అంతర్లీనాలు

మనిషి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాలకు అలవాటుపడి బాహ్యంగా కంటికి కనిపించేదే వాస్తవమని, కనిపించనిదంతా అవాస్తవమని కొట్టిపారేస్తున్నాడు. కంటికి కనిపించని ఆ అవాస్తవంలోనే వాస్తవం అంతర్లీనంగా ఉందని గ్రహించలేక పోతున్నాడు.

Published : 05 Jan 2022 00:35 IST

నిషి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాలకు అలవాటుపడి బాహ్యంగా కంటికి కనిపించేదే వాస్తవమని, కనిపించనిదంతా అవాస్తవమని కొట్టిపారేస్తున్నాడు. కంటికి కనిపించని ఆ అవాస్తవంలోనే వాస్తవం అంతర్లీనంగా ఉందని గ్రహించలేక పోతున్నాడు. షేక్స్‌పియర్‌ వంటి కవులు తమ రచనల ద్వారా, బెథోవెన్‌ వంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా, సోక్రటీస్‌ వంటి తత్వవేత్తలు తమ బోధనల ద్వారా, లియోనార్డో డావిన్సి వంటి చిత్రకారులు తమ చిత్రకళ ద్వారా అంతర్లీన సత్యాలను వెలుగులోకి తెచ్చారు. శతాబ్దాలు గడిచినా ఆ సత్యాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.

గంగ, యమున, సరస్వతి నదుల కలయికే త్రివేణీ సంగమం. గంగ, యమున నదులను స్పష్టంగా చూడగలం. సరస్వతీనది మాత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ప్రతీతి. బుద్ధి, జ్ఞానాలకు అధిష్ఠాన దేవతగా, విద్యల తల్లిగా, శక్తిస్వరూపిణిగా, నదీమతల్లిగా పూజలందుకునే సరస్వతీ దేవి ద్వాపర యుగానికే అంతర్హితమై, కలియుగంలోనూ కనిపించని అంతర్వాహినిగా, పుణ్య నదులలో ఒకటిగా నేటికీ పూజలందుకుంటోంది.

భగవంతుడు తనకు ప్రతిరూపంగా ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతిలో మనిషికి అర్థంకాని ఎన్నో రహస్యాలను నిక్షిప్తం చేశాడు. మనిషి ఇచ్ఛలకు అనుగుణంగా ప్రకృతి తనంతట తానుగా ఏనాడూ రూపాంతరం చెందదు. వర్షం ఎక్కడ కురిసినా వర్షమే. ప్రదేశం, వాతావరణం, సమయాలను బట్టి అతివృష్టి అనావృష్టి ఉంటాయి. మనిషికే కనిపించే  అసమానతలను ప్రకృతే కాదు, సృష్టిలో మరే ప్రాణీ పట్టించుకోదు. ఈ అనంత సృష్టిలో ఎవరికి, ఏది, ఎప్పుడు, ఎక్కడ అవసరమో ఆ సమయానికి దాన్ని అందించడం అనంతాన్ని పాలించే భగవంతుడి పాలనా లీలలో భాగమే.

ప్రకృతి కఠినమైన సమవర్తి. మంచైనా, చెడైనా హద్దులు దాటిన దేన్నీ సహించదు. మనిషి జీవితంలో సుఖదుఃఖాలు, కష్టనష్టాలు తప్పించుకోలేని అనుభవాలు. సుఖం చాటున దుఃఖం, దుఃఖం మాటున సుఖం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా అంతర్లీనాలే. బాహ్య దృష్టికి, అంతరదృష్టికి మధ్య ఉండే అంతర్వాహినే ఈ సహజ సత్యం.

మనిషిలో అంతర్లీనంగా ఉండే అంతర్మలినాలే అరిషడ్వర్గాలు. ఇవి ఒకదానికి మరొకటి అనుసంధానం చేసినట్టు ప్రవర్తిస్తాయి. మనిషి వ్యక్తిత్వం కోల్పోయేలా చేస్తాయి... నియంత్రణను నిర్వీర్యం చేస్తాయి. బాహ్య శత్రువులను సృష్టిస్తాయి. అంతర్గతంగా వీటికి బానిసలయ్యే వారినే పతనం చేస్తాయి. చితి మరణించిన మనిషిని కాల్చేస్తే, అంతర్మలినాలు బతికున్న మనిషినీ దహించివేస్తాయి. కోపం వల్ల మోహం, భ్రమ కలుగుతాయి. మోహం వల్ల జ్ఞాపకశక్తి, మేధ పని చెయ్యకుండా పోతాయి. జ్ఞాపకశక్తి కోల్పోయినప్పుడు విషయాలను అర్థం చేసుకునే బుద్ధి నశిస్తుంది. విచక్షణా శక్తినిచ్చే బుద్ధి కొరవడినప్పుడు మనిషి నాశనమవుతాడని శ్రీమద్భగవద్గీత చెబుతోంది.

కనబడని సత్యాన్ని నమ్మడమే అసలైన ఆధ్యాత్మికత అన్నారు రచయిత పాలో కొయిలో. ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వారి ఆధ్యాత్మిక సాధనా ప్రయాణంలో బాహ్యంగా కనిపించే ఐహికాలు క్రమంగా అదృశ్యమవుతాయి. అంతర్లీనంగా ప్రవహించే అంతర్వాహినులు సాక్షాత్కారమవుతాయి. జ్ఞానం కాంతిపుంజంలా సర్వాంతర్యామిని దరిచేరే మార్గాన్ని సుగమం చేస్తుంది.

- ఎం.వెంకటేశ్వరరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని