ఇంట్లోని పనివాళ్లకు రూ.4కోట్ల షేర్లు..!

ఓ మంచి పనో, చిన్న ఆర్థిక సాయమో లేక పుట్టినరోజు నాడు పదిమందికి అన్నదానం వంటివేవో చేస్తే చాలు...

Updated : 27 Mar 2022 11:12 IST

ఇంట్లోని పనివాళ్లకు రూ.4కోట్ల షేర్లు..!

ఓ మంచి పనో, చిన్న ఆర్థిక సాయమో లేక పుట్టినరోజు నాడు పదిమందికి అన్నదానం వంటివేవో చేస్తే చాలు... వెంటనే టకటకా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొందరు. అదే కోటానుకోట్లు దానం చేసేవారు ఇంకేస్థాయిలో చెప్పుకోవాలి? ఐడీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో వైద్యనాథన్‌ మాత్రం ఎన్నికోట్లు దానం చేసినా ఎవరికీ చెప్పడు. సామాజిక మాధ్యమాలకు దూరంగా సామాన్యులకు దగ్గరగా బతికే ఆయన నిజంగా దానకర్ణుడే.

‘మన వద్ద పనిచేసేవాళ్లంటే మనవాళ్లే’ అని బలంగా నమ్ముతాడు వైద్యనాథన్‌. అందుకే, 2018లో దాదాపు రూ.20 కోట్ల్లు విలువైన షేర్లను ఉద్యోగులకీ, కారు డ్రైవర్‌కీ, తన పనివాళ్లకీ రాసిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ విషయం తను సీఈవోగా పని చేస్తున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సమయంలో బయటకు రావడంతో వార్తల్లో నిలిచాడు వైద్యనాథన్‌.   ఆ తరవాత 2020లో తనకి చిన్నతనంలో రూ.500 ఇచ్చి సాయపడిన సైనీ మాస్టారికి రూ.30 లక్షల విలువైన షేర్లను బదిలీ చేశాడు. అదీ ముప్ఫైఏళ్లపాటు వెతికి మరీ ఆ మాస్టార్ని కలుసుకుని షేర్ల రూపంలో కృతజ్ఞత తెలిపాడు. అలానే గతేడాది రూ.2.5 కోట్ల్లు విలువ చేసే షేర్లని మరో ముగ్గురు పనివాళ్లకు ఇచ్చాడు. గత నెల్లో వ్యక్తిగత శిక్షకుడికీ, డ్రైవర్‌కీ, ఇంట్లో పని చేసేవాళ్లకీ మొత్తం తొమ్మిది మందికి దాదాపు 4 కోట్లు విలువ చేసే షేర్లను రాసిచ్చాడు. తాజాగా బ్యాంకు ఉద్యోగి ఒకరు మరణించడంతో అతని కుటుంబానికి ఐదులక్షల షేర్లను ఆర్థిక సాయంగా ఇచ్చాడు. వాటి ధర రూ.2.1 కోట్లకు పై మాటే. అలాగని ఐటీ రిటర్ను దాఖల్లో ఈ దానం చేసిన షేర్లకు సంబంధించిన ఏ ఒక్క రూపాయినీ నమోదు చేయడు. అవన్నీ ఆయన సొంత షేర్లేననీ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ కూడా ప్రకటించింది.

బాగా చదువుకుని...

కోట్లాది రూపాయల్ని ఇలా దానం చేస్తున్న వైద్యనాథన్‌ పుట్ట్టుకతోనే శ్రీమంతుడేమీ కాదు. చెన్నైలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగాడు. నలుగురు సంతానంలో వైద్యనాథన్‌ చిన్నవాడు. అతని తండ్రి ఆర్మీ ఉద్యోగి. తన నలుగురు పిల్లలతోపాటు
తల్లిదండ్రుల్నీ, అన్నదమ్ముల్నీ పోషించాల్సిన బాధ్యత వైద్యనాథన్‌ తండ్రిదే. దాంతో వీరి కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేది. అయితే వైద్యనాథన్‌ని ప్రభుత్వ బడిలో చదివించినా ఎప్పుడూ ముందుండేవాడు. అలా చెన్నైలో ఇంటర్‌ అయ్యాక ఝార్ఖండ్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చదివే అవకాశం వచ్చింది వైద్యనాథన్‌కి. ఆ సమయంలో ఇంటర్వ్యూకి వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. పోనీ ట్రైన్‌ టిక్కెట్‌ అయినా కొందామంటే ఎక్కడా డబ్బులు దొరకలేదు. దాంతో ఆ ప్రయాణం వాయిదా వేయడానికి సిద్ధమయ్యాడు వైద్యనాథన్‌. అయితే ఆ విషయం తెలిసిన మ్యాథ్స్‌ ట్యూషన్‌ టీచర్‌ సైనీ అడక్కుండానే వైద్యనాథన్‌ చేతిలో ఐదొందలు పెట్టి ట్రైన్‌ ఎక్కించి ఝార్ఖండ్‌ పంపాడు.  అలా ఆరోజు వెళ్లి సీటును దక్కించుకున్న వైద్యనాథన్‌ అక్కడ బీటెక్‌ పూర్తి చేశాడు. ఆ తరవాత బోస్టన్‌ వెళ్లి హార్వర్డ్‌ యూనివర్సిటీలో అడ్వాన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుకున్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక ముంబయిలోని సిటీ బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. కొంతకాలం అక్కడ పనిచేశాక ఐసీఐసీఐ బ్యాంకులో చేరాడు.

శ్రమే పెట్టుబడి...

దాదాపు పదేళ్లలో తన ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ... ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నాడు. కొన్నాళ్లకి   ఫ్యూచర్‌ గ్రూపు అధినేత కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌ అనే ఎన్‌బీఎఫ్‌సీ (నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ) సీఈవోగా చేరాడు. అయితే ఏడాది తిరిగే సరికి కిశోర్‌ బియానీ ఆ సంస్థ నష్టాన్ని భరించలేక ఫ్యూచర్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌ (ఎఫ్‌సీహెచ్‌)ని అమ్మాలనుకున్నాడు. దాంతో వైద్యనాథన్‌ పనులన్నీ పక్కన పెట్టి ఒకవైపు ఉద్యోగుల్ని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు ఇన్వెస్టర్ల కోసం వెతకసాగాడు. ఈ క్రమంలో నిద్రాహారాలు మానేసి ఏడాదిపాటు ఎంతో కష్టపడ్డాడు. చివరికి ఒకరోజు విమాన ప్రయాణంలో ఓ ఇన్వెస్టరు పరిచయం కావడంతో ఎఫ్‌సీహెచ్‌ గురించి వివరించి పెట్టుబడి పెట్టించడానికి ఒప్పించాడు. అలా ఆ సంస్థ బాధ్యతలు మీద వేసుకుని పెట్టుబడిదారుల అండతో ఆ బ్యాంకుకు క్యాపిటల్‌ ఫస్ట్‌గా పేరు మార్చాడు. తన సారథ్యంలో ఆ ఎన్‌బీఎఫ్‌సీని పరుగులు పెట్టించి లాభాల బాటలో నడిపించాడు. అందుకుగానూ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. బ్యాంకింగ్‌ రంగంలో వైద్యనాథన్‌కి మంచి పేరు ఉండటంతో 2018లో ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఛైర్మన్‌ అతడిని సంప్రదించి క్యాపిటల్‌ ఫస్ట్‌ను తమ బ్యాంకులో విలీనం చేయమని కోరాడు. ఎలాగూ క్యాపిటల్‌ ఫస్ట్‌కి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో వైద్యనాథన్‌ ఐడీఎఫ్‌సీతో చేతులు కలిపాడు. దాంతో విలీనానంతరం ఆ బ్యాంకు పేరు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌గా మారిపోయింది. అలానే వైద్యనాథన్‌ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తూనే నిర్విరామంగా దాన ధర్మాలూ చేస్తున్నాడు. చిన్నారులకు గుండె
ఆపరేషన్లు చేసే స్వచ్ఛంద సంస్థలకోసం మారథాన్‌లలో పాల్గొని పెద్ద ఎత్తున నిధులు కూడా సేకరిస్తుంటాడు. ఎంత మంచి మనసో కదూ.


పర్యావరణ మిత్రులు

పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలతో... రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు ఈ ముగ్గురు.  వారు తయారుచేసే ఉత్పత్తులూ... వాటి ప్రయోజనాలూ ఏంటీ అంటే...

నాచుతో గ్యాస్‌..

నీటిలో పెరిగే గుర్రపు డెక్క, కలుపు మొక్కలు, నాచుతో బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు కేరళకు చెందిన అనురూప్‌. ఎంబీఏ చదువుకున్న ఈ కుర్రాడు సమాజానికి మంచి చేసే పనులే చేయాలని కలలు కనేవాడు. అందుకే కొంత కాలం బెంగళూరులో పనిచేశాక ఉద్యోగం మానేసి తన స్వస్థలమైన తన్నీర్‌ముక్కోం వచ్చేశాడు. గ్యాస్‌ సిలిండర్‌ ధర మాటిమాటికీ పెరుగుతుండటంతో చాలామంది కట్టెల పొయ్యిపైనే ఆధారపడటం చూశాడు. అప్పుడు వారి సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఆలోచించిన అనురూప్‌కి ఆ ప్రాంతంలో గుర్రపు డెక్కతో నిండిపోయిన సరస్సులు గుర్తొచ్చాయి. దాంతో బయోగ్యాస్‌ తయారుచేయొచ్చని చిన్నతనంలో చదువుకున్న ఓ పాఠం గుర్తు కొచ్చింది. వెంటనే ‘సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఆక్వాటిక్‌ రిసోర్సెస్‌’ (సీఆర్‌ఏఆర్‌)ను సంప్రదించాడు. వారి సలహాలూ సూచనలతో గతేడాది పాయల్‌ జ్వాల పేరుతో ఓ గ్యాస్‌ తయారీ ప్లాంట్‌ను మొదలుపెట్టాడు. ఈ మొక్కలతో గ్యాస్‌ చాలా త్వరగా తయారవుతుందని గమనించాడు. అంతేకాదు ఇతర కలుపుమొక్కలూ, వంటింటి చెత్తా వేసినా మంచి ఫలితం ఉంటుందని తెలుసుకున్నాడు. దాంతో కొందరు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని ఇంటి ఆవరణలోనే చిన్న కొలను ఏర్పరచుకుని గుర్రపుడెక్కను పెంచుకుంటున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌ భారాన్ని తగ్గించుకోవడానికి ఎంతోమంది అనురూప్‌ సేవలు కోరుకుంటున్నారు. అలానే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వందల ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. ఈ ప్లాంట్ల సామర్థ్యాన్ని బట్టి ధర ఉంటుంది.


కరిగే కవరు...

వరికైనా బహుమతి ఇవ్వాలంటే దాన్ని అందంగా ప్యాక్‌ చేయిస్తాం. అందుకోసం రకరకాల రంగుల్లో భిన్న డిజైన్లలో లభించే కవర్లను ఎంచుకుంటాం. అయితే అందంగా ఉండే ఈ కవర్లు భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. దిల్లీకి చెందిన నమ్య పరేఖ్‌ మాత్రం పర్యావరణానికి మేలు చేసేలా తడిస్తే ఇట్టే నీళ్లలో కరిగిపోయే ర్యాపర్లను తయారు చేసింది. 2020లో ఇండస్ట్రియల్‌ డిజైన్‌ కోర్సును నేర్చుకుంటున్నప్పుడు బయో లెదర్‌ లాంటి స్థిరమైన ప్రాజెక్టు చేసుకురమ్మని చెప్పారు. దాంతో గుడ్డు పెంకులు, మిగలపండిన పండ్లు, కూరగాయలతో వంటింట్లోనే రకరకాల ప్రయోగాలు చేసింది. ఏం చేసినా అందులో విఫలమయ్యేది. కొన్ని రోజులకు నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్ల తొక్కలూ, జిలాటిన్‌తో నీళ్లలో కరిగిపోయే కవరును తయారు చేసింది. దీనికి కాలేజీలోనే కాదు బయటి నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. దాంతో తన స్నేహితురాళ్లతో కలిసి సొంతంగా ఈ ఉత్పత్తులు తయారు చేస్తోంది.


వెదురు కలప గుజ్జుతో..

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన వైభవ్‌ అనంత్‌ నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరవాత దిల్లీలో ఓ ఉద్యోగంలో చేరాడు. ఒకసారి ఓ సముద్రపు తాబేలు ముక్కులో గుచ్చుకున్న ప్లాస్టిక్‌ స్ట్రాను ఒక మెరైన్‌ బయాలజిస్టు తొలగించి దానికి చికిత్స చేసిన వీడియో ఒకటి చూశాడు వైభవ్‌. ప్లాస్టిక్‌ వల్ల సముద్రపుజీవులకు జరుగుతున్న హాని చూసి బాధపడ్డాడు. దాంతో ఉద్యోగం మానేసి ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా పర్యావరణహితంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుని అందుకు సంబంధించిన అధ్యయనం మొదలుపెట్టాడు. అప్పుడే వెదురు, కలపగుజ్జు, చెరకుపిప్పి, సముద్రపు నాచు వంటి వాటితో ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా రకరకాల ఉత్పత్తులు తయారు చేయొచ్చని తెలుసుకున్నాడు. అలా 2018లో ‘బామ్‌బ్రూ’ పేరుతో ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్‌ను పెట్టి... వెదురుతో స్ట్రాలు చేయడం మొదలుపెట్టాడు. వాటికి మంచి ఆదరణ రావడంతో సేవలు మరింతగా విస్తరించాలనుకున్నాడు. అప్పుడే పలు సంస్థలూ ఈ-కామర్స్‌సైట్లూ ఫార్మా సంస్థలూ ప్యాకింగు, నిల్వలకోసం ప్టాస్టిక్‌ని ఎక్కువగా వాడుతున్నట్టు గమనించాడు. వారికోసం కార్టన్లూ, టేక్‌ అవే బాక్సులూ, ప్యాకింగ్‌ కవర్లను రకరకాల డిజైన్లూ, సైజుల్లో చేయడం మొదలుపెట్టాడు. ఆ ఉత్పత్తుల్ని నేరుగా చూపి, వాటి తయారీ విధానం తెలిపి అమెజాన్‌, మింత్ర, నైకా, ప్యూమా, బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆదిత్యబిర్లా గ్రూపు... వంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికోసం మూడేళ్ల నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తూ.. నెలకి కోటిన్నర నుంచి రెండుకోట్ల ఆదాయం పొందుతున్నాడు. వెదురు దొరికే ప్రాంతాల్లోని మహిళల చేత ఈ ఉత్పత్తులను చేత్తో తయారు చేయిస్తూ వారికీ ఉపాధినిస్తున్నాడు. ఈ మధ్య ఓ విదేశీ సంస్థ ‘బామ్‌బ్రూ’కు భారీగా ఫండింగ్‌ అందజేసి వ్యాపారాన్ని ప్రోత్సహించింది. ప్రస్తుతం వైభవ్‌ మరిన్ని ఉత్పత్తుల తయారీతోపాటు  ఇంకొన్ని సంస్థలకీ వాటిని అందించే పనిలో ఉన్నాడు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..