చుట్టూ చూశారు... కనిపెట్టేశారు!

జుగాడ్‌... ఈ మధ్య స్టార్టప్‌ వాతావరణంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. సమాజాన్ని వెంటాడుతున్న సమస్యలకి- అతిక్లిష్టమైన హైటెక్‌ పరికరాలతో కాకుండా చుట్టూఉన్న వస్తువులతోనే సులువైన పరిష్కారం సాధించడాన్ని ఇలా ‘జుగాడ్‌’ అంటున్నారు. ఈ నలుగురి ఆవిష్కరణలే కాదు... ఇందుకోసం వాళ్ళని పురిగొల్పిన అవసరాలూ ఆసక్తికరమైనవే. మీరే చూడండి...

Updated : 12 Jan 2024 16:11 IST

జుగాడ్‌... ఈ మధ్య స్టార్టప్‌ వాతావరణంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. సమాజాన్ని వెంటాడుతున్న సమస్యలకి- అతిక్లిష్టమైన హైటెక్‌ పరికరాలతో కాకుండా చుట్టూఉన్న వస్తువులతోనే సులువైన పరిష్కారం సాధించడాన్ని ఇలా ‘జుగాడ్‌’ అంటున్నారు. ఈ నలుగురి ఆవిష్కరణలే కాదు... ఇందుకోసం వాళ్ళని పురిగొల్పిన అవసరాలూ ఆసక్తికరమైనవే. మీరే చూడండి...


అల్జీమర్స్‌ బాధితుల కోసం ‘క్యూఆర్‌’ కోడ్‌!

ది 2019... అప్పట్లో అక్షయ్‌ రిద్లాన్‌ సివిల్స్‌ కోసం సిద్ధమవుతుండేవాడు. ఓ వార్త అతని కంటపడింది. ‘ఆటిజమ్‌ సమస్య ఉన్న 17 ఏళ్ళ చిన్నారి తప్పిపోయి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు. ఓ ఆర్పీఎఫ్‌ పోలీస్‌ కంటపడ్డాడు. ఆయన ఆ చిన్నారిని కాపాడేక్రమంలో- ఏదో సుదూర ప్రాంతానికెళ్లే రైలు ఎక్కించేశాడు!’- ఇదీ దాని సారాంశం. ఆ చిన్నారి దగ్గర అతని తల్లిదండ్రులకి సంబంధించిన ఏ కొద్ది వివరాలున్నా ఇలా జరిగేది కాదుకదా...అనుకున్నాడు అక్షయ్‌. కొన్నేళ్ల తర్వాత- అక్షయ్‌, ప్రొఫెసర్‌ ఒకాయన ‘డెమెన్షియా’తో పడుతున్న బాధల్ని చూశాడు. అందుకే- అటు ఆటిజం, ఇటు అల్జీమర్స్‌ బాధితులకి ఉపయోగపడేలా ఓ పెండెంట్‌ కనిపెట్టాడు. ఇందుకోసం ‘క్యూఆర్‌ కోడ్‌’ సాంకేతికతని వాడాడు. దీన్ని మెడలో వేయొచ్చు. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయి తచ్చాడుతూ ఉన్నారనుకుందాం. వాళ్ళని చూసి సాయం చేయాలనుకున్నవాళ్లు ఆ క్యూఆర్‌ కోడ్‌ని తమ మొబైల్‌ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే చాలు! బాధితుల పేరూ, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యా, వాళ్ళ ఇంటి చిరునామా, బంధువుల ఫోన్‌ నంబరూ అన్నీ వచ్చేస్తాయి. వాటిని చూసి వెంటనే సాయంచేయొచ్చు. పెండెంట్‌లోని కోడ్‌ని ఎవరు స్కాన్‌ చేసినా... దాని తాలూకు మొబైల్‌ నంబర్‌ బాధితుల బంధుమిత్రులకీ ఓ ‘అలెర్ట్‌’లా వెళ్ళిపోతుంది. కాబట్టి, వాళ్లూ తక్షణం స్పందించొచ్చు. ‘ప్రాజెక్టు చేతన’ పేరుతో ఈ పెండెంట్‌లని ఉచితంగానే అందిస్తున్నాడు అక్షయ్‌ రిద్లాన్‌. అవసరం ఉన్నవాళ్లు projectchetna.in అన్న వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని తెప్పించుకోవచ్చు!


వినికిడి లోపమున్న డ్రైవర్‌ల కోసం!

చెవులు వినిపించనివాళ్ళకి అసలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇస్తారా అన్న సందేహం వస్తోందా?! కచ్చితంగా ఇస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన ఎస్‌కె రాజాలి పాషా కూడా అలా వాహనం నడుపుతున్నవాడే. పుట్టుకతోనే వినికిడి లోపం, పోలియోతో అంగవైకల్య సమస్యలూ చుట్టుముడితేనేం... పాషా చదువులో వెనకడుగు వేయలేదు. డిగ్రీ బీఈడీ చేసి ఖమ్మంలోని మండల పరిషత్‌ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్నాడు. రోజూ బైక్‌మీదే బడికి వెళ్ళొస్తుంటాడు. అప్పుడే- వినికిడి లోపమున్న తనలాంటివాళ్లు మరింత సమర్థంగా డ్రైవింగ్‌ చేసేలా ఓ హెల్మెట్‌ని కనిపెట్టాడు. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు వెనక నుంచో పక్క నుంచో ఏదైనా వాహనం వస్తుందనుకుందాం. ఆ వాహనానికి సంబంధించిన హారన్‌ని ఈ ప్రత్యేక హెల్మెట్‌లోని సెన్సార్‌లు గ్రహిస్తాయి. ఆ శబ్దాల తీవ్రత మేరకు హెల్మెట్‌లో చిన్నపాటి లైట్‌లు వెలిగి ఆరిపోతుంటాయి. వాటిద్వారా బధిరులు వాహనాల దూరాన్ని పక్కాగా అంచనా వేయొచ్చన్నమాట! పాషా ఆవిష్కరించిన ఈ హెల్మెట్‌ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ కార్యక్రమంలోనూ ఎంపికైంది.


తొమ్మిదో తరగతి చదువుతున్నవాళ్లే...

కృష్ణప్రశాంత్‌, శక్తిప్రియన్‌... తమిళనాడు విళుప్పురం జిల్లాలోని పాళయంపట్టి అనే కుగ్రామానికి చెందినవాళ్ళు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఓ రోజు బడి నుంచి ఇంటికెళుతూ ఉంటే వాళ్ళకళ్లెదుటే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని లారీ ఢీకొట్టడంతో లోపలున్న వాళ్ళకి తీవ్రగాయాలయ్యాయి. మరుసటి రోజు, ఆ ప్రమాద బాధితుల్లో ఒకరు సరైన సమయంలో రక్తం దొరక్క చనిపోయారని విని మరింత బాధపడ్డారు. అలాంటి మరణాలు చోటుచేసుకోకూడదనే తమ బడిలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(ఏటీఎల్‌)కి చెందిన వెంకటేశ్‌ అనే శిక్షకుడి సహకారంతో ‘బ్లడ్‌ డోనర్‌ హబ్‌’కి రూపకల్పన చేశారు. ఇప్పటికే ఉన్న ‘ఏటీఎం’ టెక్నాలజీనే ఇందుకోసం సమర్థంగా వాడుకున్నారు ఇద్దరూ. ఈ ఏటీఎంలాంటి కియోస్క్‌ని ప్రతి ఆసుపత్రి ఎదుటా పెడతారు. ఆ ఆసుపత్రిలో ఎవరికైనా అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే- ఆ విషయం వైద్యుల నుంచే నేరుగా ఓ అభ్యర్థనలా మారి ఇందులో స్క్రోల్‌ అవుతూ ఉంటుంది. దాన్ని చూసినవాళ్ళు నేరుగా వెళ్ళి రక్తదానం చేయొచ్చు. అంతేకాదు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమవారిని చూడటానికి వచ్చిన యువత కూడా రక్తదానం చేయాలనుకుంటే ఆ వివరాలని కియోస్క్‌లో ఇట్టే నమోదుచేయొచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వాట్సాప్‌లోనూ రక్తదాతల వివరాలు ఉంటున్నా... ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్‌లూ ఉన్నా... అత్యవసర వేళ వాళ్లు స్పందిస్తారని చెప్పలేం. కానీ- ఈ కియోస్క్‌ ద్వారా నేరుగా వైద్యుల నుంచే అభ్యర్థనలు రావడం, రక్తదానం చెయ్యాలనుకున్న వాళ్ళ వివరాలు అప్పటికప్పుడు వైద్యులకి వెళ్ళిపోవడం వల్ల ఇది వాట్సాప్‌ బృందాలకన్నా సమర్థంగా పనిచేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..