Published : 11 Sep 2022 00:35 IST

ప్రకృతితో సహజీవనం

హార నిద్రా భయ మైథునాలే జీవన కార్యకలాపాలనే స్థితిని దాటి మనిషి సృజనాత్మక శక్తితో నాగరికుడయ్యాడు. జనావాసాలు గ్రామాలయ్యాయి. వ్యవసాయం పెంపొందింది. నైపుణ్యాల ఆధారంగా పలు వృత్తులూ ఏర్పడ్డాయి. విజ్ఞానం పెరిగింది. విశ్వాసాలూ పెరిగాయి. సుఖజీవనానికి అవసరమైన పరికరాలను, సాధనాలను రూపొందించుకున్నాడు. ఈ స్థితిలో మనిషి తాను ప్రకృతిని నియంత్రించగలనన్న అహానికి లోనయ్యాడు.

ప్రకృతి శక్తులన్నీ మనిషికి ఉపకరించేవే. నదులు, సముద్రాలు, పర్వతాలు, మైదానాలు, వృక్షాలు, జీవకోటి- ఇవన్నీ ప్రకృతిలోని భాగాలే. ప్రకృతిలోని ఉత్పత్తులు, వాటిని వినిమయం చేసుకోవడం నిమిత్తంగా ధనం ఆవిష్కృతమై అదే ప్రధాన వనరుగా మారింది. ఉత్పాదక శక్తి ధనానికి లొంగిపోయింది. కూడబెట్టిన ధనంతో ప్రతిదానికి ఆ రూపంలోనే విలువకట్టే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనిషి అవసరాలకు, వనరులకు మధ్య సమన్వయం, సంతులనం ఉండేవి.

మనిషికి మట్టి ఆధారం. ఆ నేల, వర్షం కురిసిన నేల, నీరింకిన నేల- చెట్టుచేమలకు, జంతువులకు, మనిషికి బతుకులకు మూలమైంది. నేలను, చెట్టును కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయనే తెలివితో మనిషి మనుగడ సాగిస్తూ వచ్చాడు. వర్షం కురిస్తే హర్షంతో చిందులేసేవాడు. అడవి తల్లికి దండాలని పాడుకున్నాడు. వనదేవత అనే భావననూ సృష్టించుకున్నాడు. కర్రను, కలపను వంటచెరకుగాను, పనిముట్లుగాను మలచుకున్నాడు. ఆహారం కోసం కొన్ని జంతువుల్ని, ప్రాణ రక్షణ కోసం మరికొన్నింటిని చంపడం తప్పనిసరయింది. నాగరికత విస్తరించే క్రమంలో పండిన పంటలతో, ఎండిన చెట్లతో అవసరాలు తీర్చుకునే దశనుంచి పచ్చని చెట్టు మీదకు మనిషి దృష్టి మళ్ళింది. పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడనన్నాళ్లు ప్రకృతితో సహజ సహకార జీవనం విలసిల్లింది. నేలకూడా మనిషికి సహకరించింది. చెట్ల నుంచి, జంతువుల నుంచి వచ్చే సహజమైన ఎరువులు, తనలో ఉండే వానపాముల్లాంటి ప్రాణుల సాయంతో మనిషికి ఆహారం అందించింది. మనిషి మాత్రం నేలను నిస్సారం చేయసాగాడు. వృక్షాలు, పశుపక్ష్యాదులు పరిధుల్లోనే ఉంటాయి. రుతువుల పరిభ్రమణంలో ఆకులు ఎండటం, రాలడం, మళ్ళీ వసంతంలో పూత- ఇదంతా సహజ ప్రక్రియ. జంతువులు, పక్షులు ఎప్పటికప్పుడు తినడానికి కావలసినంత ప్రకృతినుంచి తీసుకుంటాయి. రేపటికి నిలవ చేసుకోవడం ఉండదు. మనిషి అలాకాదు. మూడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి కూడబెట్టాలనే స్వార్థం, అది నెరవేర్చుకోవడానికి క్రౌర్యం... ఈ దుర్గుణాలతో మనిషి జీవనం సాగుతోంది. నేటి తనలాభం కోసం రేపటి తరాన్ని బలివ్వడం మనిషికే చెల్లింది. పంట భూములు జనారణ్యాలవుతున్నాయి. తరతరాలుగా మట్టి మీద మమకారం పెంచుకున్నవాడు వ్యాపార మాయాజాలంలో చిక్కుకొని- నమ్ముకున్న నేలకు దూరమవుతున్నాడు.

సౌకర్య సాధనాల విశృంఖల వినియోగం, అత్యాశతో సంపదను పోగుచేసుకోవడం, దాచుకున్నదాన్ని రక్షించుకునే యత్నంలో భయాందోళనలు... మనిషికి హానికారకాలవుతున్నాయి. వ్యక్తికి సమాజానికి, మనిషికి ప్రకృతికి నడుమ ఒక సామరస్యాన్ని కాపాడే ధర్మాన్ని పౌరులు ఆచరించాలి. ప్రకృతిపట్ల జడభావాన్ని తొలగించుకొని, ఏకాత్మభావన పెంపొందించుకొని విశ్వలయను కాపాడవలసిన బాధ్యత మానవ సమాజంపై ఉంది.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts