దేవుడున్నాడా?

భౌతిక ప్రపంచం కారణం లేని అభూతకల్పన కాదు. దాన్ని సృష్టించింది దేవుడన్న నమ్మకంతో జీవించే మనుషులే అధిక సంఖ్యలో కనిపిస్తారు. దేవుడు లేడనేవారు అదే ప్రపంచంలో నివసిస్తారు.

Updated : 04 Oct 2022 22:39 IST

భౌతిక ప్రపంచం కారణం లేని అభూతకల్పన కాదు. దాన్ని సృష్టించింది దేవుడన్న నమ్మకంతో జీవించే మనుషులే అధిక సంఖ్యలో కనిపిస్తారు. దేవుడు లేడనేవారు అదే ప్రపంచంలో నివసిస్తారు.

జ్ఞానులు, వేదాంతులు వారెక్కడివారైనా సృష్టిలోని పునాదులన్నీ దేవుడు వేసినవేనని సూత్రప్రాయంగా అంగీకరిస్తారు. మతాలన్నీ దేవుడిని విశ్వాత్మగా, విశ్వసంభవానికి మూలకారణమైన దివ్యశక్తిగా గుర్తించాయి. గ్రహాలన్నీ గతి తప్పకుండా తమ పరిధిలో సంచరించడాన్ని సాధ్యం చేస్తున్నది ఊహకు అందని ఒక దివ్యశక్తేనని విశ్వ రహస్యాలను శోధించే శాస్త్రజ్ఞులు చెబుతారు. ఆ శక్తిని దేవుడనడానికి మాత్రం సుముఖత చూపరు. దేవుడిని నమ్మశక్యంగాని జ్ఞానమని కితాబులిచ్చి ఊరుకుంటారు కాని అతడున్నాడనరు.

వేదాంతులొక్కరే దేవుడున్నాడని మనిషికి నిర్దుష్టంగా చెబుతారు. అతడు అతడిలోనే దివ్యాత్మగా ప్రతిష్ఠుడై ఉంటాడని అర్థమయ్యేందుకు చిన్న కథొకటి చెబుతుంటారు. ఆ కథలో దేవుడి ఉనికిని ప్రశ్నించే కొందరుంటారు. నిత్యం కళ్లు మూసుకుని జ్ఞానముద్రలో కనపడుతుండే సాధుపురుషుడొకరిని చూసినప్పుడల్లా, వారు ప్రశ్నలు అడిగేవారు. ఎందుకు మీకింత ప్రయాస... దేవుడిని చూడాలనా, ఉంటే ఆయన ఉండేది ఎక్కడ, ఎంతకాలానికి కనిపిస్తాడంటూ ప్రశ్నలడుగుతూ ధ్యానభంగం కావించేందుకు ప్రయత్నించేవారు. సాధువు మౌనంగా వారి మాటలు వినీవిననట్లు ఊరుకునేవాడు. ఒకనాడు వారంతా అతడిని మీకు వినికిడి లోపం కూడా ఉన్నట్లుంది అంటూ మితిమీరి పరిహసిస్తారు. అప్పుడు సాధువు బదులిస్తాడు- ‘దేవుడున్నాడు. మీలోనే ఉన్నాడు. చూడాలని సంకల్పముంటే చాలు కనపడి తీరతాడు. ఆయనెవరో మీకు చెప్పాలంటే, తోలుబొమ్మలాటను మీరు చూసే ఉంటారు కదా... ఆ బొమ్మలనాడించే వ్యక్తి ఎవరో నాకు చెప్పాలి’ అంటాడు. సాధువును పరిహసించే ఆ వ్యక్తులు, జ్ఞానులకు రావాల్సిన సందేహమా అది, తెరవెనక కూర్చుని బొమ్మలాడిస్తున్న అతడు కాదా అని నవ్వుతారు. అందుకు ఆ సాధువు.... తెరవెనక నుంచి బొమ్మలనాడిస్తున్న ఆ వ్యక్తిలాగా తోలుబొమ్మల వంటి మనుషులను నడిపించేవాడు దేవుడు అంటాడు. తెర తొలగించుకుంటే మీకు కనిపిస్తాడంటూ తిరిగి ధ్యానావస్థలోకి జారుకుంటాడు! మనిషి నమ్మకమే దేవుడు. అరిషడ్వర్గాలు వేసిన ముసుగులో పడిన లోక భ్రాంతి తొలగినప్పుడు కానీ మనిషి తనలోనే ఉన్న ఆ దేవుడిని చూడలేడని వివరించడానికి వేదాంతులు చెప్పే కథ ఇది.
దేవుడు విద్యుచ్ఛక్తి లాంటివాడు. విద్యుత్తును ఒకసారి చూపమని అడిగితే ఎవరూ చూపించలేరు. విశాల విశ్వంలో సంభవించే నిరంతర పరిణామాలకు కారణమవుతున్నది, మనిషి మేధ అందుకోలేకపోతున్న అజ్ఞాతశక్తి- ఒకటే. గాలిలోని ప్రాణవాయువు జీవి కళ్లకు కనపడనంత మాత్రాన లేకుండా పోదు. దాన్ని జీవశక్తిగా నమ్ముతున్నప్పుడు జీవులకు ప్రాణం పోస్తున్న ఆ శక్తిని దేవుడనడానికి అభ్యంతరం ఉండకూడదు.

దేవుడు లేడనేవారి మనోభావనలను నిరసించి గాయపరచడాన్ని హైందవ సనా తన ధర్మం ఎన్నడూ ఆమోదించలేదు. ఉన్నాడని చెప్పేందుకు తార్కిక వాదనలను వినిపించింది. దేవుడంటే ఎవరేది చెప్పినా వినగల సహనం నేర్పించింది. చార్వాకుడి నాస్తిక వాదాన్నీ కించపరచలేదు. రుషులకిచ్చిన గౌరవమే ఆయనకు ఇచ్చింది.

విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమంతా దేవుడేనని, అతడు రూపగుణ విశేషాలుండని తనలోనే ఉన్న దివ్య చైతన్యమని, అందులో తానొక అణువులో అణుమాత్రమైనా కాని అంశమని వేదాంతం తెలుసుకొమ్మంటుంది. వేదాంతం అర్థమైతే... దేవుడంటే వెలుగని గ్రహించి- భౌతిక లోకంలో చీకట్లు తనను ఏ రూపంలో వేధిస్తున్నా మనిషి భయపడడు!

- జొన్నలగడ్డ నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని