ఆనందం చిరునామా

సంపదలు వస్తాయి, పోతాయి. సిరులు అన్నవి ఆర్థిక సామాజిక విలువలు మాత్రమే. సంపద చంచలమైందని అంటారు కదా... అదొక చోట నిలవదు. సిరులు పోయినా పోతాయి... కరి మింగిన

Published : 04 Jul 2022 00:13 IST

సంపదలు వస్తాయి, పోతాయి. సిరులు అన్నవి ఆర్థిక సామాజిక విలువలు మాత్రమే. సంపద చంచలమైందని అంటారు కదా... అదొక చోట నిలవదు. సిరులు పోయినా పోతాయి... కరి మింగిన వెలగపండులాగా. మనసులో ఉండాల్సిన నిశ్చింతకు ప్రసన్నతకు డబ్బుతో సంబంధమే లేదు. ఆనందంగా జీవించేవాడే అదృష్టవంతుడు. రేపటికి అవసరమైన డబ్బు మాత్రమే సంపాదించుకొని నిశ్చింతగా బతికేవాడు నిజమైన శ్రీమంతుడని అర్థశాస్త్రం రాసిన చాణక్యుడు నిర్వచించాడు. ఆర్థిక స్థితిగతులు జీవితాన్ని ప్రభావితం చేయకూడదని అంటాడాయన.

ఆర్థిక ప్రయోజనాలతో జీవితాన్ని ముడిపెట్టుకొంటే... బతుకులో ఆనందం లభించదు. జీవితం సుఖప్రదంగా సాగాలనుకొంటే స్వేచ్ఛా జీవితంలోనే ఆనందం దొరుకుతుందని తెలుసుకోవాలి. సంపదలు సమస్యలకు నిలయాలని ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ రాసిన ఆర్గనోన్‌ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. అలాగని ధనాన్ని వదిలిపెట్టి దరిద్రంలో బతకమని కాదు. అవసరానికి తగినంత డబ్బునే సంపాదించాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మనిషిపై డబ్బు ప్రభావం ఉన్నంత కాలం మనసుకు నిజమైన సంతోషం లభించదు.

అయోధ్య రాజ్య పట్టాభిషేకానికి సిద్ధం కావాలని దశరథుడు నిండు సభలో ఆజ్ఞాపించినప్పుడు రాముడి వదనంలో ఆనంద ఛాయలు వ్యక్తం కాలేదు. తండ్రి తనను రాజ్య భారం స్వీకరించాలని ఆదేశించినట్లుగానే దాశరథి భావించాడు. మరుసటి రోజు కైకేయి తనను పిలిపించి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని దశరథుడి ముందే ఆజ్ఞాపించినప్పుడు... శ్రీరాముడు అప్పుడు సైతం తండ్రి ఉత్తర్వుగానే పరిగణించి ఆయన మాట నిలబెట్టేందుకు కృతనిశ్చయుడయ్యాడు. ఆ సందర్భంలో ఆయన ముఖవైఖరిలో నిరాశ ఛాయలు కనిపించలేదు.

సీతారామలక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని ఉన్నప్పుడు లక్ష్మణుడు అన్నను ప్రశ్నించాడు. అధికారం చేతికందుతున్నప్పుడు సంతోషం ఎందుకు కనపడలేదు... అది చేజారినప్పుడు వేదన ఎందుకు వ్యక్తం కాలేదని అడిగాడు. అందుకు శ్రీరాముడు బదులిస్తూ- ‘సౌమిత్రీ! ఈ విశ్వాన్నంతా గమనించావా? పశువులు పక్షులు చెట్లు ఏ అధికార సంపదల బలంతో సంతుష్టిగా జీవిస్తున్నాయి? సిరిసంపదలు, అధికారం లేకుండా జీవించలేని వ్యక్తిత్వం మనోవైకల్యం లాంటిదే. సకల జీవరాశులకు లేని ఆ దౌర్బల్యం మనిషికి ఎందుకు ఉండాలి చెప్పు...’ అన్నాడు మనిషి రూపంలో ఉన్న ఆ దైవం.

సంతోషంగా ఉండేవాడిలో కక్షలు, కార్పణ్యాలు కనిపించవు. ఇతర ఏ పట్టింపులూ ఉండవు. డబ్బుతో అధికారంతో ప్రమేయం ఉండదు. నిజానికి వారికి శత్రువులే ఉండరు. కొందరు ఎన్ని కష్టాలనైనా అవలీలగా భరిస్తారు. అనారోగ్యం సంసార బాధ్యతలు ఒంటరితనం లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉల్లాసంగా కనిపిస్తారు. మంచి అలవాట్లు జీవనశైలి సైతం సంతోషాన్నిస్తాయి. భూటాన్‌ రాజ్యం ధనిక దేశం కాదు. కానీ, అక్కడి ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారట. చాలావరకు వారంతా వజ్రయాన బౌద్ధులు. తొలి శతాబ్దంలో భారతదేశం నుంచి భూటాన్‌ వెళ్ళిన బౌద్ధ సన్యాసి పద్మసంభవుడు వారికి గురువు. ఆనందంగా జీవించడంలో దైవత్వం ఇమిడి ఉందని ఆయన చెప్పిన సూత్రాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. అలాంటి జీవన విధానాలనే పాటిస్తారు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదని బుద్ధుడి తొలి శిష్యుల్లో ఒకడైన ఆనందుడు రాసిన దమ్మమార్గం చెబుతోంది. ఆనందం అంతరాంతరాళాల్లోంచి ఉబికి వచ్చేది. ఆ అనుభవానికి మరే ఇతర లౌకిక ఊరటకు సంబంధం లేదు. అదొక మధురానుభూతి.

- అప్పరుసు రమాకాంతరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని