విలాసాల ఓడ... ఇక విశాఖ నుంచీ!

ఔను... తెలుగువాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన విలాసాల ఓడ(క్రూయిజ్‌) ఇక విశాఖపట్నం నుంచీ తన సేవలు ప్రారంభించబోతోంది.  తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో విహరించబోతోంది.

Updated : 05 Jun 2022 11:00 IST

విలాసాల ఓడ... ఇక విశాఖ నుంచీ!

ఔను... తెలుగువాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన విలాసాల ఓడ(క్రూయిజ్‌) ఇక విశాఖపట్నం నుంచీ తన సేవలు ప్రారంభించబోతోంది.  తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో విహరించబోతోంది. ‘కార్డేలియా ఎమ్వీ ఎంప్రెస్‌’ అనే ఈ విలాసాల నౌకని సముద్రంలో తేలియాడే ఓ స్టార్‌హోటల్‌ అనొచ్చు! ఆ హోటళ్ళలోలేని సినిమా థియేటర్‌లనీ, అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌నీ కూడా ఇందులో చూడొచ్చు.

విశాఖపట్నం రేవు నుంచి సేవలందించే ప్రయాణికుల ఓడ ప్రస్తుతం ఒక్కటే ఉంది. అది కూడా అండమాన్‌ నికోబార్‌ దీవులకి నెలలో రెండుసార్లు మాత్రమే వెళ్ళొస్తూ ఉంటుంది. ఈ ఓడలో వసతులకేమీ తక్కువుండదుకానీ... పర్యటకం నిమిత్తం విశాఖ నుంచి అండమాన్‌కి వెళ్లాలనుకునేవాళ్లు ఇందులో ఎక్కువగా వెళ్లరు. అలా కాకుండా పర్యటకులూ మెచ్చేలా విశాఖపట్నం నుంచి వివిధ తీరాలకి ఓ విలాసాల ఓడని నిర్వహించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఆ చిరకాల కోరికని తీరుస్తామంటూ ముందుకొచ్చింది ‘కార్డేలియా క్రూయిజ్‌’ సంస్థ. వచ్చే బుధవారం నుంచి విశాఖ-పుదుచ్చేరి-చెన్నై-విశాఖ మార్గంలో తొలి సముద్రయానానికి శ్రీకారం చుట్టబోతోంది. మూడురాత్రులూ నాలుగు పగళ్లుగా సాగే పర్యటక ప్యాకేజీ ఇది. దీనికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడై పోయాయి. రైలైనా బస్సైనా మామూలుగా విశాఖ నుంచి పుదుచ్చేరికి వెళ్లాలంటే 15 గంటలు పడుతుంది. అదే ఈ ఓడ అయితే 36 గంటల సమయం తీసుకుంటుంది. అక్కడి నుంచి చెన్నై వెళ్లి మళ్లీ విశాఖకి రావడానికి మరో రెండురోజులు పడుతుంది. ఇంత ఆలస్యంగా ప్రయాణించినా సరే... పర్యటకులు ఈ ఓడలో ప్రయాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే అందుకు చాలా కారణాలే ఉన్నాయి...

సాగరంలో ఓ స్టార్‌హోటల్‌!

మన భారత సముద్రజలాల్లో తిరుగుతున్న అతిపెద్ద ప్రయాణికుల నౌకల్లో ఈ ‘కార్డేలియా క్రూయిజ్‌-ఎమ్వీ ఎంప్రెస్‌’ నౌక ఒకటి. ఇందులో ఒక్కసారే పదిహేనువందలమందిదాకా ప్రయాణించవచ్చు. ఓడలో మొత్తం 11 అంతస్తులుంటాయి. ఇంజిన్‌కీ, సరకులకీ కిందున్న రెండు అంతస్తులు పోగా... మూడో అంతస్తు నుంచి ప్రయాణికులు బసచేసే గదులు మొదలవుతాయి. అక్కడి నుంచి పదో అంతస్తుదాకా లిఫ్ట్‌లో వెళ్ళొచ్చు. 10వ అంతస్తులో ఓ పేద్ద డాబాలాంటి డెక్‌ ఉంటుంది. పదకొండో అంతస్తులో సూర్యోదయం, సూర్యాస్తమయాలని చూడటం కోసం ప్రత్యేకంగా మరో ప్రత్యేక డెక్‌నీ ఏర్పాటుచేశారు. ఇందులో నిల్చుని అనంత సాగరాన్ని వీక్షించడం... ఓ అద్భుతమైన అనుభవమనే చెప్పాలి. మూడో అంతస్తు  నుంచి తొమ్మిది దాకా... వివిధ స్థాయి వసతులతో కూడిన గదులుంటాయి. మామూలు గదులైనా సూట్‌లైనా శుభ్రతా ప్రమాణాలూ, ఆహార వసతులన్నీ ఓ స్టార్‌హోటల్‌ స్థాయిలోనే ఉంటాయి. ప్రయాణికుల కోసం ఇందులో రెండు పెద్ద రెస్టరెంట్లున్నాయి. ప్రపంచంలోని అన్నిరకాల ఆహారాన్నీ ఇక్కడ రుచిచూడొచ్చు. పిల్లల ఆటల కోసం కార్డేలియా కిడ్స్‌ అకాడమీ పేరుతో అతిపెద్ద ఆవరణ ఉంటుందిక్కడ. ఇవే కాకుండా జిమ్‌, ఈతకొలను, క్యాసినో, కామెడీ షోల కోసం సభావేదికలూ, కొత్త సినిమాల కోసం థియేటర్‌లూ, 24 గంటలూ పనిచేసే సూపర్‌మార్కెట్లూ ఉన్నాయి.

ఈ క్రూయిజ్‌ విశాఖ నుంచి ఈ నెల ఎనిమిదో తేదీన మొదలుపెట్టి జులై వరకూ పర్యటనలు నిర్వహిస్తుంది. టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి. ధర మనం తీసుకునే గదిని బట్టి 27 వేల నుంచి 1.27 లక్షల రూపాయలదాకా ఉంటుంది. థ్రిల్లోఫోబియా, యాత్రా వంటి ఆన్‌లైన్‌ పర్యటక సంస్థలు ఈ క్రూయిజ్‌ టికెట్లని కొంత రాయితీలతో అందిస్తున్నాయి. అన్నట్టు, ఒక ఏడాదిపాటు- పన్నెండేళ్లలోపున్న పిల్లల్ని ఉచితంగానే అనుమతిస్తున్నారు!

బి.ఎస్‌. రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..