్రభుత్వాలు చొరవచూపుతున్నాయి. చట్టాలు చేస్తున్నాయి. రెడీ టు ఈట్‌, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ ప్యాకెట్ల మీద అందులో వాడిన పదార్థాల లెక్క కచ్చితంగా రాయాలని నియమం పెడుతున్నాయి. ప్రత్యేకించి సోడియం స్థాయుల విషయంలో ‘లో, హై, మీడియం’ అనే లేబుళ్లు పెట్టాలి. అలాగే హోటళ్లూ రెస్టరెంట్ల వారిలోనూ ప్రజల్లోనూ ఉప్పు వాడకం మీద చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2004లో జరిగిన వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీలో ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం అనే అంశాలపై రూపొందించిన గ్లోబల్‌ స్ట్రాటజీని అన్ని దేశాలూ అంగీకరించాయి. ఈ మూడు అంశాలమీదా ప్రభుత్వాలు శ్రద్ధ పెడితే వైద్యరంగంలో ఖర్చులు తగ్గడమే కాక ఉత్పాదకత పెరిగి ఆర్థికవ్యవస్థకి లాభం చేకూరుతుందనీ నిపుణులు పేర్కొన్నారు. 2025 కల్లా ఉప్పు వాడకం మూడో వంతు తగ్గించాలన్నదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాల్లో ఒకటి.

అయితే... తగ్గించమంటున్నారు కదా అని కంగారు పడి తగ్గించేయడమూ... ఇన్నేళ్లుగా తింటున్నా బాగానే ఉన్నాం, మనకేమీ కాదులే- అని నిర్లక్ష్యం చేయడమూ... రెండూ సరికాదు. ఆరోగ్యపరంగా ఇప్పటివరకూ ఏ సమస్యలూ లేనివాళ్లు కూడా హఠాత్తుగా కాకుండా కొద్ది కొద్దిగా తగ్గించుకోవడమే మంచిది. అదే బీపీ, మధుమేహం, గుండెజబ్బుల్లాంటి సమస్యలు ఇప్పటికే ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకుని ఉప్పు వాడకంలో ఆచితూచి వ్యవహరించడం మేలు.

ఎందుకంటే... ఉప్పు ఒక్కటి తగ్గించుకుంటే- ఆరోగ్యకరమైన జీవిత కాలాన్ని సునాయాసంగా మరి కొన్నేళ్లు పెంచుకోవచ్చని హామీ ఇస్తున్నారు పరిశోధకులు.

తినాల్సింది 5, తింటున్నది 10గ్రాములకు పైనే!

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఉప్పు వాడకం ఒక్కో వ్యక్తికి రోజుకు ఐదు గ్రాములకు లోపలే ఉండాలి. అందులోనూ ఇంకో గ్రాము తగ్గించుకుంటే గుండెజబ్బు, పక్షవాతం, కిడ్నీజబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఇటీవల వెలువడిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం వారి అధ్యయనం చెబుతోంది. కానీ మనదేశంలో సగటు పౌరులు రోజుకు పది గ్రాములకు తక్కువ కాకుండా, కొందరు ఇంకా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్లు జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ హైపర్‌టెన్షన్‌లో ప్రచురించిన అధ్యయనం పేర్కొంటోంది. దశాబ్దంన్నర క్రితం ప్రపంచవ్యాప్తంగా 187 దేశాల్లో అనారోగ్యాలపై ఒక అధ్యయనం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలపాటు కష్టపడి చేసిన ఆ అధ్యయనంలో తేలిందేమిటంటే- ఎన్నో రకాల అనారోగ్యాలకు మొదటి దోషి ‘ఉప్పే’నని. మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ సగటు పౌరుడు రోజుకు పది గ్రాములకు తక్కువ కాకుండా ఉప్పు తింటున్నాడట. వాళ్లు ఎక్కువగా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తింటారు కాబట్టి అందులో ఎంత ఉప్పు ఉంటోందో ఎవరూ గమనించడమే లేదట.

ఇవి అపోహలే!

ఉప్పు వాడకం గురించి ప్రపంచ దేశాల్లో రకరకాల అపోహలున్నాయనీ వాటిని వదిలించుకుంటేనే ఉప్పు వాడకం తగ్గించవచ్చనీ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అవేంటంటే...

వేడి వాతావరణంలో నివసించేవారికి చెమట ద్వారా లవణాలు బయటకు పోతాయి కాబట్టి వారు ఎక్కువ ఉప్పు వాడవచ్చు.

చెమట ద్వారా పోయే లవణాలు నామమాత్రమే కాబట్టి వాటిని ఉప్పు రూపంలో భర్తీ చేయాల్సిన అవసరం లేదు. నీరు ఎక్కువ తాగితే సరిపోతుంది.

సముద్రపునీటినుంచి తయారుచేసిన సహజ ఉప్పు కన్నా కృత్రిమంగా తయారుచేసిన ఉప్పు మంచిది.

ఉప్పు ఎలా తయారైనా అందులోని సోడియంనే శరీరం వాడుకుంటుంది, కాబట్టి ఏ ఉప్పూ మంచిది కాదు.

వంటల్లో వాడే ఉప్పు వల్ల ప్రమాదం లేదు.

సాధారణంగా వంటల్లోనే ఉప్పును ఎక్కువగా వాడతాం. మనదేశంలో నిల్వ పచ్చళ్లలో మరీ ఎక్కువ. కొన్ని దేశాల్లో అయితే, 80 శాతం ఉప్పు- ప్యాకెట్లలో అమ్మే ప్రాసెస్డ్‌ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతోందట.

ఉప్పు లేకపోతే ఆహారానికి రుచి ఉండదు.

మనం తినడానికి అలవాటు పడిందే నాలుకకి రుచిగా తోస్తుంది. తగ్గించడం మొదలుపెడితే కొత్తలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కొన్నాళ్లకు అలవాటైపోతుంది. ఉప్పు లేకుండా కూడా ఆహారాన్ని ఆస్వాదించవచ్చు- అంటున్నారు శాస్త్రవేత్తలు.

నిజంగా ఉప్పు మోతాదు మించితే ఉప్పగా ఉంటుంది కాబట్టి మనకి తెలిసిపోతుంది.

ఇది మన కూరల్లాంటి వాటికి వర్తిస్తుంది కానీ ప్రాసెస్డ్‌ ఫుడ్‌కి వర్తించదు. చాలా రకాల రెడీమేడ్‌ ఆహారపదార్థాల్లో కలిపే ఇతర పదార్థాల వల్ల ఉప్పు ఎంత ఉన్నా ఉప్పగా అనిపించదు. కొన్నిసార్లు తీపి పదార్థాల్లో కూడా ఉప్పు ఉంటుంది.

వృద్ధులు మాత్రమే ఉప్పు తగ్గించి తినాలి.

ఉప్పు ఎక్కువ తింటే ఏ వయసు వారిలో అయినా రక్తపోటు పెరుగుతుంది.

ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం చెడిపోతుందేమో.

మనం రోజువారీ తినే రకరకాల ఆహారపదార్థాల్లో ఎంతో కొంత ఉప్పు ఉంటుంది. కాస్త తగ్గించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగేంతగా తగ్గిపోదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..