విద్య, వాక్కు ప్రసాదించే... వాగ్దేవి!

ఏడాది మొత్తం జరిగే అక్షరాభ్యాసాలూ, తమ కోరికలు నెరవేరినప్పుడల్లా విద్యార్థులు చెల్లించుకునే మొక్కులూ, అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక అభిషేకాలూ, ఇతర పూజా కార్యక్రమాలతో కళకళలాడుతుంది జ్ఞాన సరస్వతీ దేవాలయం. అమ్మవారు ఇష్టపడి మరీ కొలువుదీరిన ఈ క్షేత్రంలోని దేవిని దర్శించుకుంటే.. విద్యాప్రాప్తితోపాటు ఉద్యోగాలూ వస్తాయనేది భక్తుల నమ్మకం.

Updated : 02 Oct 2022 00:30 IST

విద్య, వాక్కు ప్రసాదించే... వాగ్దేవి!

ఏడాది మొత్తం జరిగే అక్షరాభ్యాసాలూ, తమ కోరికలు నెరవేరినప్పుడల్లా విద్యార్థులు చెల్లించుకునే మొక్కులూ, అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక అభిషేకాలూ, ఇతర పూజా కార్యక్రమాలతో కళకళలాడుతుంది జ్ఞాన సరస్వతీ దేవాలయం. అమ్మవారు ఇష్టపడి మరీ కొలువుదీరిన ఈ క్షేత్రంలోని దేవిని దర్శించుకుంటే.. విద్యాప్రాప్తితోపాటు ఉద్యోగాలూ వస్తాయనేది భక్తుల నమ్మకం.

విశాలమైన ప్రాంగణంలో ఆశీనురాలై... తన చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తూ... విద్య, వాక్కు, బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పూజలు అందుకుంటోంది... సికింద్రాబాద్‌ జ్ఞాన సరస్వతీ దేవాలయంలోని అమ్మవారు. మనసారా మొక్కినవారి కోరికల్ని తీర్చే తల్లిగా విరాజిల్లుతోంది ఇక్కడ కొలువైన సరస్వతీదేవి.

స్థలపురాణం

అమ్మవారు కోరి మరీ ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ కొలువయ్యిందని చెబుతారు ఆలయ నిర్వాహకులు. నిజానికి ఒకప్పుడు ఇక్కడ సచ్చిదానంద ఆశ్రమం అనే సేవా సంస్థ ఉండేది. ఏ ఆధారంలేని మహిళలకు ఈ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించేవారు. ఈ ఆశ్రమం ప్రాంగణంలోనే ఉన్న  రామాలయంలో మహిళలు పూజలు చేసుకునేవారు. వాళ్లలో పిరాట్ల లక్ష్మీరామమ్మ అనే భక్తురాలు రోజూ ఆలయాన్ని దర్శించుకునేదట. ఆమె శిష్యురాలైన పిరాట్ల కామేశ్వరమ్మ కూడా లక్ష్మీరామమ్మను అనుసరిస్తూ రోజూ అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేది. ఓసారి కామేశ్వరమ్మ బాసరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వచ్చిందట. ఆ తరువాత కొన్ని రోజులకు  సరస్వతీదేవి ఆ భక్తురాలికి కలలో కనిపించి తన విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయమని చెప్పిందట. అలా ఆమె ఇక్కడ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. కొన్నాళ్లకు ఈ ఆలయ బాధ్యతలను శృంగేరీ శారదాపీఠం స్వీకరించడంతో ఆలయం అభివృద్ధి చెందిందనీ ఆ తరువాత ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారనీ అంటారు. అప్పటి నుంచీ ఈ మందిరం జ్ఞానసరస్వతీ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. క్రమంగా ఈ ప్రాంగణంలోనే చంద్రమౌళీశ్వరస్వామి, జగద్గురువు ఆదిశంకరాచార్యులు, గణపతి విగ్రహాలనూ ప్రతిష్ఠించారు.  

ప్రత్యేక హోమాలూ...

ఈ ఆలయంలో కొలువైన జ్ఞానసరస్వతీదేవి... మనసారా పూజించిన భక్తులపైన తన కరుణను కురిపిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తుందని చెబుతారు. అందుకే ఉద్యోగం, ఉన్నత చదువులు అర్థించే భక్తులు పద్నాలుగు సార్లు ప్రదక్షిణ చేసి.. కోరిక నెరవేరేవరకూ రోజూ దేవిని దర్శించుకుని తరువాత మొక్కులను చెల్లించుకుంటారు. ‘అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకుని లేదా ఉద్యోగం కోసం మొక్కుకుని జీవితంలో స్థిరపడినవాళ్లు ఏ దేశంలో, రాష్ట్రంలో ఉన్నా సరే తమ పిల్లల్ని ఇక్కడకు తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారంటే- ఈ గుడి ప్రత్యేకతనూ అమ్మవారి విశిష్టతనూ అర్థం చేసుకోవచ్చు’ అని
చెబుతారు ధర్మాధికారి కళా జనార్దనమూర్తి. ఆలయంలో అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా ప్రతినెలా మూలా నక్షత్రం రోజున ప్రత్యేకంగా సరస్వతీ హోమం... మాసశివరాత్రి, పౌర్ణమి, సంకష్టహర చతుర్ధి రోజుల్లో మహారుద్రాభిషేకం, చండీ- గణపతిహోమాలను నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల సమయంలో రోజువారీ చేసే అలంకరణలతోపాటూ అంగరంగవైభవంగా పూజా కార్యక్రమాలూ, హోమాలూ జరిపిస్తారు.

ఆ పది రోజులపాటూ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు రావడం విశేషం. ఇక వసంత పంచమి, దసరాల్లోనే కాకుండా ఏడాది మొత్తం ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీపంచమి రోజున అమ్మవారికి జరిపే హంసవాహనసేవను చూసి తరించాల్సిందే. ఇవి కాకుండా రోజూ చండీపారాయణంతోపాటూ ఆసక్తి ఉన్న విద్యార్థులకు భగవద్గీత తరగతులనూ నిర్వహిస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

జ్ఞానసరస్వతీ దేవాలయం... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి దగ్గరగా ఉంటుంది. ఆలయానికి రావాలనుకునే భక్తులకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. లేదంటే సికింద్రాబాద్‌ వరకూ వస్తే... అక్కడినుంచి ఆలయానికి చేరుకునేందుకు ఆటోలు ఉంటాయి.

- బోయిన భాస్కర్‌, న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..