ఆధ్యాత్మిక ఆనందానికి ఆరు మార్గాలు!

కొత్త ఏడాది వస్తోందంటే... పదుల సంఖ్యలో పుస్తకాలను చదివేయాలనే నియమం పెట్టుకుంటాం. మనల్ని ఇబ్బందిపెడుతున్న ఓ అలవాటును వదిలించుకోవాలనుకుంటాం.

Updated : 25 Mar 2023 17:02 IST

ఆధ్యాత్మిక ఆనందానికి ఆరు మార్గాలు!

కొత్త ఏడాది వస్తోందంటే... పదుల సంఖ్యలో పుస్తకాలను చదివేయాలనే నియమం పెట్టుకుంటాం. మనల్ని ఇబ్బందిపెడుతున్న ఓ అలవాటును వదిలించుకోవాలనుకుంటాం. ఎలాగైనా సరే వ్యాయామాన్ని చేసేయాలనుకుంటాం. ఇలాంటివన్నీ సరే, మరి మన మనసు ఆనందంగా ఉండాలంటే... ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించాలనుకుంటే... ఏంచేయాలో కూడా తెలియాలిగా...


దినచర్యలో భాగంగా పొద్దున్నే పూజ చేయడం.. అప్పుడప్పుడూ గుడికి వెళ్లడం.. అందరూ చేసేదే. అంతకు మించి ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి... కొన్ని మార్గాలను సూచిస్తున్నాయి మన పురాణాలు.  


స్వచ్ఛమైన మనసుతో ప్రార్థన

నిష్కల్మష హృదయంతో చేసే ప్రార్థనతో అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి. భగవంతుడే సర్వస్వం అనుకునేవారు ఎలాంటి సమస్యలనైనా ఆనందంగా ఎదుర్కొంటారనడానికి ప్రహ్లాదుడి జీవితమే చక్కని ఉదాహరణ. హిరణ్యకశిపుడు కుమారుడి పట్ల ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ప్రహ్లాదుడు దేనికీ బాధపడలేదు. హరినామస్మరణ తప్ప మరో ధ్యాస లేకుండా గడిపిన ప్రహ్లాదుడు తనకు అసలు సమస్యలు ఎదురైనట్లుగానే భావించకుండా అన్నింటినీ ఆనందంగా అనుభవించాడు. అలాంటి భక్తిని సొంతం చేసుకోగలగాలి. స్వచ్ఛమైన మనసుతో అన్యధా శరణం నాస్తి... అంటూ చేసే ప్రార్థనలో ఓ మహత్తర శక్తి ఉంటుంది. అందుకే రోజులో కాసేపైనా సరే ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని స్మరించాలి. అది పరోక్షంగా భగవంతుడితో సంభాషించినట్లే అవుతుంది మరి.


పఠనం అవసరమే

ఆధునిక జీవితంలో మన జీవన ప్రయాణం కోసం వేసే ప్రతి అడుగూ ఓ యుద్ధం లాంటిదే. ఆ యుద్ధంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోవాలంటే...  స్థిమితంగా ఆలోచించగలగాలి. ఆ శక్తిని అందించి, మనో వికాసాన్ని పెంచే మహత్తర గ్రంథమే భగవద్గీత. ఏడాది మొత్తం బోలెడు పుస్తకాలు చదివేయాలనే నియమాన్ని పెట్టుకునే మనం అందులో భగవద్గీతనూ చేర్చుకుంటే... మన ఆలోచనావిధానంలో ఎంతో మార్పు వస్తుందనీ, మానసిక పరిణతీ సొంతమవుతుందనీ మానసిక నిపుణులే చెబుతారు. రోజుకి ఒకటిరెండు శ్లోకాలు చదివి వాటి అర్థాలను తెలుసుకోగలిగినా చాలు. అలాగే కుదిరినప్పుడల్లా సత్సంగాలకు వెళ్లడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా మారుతుంది.  


దాతృత్వ గుణం పెంచుకుందాం

అన్నీ కుదిరినప్పుడూ మనకు సమయం ఉన్నప్పుడూ ఏదయినా అనాథాశ్రమానికి వెళ్లడం, అన్నదానం చేయడం... మంచి అలవాట్లే. కానీ ఆ సేవాగుణాన్ని అక్కడితోనే ఆపేయకుండా దాన్ని మన జీవితంలో ఓ భాగం చేసుకోగలగాలి. మన దగ్గరున్న సంపదలో కొంత ఇవ్వడంతోపాటు మన చదువు, మన నైపుణ్యాలు, మన సమయం... ఇలా ప్రతిదీ ఇతరులకు
ఉపయోగించాలి. వృద్ధులతో కాసేపు కబుర్లు చెప్పినా, వచ్చిన విద్యను పేద పిల్లలకు పంచినా.. మన అంతర్గత జ్ఞానమూ పెరుగుతుంది. ఆ దాతృత్వం నుంచి పొందే అపారమైన ఆనందం ఆధ్యాత్మిక మార్గానికి సోపానంలాంటిదని అంటారు.


పుణ్యక్షేత్రాలకూ సమయం

పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడూ విహారయాత్రలకు వెళ్లడం అందరూ చేసేదే. ఈసారి అలా వెళ్లే ప్రాంతాల జాబితాలో కనీసం కొన్నయినా పుణ్యక్షేత్రాలనూ చేర్చుకుంటే సరి. గుళ్లూ-గోపురాలకు వెళ్లే వయసు ఇంకా ముందుందని తేలిగ్గా తీసుకోకండి. ఓ వయసు దాటాక శరీరం సహకరించకపోవచ్చు కాబట్టి...  ఓపిక ఉన్నప్పుడే వీలైనన్ని పుణ్యక్షేత్రాలను చుట్టొచ్చేయాలి. వయసు మీరాక కళ్లు మూసుకుని కూర్చున్నప్పుడు- ఒకప్పుడు తీర్థయాత్రలు చేసిన అనుభూతులన్నీ మనసును తట్టి లేపుతాయి. వాటిని నెమరువేసుకుంటూ... ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు.


ధ్యానం ప్రధానం...

మన దేహాన్ని దేవాలయంతో పోలుస్తారు. దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచినట్లే... మన మనసునూ అంతే పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోగలగాలి. అంటే... మనసును అల్లకల్లోల పరిచే అనవసర ఆలోచనల్ని దూరం చేసుకుని సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. ఇది సాధ్యం కావాలంటే ధ్యానం చేయడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి.


క్షమాగుణం ఉండాలి

క్షమాగుణం బలవంతుల భూషణమని అంటారు. క్షమ ద్వారా లోకాన్నే వశపరచుకోవచ్చు. ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాల్లో క్షమ కూడా ముఖ్యమేనని గీతాచార్యుడి మాట. చేతిలో క్షమ అనే అస్త్రం దాల్చినవాడిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని వివరిస్తాడు. కాబట్టి.. రాగద్వేషాలకు అతీతంగా క్షమాగుణాన్ని పెంచుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..