అమృతఫలం... అరటి!

సీజన్‌తో సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఆ దేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా పండుతుంది. పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం... శుభకార్యాల్లోనూ పూజల్లోనూ నైవేద్యంగా ప్రసాదంగా పంచే పవిత్ర ఫలం... అదే మనందరికీ సుపరిచితమైన అరటిపండు.

Updated : 24 Sep 2023 15:38 IST

సీజన్‌తో సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఆ దేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా పండుతుంది. పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం... శుభకార్యాల్లోనూ పూజల్లోనూ నైవేద్యంగా ప్రసాదంగా పంచే పవిత్ర ఫలం... అదే మనందరికీ సుపరిచితమైన అరటిపండు. వేల ఏళ్ల నుంచీ పెరట్లోనూ తోటల్లోనూ వందల రకాల్లో పండిస్తున్నాం. ఆ రుచిని ఆస్వాదిస్తున్నాం. అయితే తాజాగా మరింత పోషకభరితమైన ‘సూపర్‌ బనానా’ను సైతం రూపొందించారు పరిశోధకులు. ఈ సందర్భంగా అమృతతుల్యమైన అరటి గురించిన కథాకమామిషు..!

పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ అరటి పండు మాత్రమే ఆరోగ్యంతోపాటు ఆనందాన్నీ అందిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మృదువుగా ఉంటుంది కాబట్టి అన్నం కన్నా ముందు పసివాళ్లకు తినిపించే ఘనాహారం కూడా ఇదే. నిజానికి రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడితో పని ఉండదు అంటారు కానీ, రోజుకో అరటిపండు తిన్నా చాలు, సకల రోగాల నుంచీ సంరక్షిస్తుంది.

ఇక, వివాహాది శుభకార్యాల్లోనూ గుడుల్లోనూ అరటిపండు ప్రాశస్త్యం ఎంతో. పూజల్లో వ్రతాల్లో తాంబూలంలోనూ వాయనాల్లోనూ అరటిపండ్లు తప్పనిసరి. స్వామి నివేదనలోనూ ప్రసాదాల్లోనూ కదళీఫలమే కీలకం. భగవద్గీత, బౌద్ధకథల్లోనూ ఈ చెట్టు ప్రస్తావన ఉంది. కల్యాణమండపాల దగ్గర ఈ చెట్లను ఉంచితే వైవాహిక జీవితం పచ్చగా ఉంటుందనీ చెబుతారు. బెంగాలీలు దుర్గాపూజ సందర్భంగా అరటికాండంతో ‘కోలా బౌ’ అనే దేవీ రూపాన్ని చేసి, ఆమెతో గణేశుడి పెళ్లి జరిపిస్తారు. పెరట్లో అరటి ఉంటే ఆ ఇల్లు సిరిసంపదలతో ఆనందంతో కళకళలాడుతుందనీ నమ్ముతారు. పూర్వం అతిథులకి అరిటాకుల్లోనే భోజనం పెట్టేవారు. రుచిగా ఉండటంతోపాటు ఆహారంలో విషం ఉంటే ఆకు నల్లబడుతుంది. కాబట్టి భయం లేకుండా తినేవారట. పైగా వేడి వేడి పదార్థాలను వడ్డించడం వల్ల ఆకులోని పాలిఫెనాల్స్‌ కరిగి ఆహారానికి అదనపు బలాన్నీ రుచినీ ఇస్తే, క్లోరోఫిల్‌ అల్సర్లనీ, చర్మవ్యాధుల్నీ నివారిస్తుందట.

ఎన్ని రకాలో...

వరికన్నా ముందునుంచే మనిషి పండించిన పంట అరటి. అయితే అడవిలో పుట్టిన అరటి రకాల్లో గట్టి గింజలు ఉండేవి. వాటిని రకరకాలుగా సంకరీకరించినప్పుడు- గింజల్లేని అరటిపండ్ల మొక్కలు పుట్టుకొచ్చాయి. విత్తనాల్లేని ఆ మొక్కల్ని ఎలా సాగుచేయాలా అని ఆలోచించిన మనిషికి చెట్టు పక్కనే ఉన్న పిలకలు కనిపించాయి. అలా అంతటా వ్యాప్తిలోకి వచ్చిన అరటిలో వెయ్యికి పైగా రకాలున్నాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ... ఇలా భిన్న రంగులూ ఉన్నాయి. దాదాపు 135 దేశాల్లో పండుతుంది. కానీ అధికంగా పండించేదీ తినేదీ భారత్‌లోనే. ఏటా మూడుకోట్ల టన్నులకు పైగా పండిస్తున్నాం. అందులో 97 శాతం తినేస్తున్నాం. వాటిల్లో తియ్యని డ్వార్ఫ్‌ క్యావెండిష్‌, మంచి వాసనతో తియ్యగా ఉండే రొబస్టా, రస్తాలీ, నిల్వ ఉండే చక్కెరకేళి, నారింజరంగు గుజ్జుతో తియ్యగా ఉండే రెడ్‌ బనానా, కర్పూరవల్లి, అమృతపాణి, నీలం తొక్కతో వెనీలా ఐస్‌క్రీమ్‌ రుచిని తలపించే బ్లూ జావా... వంటి రకాల్నే ఎక్కువగా పండిస్తున్నాం. పళని, షెవరాయ్‌ కొండలమీద పండించే విరూపాక్షి రకం సువాసనతో కూడిన తియ్యని రుచితో ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి పంచామృతంలోనూ ఈ పండునే వాడతారు. చిటికెన వేలు సైజులో ఉండే యాలక్కి రకం చక్కెరకన్నా తియ్యగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది... ఇందులో పీచు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. అందుకే మిగిలిన పండ్లకన్నా దీని ఖరీదూ ఎక్కువే. అయితే చిన్నగా అండాకారంలో ఉండి, తేనె రుచిని మరిపించే తమిళనాడు ‘మట్టి’ రకం, అన్ని రకాల అరటిపండ్లకన్నా ఖరీదైనది. ఇంకా ఆపిల్‌ను మరిపించే మాంజానో, మైసూర్‌కు చెందిన నంజాన్‌గుడ్‌, చేతులు జోడించినట్లుగా ఉండే ప్రేయింగ్‌ హ్యాండ్స్‌, తియ్యని లేడీ ఫింగర్‌, గోల్డ్‌ ఫింగర్‌... ఇలా చాలానే ఉన్నాయి.

వాడకాన్ని బట్టి అరటి రెండు రకాలు... మృదువైన గుజ్జుతో పండుగా మారేదీ, పచ్చిగా వాడుకునేదీనూ... పండు అరటిలో మాదిరిగానే పచ్చి అరటి(ప్లాంటెయిన్‌)లోనూ పచ్చ, పలకల, నూకల, సపోటా, బూడిద బొంత, వామనకేళి... ఇలా బోలెడు రకాలు. పీచు ఎక్కువుండే పచ్చి అరటితో కూరలూ వేపుళ్లూ చిప్సూ బజ్జీలూ వండుతారు. ఫ్రూట్‌ సలాడ్లలో ఎక్కువగా వాడేదీ అరటిపండే. కాయలూ పండ్లే కాదు, ఆరోగ్యానికి మంచిదని అరటిపువ్వునీ దూటనీ కూడా కూరలుగా వండుతారు. మొత్తంగా ఈ చెట్టు కాయ, పండు, పువ్వు, కాండం, ఆకు... అన్నీ ఉపయోగకరమే.

ఎందుకు మంచిది?

అరటి... శక్తిమంతమైన పండు. ఇందులో సహజ చక్కెరలైన సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌లూ పీచూ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి బలహీనులకీ అథ్లెట్లకీ ఉపవాసం చేసేవాళ్లకీ పుష్టినీ తక్షణ శక్తినీ అందిస్తుంది. పక్వానికి రాని అరటిలో రెసిస్టెంట్‌ స్టార్చ్‌ ఉంటుంది. తింటే పొట్ట నిండి, క్రేవింగ్‌ తగ్గుతుంది. పచ్చి అరటి విరేచనాలకీ పండినవి మలబద్ధకానికీ మందుగా పనిచేస్తాయి.

  • ఈ పండులో పొటాషియం పుష్కలం. రక్తప్రసరణను పెంచి, గుండెజబ్బుల్ని నిరోధిస్తుంది. బీపీనీ తగ్గిస్తుంది. మెగ్నీషియం కండరాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే బి6 ఎర్ర రక్తకణాల తయారీకీ, ఆహారాన్ని శక్తిగా మార్చేందుకూ ఉపకరిస్తుంది. నాడీవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచి నిద్రపట్టేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ పండులోని ట్రిప్టోఫాన్‌ అనే ప్రొటీన్‌, శరీరంలో కలవగానే ఆనందాన్ని కలిగించే సెరటోనిన్‌ హార్మోన్‌గా మారుతుంది. ఇంకా బి6 సెరటోనిన్‌, డోపమైన్‌ల ఉత్పత్తిని పెంచడంతో ఒత్తిడి తగ్గి, హాయిగా ఉంటుంది. అందుకే ఇది ‘హ్యాపీ ఫ్రూట్‌’.
  • అరటిలోని విటమిన్‌-సి, మాంగనీసు కణ నష్టాన్ని నివారిస్తాయి. చర్మాన్నీ ఎముకల్నీ పట్టి ఉంచే కొలాజెన్‌ని తయారుచేస్తాయి. ఐరన్‌ శోషణని పెంచడంతో రక్తహీనత రాదు. వీటిల్లోని ఓలిగోశాకరైడ్స్‌ వల్ల ఆహారంలోని కాల్షియంని గ్రహించే శక్తి పెరగడంతో ఎముకలు బలోపేతమవుతాయి.
  • క్యాన్సర్‌, ఆస్తమా... వంటి వ్యాధుల్ని నిరోధిస్తుంది అరటి. కండరాల తిమ్మిర్లూ నొప్పులూ తగ్గడానికీ అరటి మేలే. 
  • అరటిపండు సహజమైన యాంటాసిడ్‌. కడుపులో అల్సర్లనీ, గుండెల్లో మంటనీ నివారిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. అరటిపండ్లు కిడ్నీ సమస్యల్ని నిరోధిస్తాయి. రోజూ ఒక అరటిపండు తింటే పిల్లల్లో చురుకుదనమూ ఏకాగ్రతా పెరుగుతాయి. భోజనం చేశాక ఈ పండు తింటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. అరటిపండుని మధుమేహులు తినకూడదు అంటారు. కానీ తగుమోతాదులో తీసుకోవచ్చు. పెక్టిన్‌ పీచు కారణంగా ఇందులోని చక్కెరలు నెమ్మదిగా రక్తంలోకి విడుదలవుతాయి. లేదూ... నట్స్‌, పాలు వంటి వాటితో కలిపి తింటే వాటిల్లోని ప్రొటీన్‌, కాల్షియం కారణంగా ఒకేసారి చక్కెరలు రక్తంలో చేరకుండా ఉంటాయి. అందుకే మరి... ఇకనుంచైనా మిగిలిన పండ్లతో పోల్చి దీన్ని తేలికగా చూడకుండా ‘అరటి... అమృతఫలం’ అని గుర్తుంచుకుని మరీ తినండి..!

కారట్‌ అరటి!

అరటిపండులో వేర్వేరు రకాలున్నట్లే వాటి పోషకాల్లోనూ మార్పుంటుంది. పసిఫిక్‌ సముద్రంలోని మైక్రోనేషియాలోని పోన్‌పెయ్‌ దీవిలో పండే వంద గ్రా. కారట్‌ బనానాలో విటమిన్‌-ఎ 2230 మై.గ్రా. ఉంటుంది. ఇది సాధారణ క్యావెండిష్‌(21 మై.గ్రా.) కన్నా వంద రెట్లు ఎక్కువ. అక్కడి పసిపిల్లలకు ఈ పండ్లనే సంప్రదాయ ఆహారంగా పెడుతుంటారట. ఈ పండు నారింజ రంగు గుజ్జుతో ఉంటుంది కాబట్టి దీన్ని కారట్‌ అరటి అనీ అంటున్నారు. ఇందులోని జన్యువుల్ని ఇతర రకాల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  తాజాగా ప్రొ విటమిన్‌-ఎ అధికంగా ఉన్న పపువా న్యూగినియా అరటి రకంలోని ఓ జన్యువును క్యావెండిష్‌ రకంలో ప్రవేశపెట్టగలిగారు క్వీన్స్‌ల్యాండ్‌ నిపుణులు. లేత నారింజ రంగు గుజ్జుతో ఉండే ఈ పండునే ‘సూపర్‌ బనానా’గా పిలుస్తున్నారు. ఇది సాగులోకి వస్తే, ఇన్ఫెక్షన్లూ విటమిన్‌-ఎ లోపంతో చిన్నవయసులోనే కంటిచూపును కోల్పోతున్న పేద పిల్లలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే తూర్పు ఆఫ్రికా దేశాలకు అరటే ప్రధాన ఆహారం. అక్కడివాళ్లు రోజుకి పదీ పన్నెండు అరటిపండ్లూ లేదా కాయల్నే ఉడికించుకుని తింటారు మరి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..