ప్రియా ప్రియా చంపొద్దే...

అలా కన్నుగీటేసి... ఇలా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన అందం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ సొంతం. ఒకే ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన ఈ కేరళ కుట్టి- పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమాలో అలరించనున్న సందర్భంగా తన గురించి కొన్ని విషయాలు పంచుకుందిలా!

Updated : 16 Jul 2023 15:10 IST

అలా కన్నుగీటేసి... ఇలా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన అందం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ సొంతం. ఒకే ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన ఈ కేరళ కుట్టి- పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమాలో అలరించనున్న సందర్భంగా తన గురించి కొన్ని విషయాలు పంచుకుందిలా!

అభిమానం

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అంటే నాకెంతో అభిమానం. ఆయన సినిమాలన్నీ మలయాళంలో డబ్‌ అయి కేరళలో విడుదల అవుతుంటాయి. దాంతో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ పెరిగా. ఒక్క సినిమాలోనైనా అర్జున్‌ సర్‌తో కలిసి నటించాలనుంది. ఒకసారి ఆయన నా వీడియోని డబ్‌స్మాష్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం... ఎంతో ఆనందంగా అనిపించింది.


మాటిచ్చా

చిన్నతనంలో సినిమా చూశాక అద్దం ముందు నిల్చుని హీరోయిన్‌లా డైలాగులు చెప్పేదాన్ని. ఇంట్లో వాళ్లు సరదాగా చేస్తుందిలే అనుకున్నారు. కానీ, ఇంటర్‌లో ఆడిషన్స్‌కి వెళుతున్నప్పుడు అమ్మానాన్నలకు విషయం తెలిసింది. చదువుని నిర్లక్ష్యం చేయకుండా డిగ్రీ పూర్తి చేయాలనే ఒప్పందంతో అమ్మ నన్ను సినీ రంగంలోకి పంపింది.


జ్ఞాపకం

కన్నుగీటే వీడియో చూసిన బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌...‘ఆమెకు పెద్ద స్టార్‌డమ్‌ వస్తుంది. అభినయం కవ్వించేట్టుగా ఉన్నా... ముఖం అమాయకంగానే ఉంది. అసలు ఈమె నేను హీరోగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు...’ అంటూ ట్వీట్‌ చేశారు. అంత పెద్ద నటుడు ఒక్క వీడియోతో గుర్తించి ట్వీట్‌ చేయడం ఎప్పటికీ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది.


తెలుగు నేర్చుకున్నా

నా మొదటి తెలుగు సినిమా నితిన్‌ పక్కన నటించిన ‘చెక్‌’. అందులో నా పాత్ర పేరు యాత్ర. కథ చెప్పినప్పుడు అది ఆసక్తిగా అనిపించి వెంటనే ఒప్పుకున్నా. ఆ తరవాత ‘ఇష్క్‌’లో చేశా. ఆ రెండు సినిమాల్లో నటించేటప్పుడు తెలుగు నేర్చుకున్నా. అవకాశం వస్తే నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నా.


పాక్‌లోనూ అభిమానులు

ఇంటర్‌ నుంచి మోడలింగ్‌ చేస్తూనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో- ఓ సినిమాలో నటించా. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదివేటప్పుడే ‘లవర్స్‌డే’(ఓరు అదార్‌ లవ్‌)లో ఓ చిన్న పాత్ర కోసం తీసుకున్నారు. ఆ సినిమాలోని కన్నుగీటే వీడియో వైరల్‌ అవ్వడంతో రాత్రికి రాత్రే స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. ‘ప్రియా ప్రియా చంపొద్దే’ అంటూ నాకోసం కుర్రకారు గుండెల్లో గుడి కట్టేశారు. పాక్‌లోనూ పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు వెలిశాయి. దాంతో, ‘ఓరు అదార్‌ లవ్‌’లో నా పాత్ర నిడివినీ పెంచారు దర్శకుడు.


ఓ మెట్టు

‘వినోదాయ చిత్తం’ అనే తమిళ సినిమాకి ‘బ్రో’ రీమేక్‌. సముద్రఖని ఆ కథ చెప్పి- అందులో పవన్‌ కల్యాణ్‌- సాయి ధరమ్‌తేజ్‌ హీరోలని చెప్పగానే ఒప్పేసుకున్నా. పవన్‌ సర్‌కి సెట్లో నటన గురించి తప్ప మరేమీ పట్టదు. ఆయనతో కలిసి నటించడం అంటే కెరీర్‌లో ఓ మెట్టు ఎక్కినట్టే అనుకుంటున్నా. ‘బ్రో’ను ఎప్పుడెప్పుడు థియేటర్‌లో చూడాలా అనిపిస్తోంది.


నేపథ్యం

కేరళలోని త్రిశూర్‌లో సినీ నేపథ్యం లేని కుటుంబం మాది. నాన్న సెంట్రల్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అమ్మ హౌస్‌వైఫ్‌.  నాకో తమ్ముడు. అమ్మకి చదువంటే ఇష్టం. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని చాలానే కలలుకంది. అందుకు విరుద్ధంగా నేను సినిమాల్లోకి అడుగుపెట్టానంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.


పాటకీ సై

చిన్నప్పట్నుంచే డాన్స్‌, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. ‘చెక్‌’ సెట్లో ఒకసారి పాటలు పాడుకుంటుంటే.. దర్శకుడు విని నా చేత పాడించాలనుకున్నారు కానీ కుదరలేదు. కన్నడ, మలయాళం భాషల్లో రెండు పాటలు పాడా. కొన్ని ఆల్బమ్స్‌లో తెలుగులోనూ పాడా.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..