ఆకాశ వీధిలో మువ్వన్నెల జెండా!

జెండాపై కపిరాజు- శ్రీకృష్ణ అర్జునుల రథంపై ఎగిరిన విజయపతాకం హనుమంతుడు. సౌగంధికా పుష్పం కోసం తిరుగుతున్న భీముడికి హనుమ దర్శనమిచ్చాడు. ఇద్దరూ వాయుపుత్రులే, బలంలో సాటిలేనివారే. ప్రసన్నుడైన హనుమంతుడు భీముడి కోరికపై కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథానికి జెండాపై నిలిచాడు.

Updated : 15 Aug 2022 07:09 IST

జెండాపై కపిరాజు- శ్రీకృష్ణ అర్జునుల రథంపై ఎగిరిన విజయపతాకం హనుమంతుడు. సౌగంధికా పుష్పం కోసం తిరుగుతున్న భీముడికి హనుమ దర్శనమిచ్చాడు. ఇద్దరూ వాయుపుత్రులే, బలంలో సాటిలేనివారే. ప్రసన్నుడైన హనుమంతుడు భీముడి కోరికపై కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథానికి జెండాపై నిలిచాడు. భరత వంశీయుల పతాకం చంద్రుడు. అందుకే వారు చంద్రవంశ రాజులుగా పరిపాలించారు.

శ్రీరాముడు సూర్యవంశ రాజు. అయోధ్య నగర రాజుల పతాకంలో సూర్యుడు కనిపిస్తాడు. శ్రీరాముడు వనవాసంలో చిత్రకూట ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొంటాడు. అన్నగారి వనవాసానికి దుఃఖించిన భరతుడు పౌరులతో, సైన్యంతో చిత్రకూటానికి వెళ్తాడు. అడవిలో అలజడిని గమనించిన రాముడు దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని లక్ష్మణుణ్ని ఆదేశించాడు. లక్ష్మణుడు ఎత్తుగా ఉన్న చెట్టును ఎక్కి మొదట గుర్తించింది తమ దేశ పతాకాన్ని. శత్రుంజయమనే మదగజం మీద రెపరెపలాడుతున్న సూర్య పతాకాన్ని గుర్తించి, వచ్చేవాడు భరతుడు అని చెబుతాడు.

రామరావణ యుద్ధ సమయంలో లంక నుంచి సమరానికి వస్తున్న వీరులను వారి వారి పతాకాలు చూసి తెలుసుకొని విభీషణుడు శ్రీరాముడికి విన్నవించేవాడు. భీకరమైన సింహం తల ఇంద్రజిత్తు పతాకం. ఒక్కొక్క వీరుడు తనకు నచ్చిన, పరాక్రమాన్ని తెలిపే బొమ్మలతో జెండాలను రథాలకు కట్టేవారు. జెండాతోనే వారిని గుర్తించేవారు.

ఒక్కొక్క దేశానికి, జాతికి వేరువేరు పతాకాలు ఉండేవని త్రేతాయుగం నాటి కట్టుబాట్లు వెల్లడిస్తున్నాయి. జెండాలలో ఎన్నో రంగులు, చిత్రాలు చోటుచేసుకుంటాయి. దేవాలయాల శిఖరంపై రంగురంగుల పతాకాలను ఎగురవేస్తారు. ఏదైనా అత్యున్నత స్థాయికి చేరితే దాన్ని పతాక స్థాయిగా చెబుతారు. ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే జెండా దేశ గౌరవానికి చిహ్నం. ఎత్తయిన శిఖరాలు అధిరోహించి పర్వతారోహకులు తమ విజయానికి గుర్తుగా ఆయా దేశ పతాకాలను పాతడం సర్వసాధారణమే. సైనికులకు నిత్య స్ఫూర్తిని, ఎనలేని శక్తిని అందించేది జాతీయ పతాకమే.

పూర్వకాలంలో రాజులు సంధి చేసుకునే నిర్ణయాన్ని తెలుపు జెండాతో ప్రకటించేవారు. శుభసంకల్పాలను ప్రారంభించే ముందు పతాకావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన శుభసూచకాలు.

జెండా మన ప్రాణం. శక్తికి నిదర్శనం. మనలోని దేశభక్తిని చాటే ఆయుధం. పతాకం కేవలం కొన్ని గజాల వస్త్రం కాదు. అది కోట్లమంది దేశపౌరుల త్యాగం. సమగ్ర దేశ ఔన్నత్యానికి ప్రతిబింబం. దేశభక్తిని చాటే తీరులో పొడవాటి పతాకాన్ని శోభాయాత్రగా జరుపుతారు. మూడురంగుల మువ్వన్నెల జెండా భారతీయ ఆత్మకు చిహ్నం. కాషాయ రంగు త్యాగనిరతికి, తెలుపు స్వచ్ఛతకు, ఆకుపచ్చ సుసంపన్న సౌభాగ్యానికి, మధ్యలో అశోక చక్రం అహింసా విధానానికి గుర్తులు. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య అజరామర కీర్తి గాంచారు.

భారత స్వాతంత్య్రం సిద్ధించినవేళ జాతీయ పతాకం గర్వంగా ఆకాశంలో ఎగిరి మువ్వన్నెల కాంతులు విరజిమ్మింది. రాజ్యాంగ దినోత్సవం రోజు ఎర్రకోటపై త్రివర్ణ పతాకం అభయాన్ని అందించింది. ఎప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని రగిల్చే ఆయుధం జాతీయ పతాకమే. దేవుడికి ప్రతీక విగ్రహం. దేశానికి సాకారం పతాకం. జెండా నీడలోనే అభ్యుదయం. జెండా ఎగిరితే అది ప్రగతి పథం. గుండె నిండా సంతృప్తితో, కళ్లలో ఆనందంతో జై బోలో అని దేశమాతను నినదిస్తూ చేసేదే- జాతీయ పతాక వందనం. ఎన్ని కవుల కలాలు, ఎందరు గాయకుల గళాలు, ఎందరు చిత్రకారుల కుంచెలు కీర్తించినా, చిత్రించినా- అది మన జెండా ఖ్యాతికిరీటమే!

- రావులపాటి వెంకట రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని