ఇంట్లో మొక్కల్ని పెంచుతూ... ఏడాదికి డెబ్భై లక్షలు!

తన కుటుంబం కోసం ఎలాంటి రసాయనాలూ వాడని కూరగాయలూ, పండ్లూ పండిస్తే చాలనుకున్న ఓ పాత్రికేయుడు... ఇప్పుడు ఏకంగా వేల సంఖ్యలో మొక్కల్ని పెంచుతున్నాడు... అదీ హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో.

Published : 12 Nov 2022 23:28 IST

ఇంట్లో మొక్కల్ని పెంచుతూ... ఏడాదికి డెబ్భై లక్షలు!

తన కుటుంబం కోసం ఎలాంటి రసాయనాలూ వాడని కూరగాయలూ, పండ్లూ పండిస్తే చాలనుకున్న ఓ పాత్రికేయుడు... ఇప్పుడు ఏకంగా వేల సంఖ్యలో మొక్కల్ని పెంచుతున్నాడు... అదీ హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో. స్నేహితుడి బంధువుకు వచ్చిన సమస్య కారణంగా వ్యవసాయం వైపు అడుగులు వేసి... ఏడాదికి దాదాపు డెబ్భైలక్షల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. అతడే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన రామ్‌వీర్‌సింగ్‌.

మూడంతస్తుల భవనంలో దాదాపు పదివేలకు పైగా మొక్కలు... ఫామ్‌హౌస్‌లో ఇరవై నుంచి ముప్ఫైవేల మొక్కలు... అన్నీ హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో పెంచినవే. అదనంగా దాదాపు లక్ష వరకూ చెట్లూ మొక్కల్ని ఆర్గానిక్‌ విధానంలో పెంచుతున్న రామ్‌వీర్‌సింగ్‌కు ఈ ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే... ‘కొన్నాళ్లక్రితం నా స్నేహితుడి బాబాయ్‌కి నోటి క్యాన్సర్‌ వచ్చింది. ఆయనకు ఎలాంటి దురలవాట్లూ లేవు. ఆ సమయంలో నేనూ వాళ్లతో ఆసుపత్రులకు తిరిగేవాడిని. అలా వెళ్తున్నప్పుడే ఓసారి నోటిక్యాన్సర్‌కి కారణం ఏమయ్యుంటుందని డాక్టర్‌ని అడిగితే... ఆహారపదార్థాల్లో ఉండే కెమికల్స్‌, పురుగుమందులు అయ్యుండొచ్చని చెప్పారు. ఆ మాటలు విన్నాక కనీసం మేమైనా ఆర్గానిక్‌ కూరగాయలూ పండ్లూ తినాలనుకున్నాం. అవి అంత సులువుగా దొరకవు కాబట్టి మా ఇంట్లోవాళ్లకోసం నేనే వాటిని పండించాలనుకున్నా. ఇప్పుడు అదే నా ఉపాధిమార్గంగా మారింద’ని వివరిస్తాడు రామ్‌వీర్‌సింగ్‌.

దుబాయ్‌లో మొదటిసారి...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కడే ప్రాంతానికి చెందిన రామ్‌వీర్‌ది కూడా వ్యవసాయ కుటుంబనేపథ్యమే. అయితే... జర్నలిజం, సోషల్‌సైన్స్‌, గ్రామీణాభివృద్ధి అంశాలుగా నాలుగు పీజీ పట్టాలు అందుకోవడంతో... వివిధ ఛానళ్లలో పాత్రికేయుడిగా పనిచేయడం మొదలుపెట్టాడు. తన వృత్తిలో భాగంగా పలు దేశాలకూ వెళ్లిన రామ్‌వీర్‌ ఓసారి దుబాయ్‌లో హైడ్రోపోనిక్స్‌ విధానంలో మొక్కల్ని పెంచడం చూశాడు. కేవలం నీటి ఆధారంతోనే పెరిగే మొక్కల్ని చూశాక తానూ ప్రయత్నించాలనుకున్నాడు కానీ పనిలో పడి వదిలేశాడు. తన స్నేహితుడి బాబాయ్‌ సంఘటన తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలనుకున్న రామ్‌వీర్‌ మళ్లీ దుబాయ్‌ వెళ్లి హైడ్రోపోనిక్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. చివరకు తన మూడంతస్తుల ఇంట్లో మొక్కల్ని పెంచేందుకు పైపుల్ని సొంతంగా డిజైన్‌ చేసుకుని, నీటి వసతిని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట్లో కేవలం తమ ఇంటికోసమే కూరగాయలూ, పండ్లూ పండించడం మొదలుపెట్టాడు. ఊహించినదానికన్నా మంచి ఫలితం రావడం, కొవిడ్‌ సమయంలో కాస్త తీరిక దొరకడం వల్ల తన ఆలోచనను విస్తరించాడు. ఇప్పుడవి పదివేల మొక్కల వరకూ అయ్యాయి. వాటిల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, సొరకాయ, కాకర, కీరదోస, స్ట్రాబెర్రీలు, లిచీ, సపోటా.. ఇలా అన్నిరకాలూ ఉన్నాయి. తమ ఇంటి అవసరాలకు పోగా మిగిలిన వాటిని అమ్మడం మొదలుపెట్టాడు.

వ్యాపారంగా మార్చుకున్నాడు

ఆ తరువాత తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫామ్‌హౌస్‌లోనూ ఈ ప్రయోగాన్ని చేశాడు. ఓ వైపు ఇరవై- ముప్ఫైవేల మొక్కల్ని పెంచుతూనే మిగిలిన ఖాళీ స్థలంలో ఆర్గానిక్‌ పద్ధతిలో బియ్యం మొదలు చెరకు వరకూ అన్నిరకాలూ పండిస్తున్నాడు. క్రమంగా ఓ రెస్టరంట్‌నూ ప్రారంభించి అక్కడా ఈ కాయగూరల్నే ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం తన దగ్గర లక్ష వరకూ మొక్కలూ, చెట్లూ ఉన్నాయని చెప్పే రామ్‌వీర్‌ తన సంస్థ ‘వింపా ఆర్గానిక్‌ అండ్‌ హైడ్రోపోనిక్స్‌’ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల రైతులకూ, ఆసక్తి ఉన్నవారికి హైడ్రోపోనిక్స్‌ విధానంపైన శిక్షణ ఇస్తున్నాడు. చిన్నస్థాయిలో కిట్‌లనూ తయారుచేసి అమ్ముతున్నాడు. విదేశాల నుంచీ... తెలంగాణ, చెన్నై, దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచీ.. తనని సంప్రదిస్తున్నారనీ ఇప్పుడు ఇదే తన ప్రధాన వృత్తిగా మారిందనీ అలా ఏడాదికి డెబ్భై లక్షల రూపాయల వరకూ వార్షిక ఆదాయాన్ని అందుకుంటున్నాననీ అంటాడు. ‘కొన్ని జాగ్రత్తలతో వీటిని సులువుగా పెంచేయొచ్చు. నేను టైం చూసుకుని వెళ్లి మోటార్‌ వేయడం.. ప్రతి మొక్కకూ నీళ్లు అందాయో లేదో చూసుకోవడం కాకుండా... ప్రత్యేక టైమర్‌ని పెట్టుకుని... మోటార్‌లోని నీళ్లు వాటంతట అవి ప్రవహించి, మళ్లీ రొటేషన్‌ పద్ధతిలో ట్యాంకులోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నా. వీటికి కావాల్సిన రాగి, ఫాస్పరస్‌, నైట్రోజన్‌, జింక్‌.. వంటి పదహారు రకాల పోషకాలూ నీటిద్వారానే అందేలా చూస్తున్నా. సీజన్‌ను బట్టి కొత్త మొక్కల్ని పెంచడం, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలూ నిపుణులతో మాట్లాడటం...వంటివీ చేస్తుంటా’నని చెబుతాడు రామ్‌వీర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..