ఇది చాలదా?

అంతర్యామిని మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. ఒకడు సంపదను, వేరొకడు సంతతిని, మరొకడు ఉద్యోగాన్ని, ఇంకొకడు పదవిని...  అంతటితో ఆగుతాడా! ఆ కోరికలనేవి ఒకదాని తరవాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి.

Published : 27 Nov 2022 00:20 IST

అంతర్యామిని మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. ఒకడు సంపదను, వేరొకడు సంతతిని, మరొకడు ఉద్యోగాన్ని, ఇంకొకడు పదవిని...  అంతటితో ఆగుతాడా! ఆ కోరికలనేవి ఒకదాని తరవాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటికి అంతు ఉండదు. హద్దుండదు. అన్నీ దొరికినా, సుఖంగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడా అంటే- అదీ ఉండదు. ఇవన్నీ సమకూరాక ‘స్వామీ! నాకు సుఖశాంతులు లేవు. ఆనందం లేదు. అవి కావాలి, ప్రసాదించు!’ అని కోరుకుంటాడు పరమాత్మను. ఇది అమాయకత్వం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా?

సుఖశాంతులనేవి మనిషి చేసే ఆలోచన, మాట్లాడే మాట, ఆచరించే వ్యవహారం మీద ఆధారపడి ఉంటాయి. వీటన్నింటికీ మూలం ధర్మం. ధర్మాచరణ చేసేవాడు సంతోషంగానే ఉంటాడు. సంతోషం అంటే సంతృప్తి. సమయం, మాట, ఆలోచన, ఆచరణాల విలువ తెలిసినవాడు కచ్చితంగా సంతోషంగానే ఉంటాడు.
సంతోషం ఒకచోట లేనప్పుడు, మరోచోట దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు దొరక్కపోయినా మరొకప్పుడు దొరుకుతుంది. అందుకు సంయమనం అవసరం. ఓర్పు, ఓపిక అవసరం. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడు ఎప్పుడూ సంతృప్తి పొందుతూనే ఉంటాడు. అక్రమంగా, అవినీతి మార్గంలో ధనార్జన చేసినవాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. అటువంటివాడికి సుఖం దొరకదు. శాంతీ లభించదు.

అత్యాశాపరులు రావణుడు, దుర్యోధనుడు ఎలాంటి దుర్గతిని, అపఖ్యాతిని పొందారో విదితమే. అహంకారి హిరణ్యకశిపుడు హరిని దూషించి నరహరి చేత నిహతుడయ్యాడు. ధర్మం తప్పినవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండలేడు. భయం అనే పిశాచి అతణ్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది.

సత్త్వరజస్తమోగుణాలతో సత్త్వగుణ శోభితుడైన మనిషి సర్వదా సంతుష్టుడై ఉంటాడని గీతాచార్యుడు చెప్పాడు. సాధువర్తనుడికి భయమే ఉండదు. ఐశ్వర్యవంతుడికి సంపద పోతుందేమోనని భయం. పదవిలో ఉన్నవాడికి పదవి పోతుందేమోనన్న భయం. కీర్తి కాంక్ష కలవాడికి ఎప్పుడు అపఖ్యాతిని పొందుతానోనన్న భయం. మమకార అహంకారాలున్న వాడికే ఈ భయాలు. ‘ఎదురుదెబ్బలు తగిలినా, సాధించాలనుకున్నది సాధించి సఫలీకృతుడయ్యేవాడే సంతోషానికి అర్హుడు’ అంటాడు చాణక్యుడు. సంతుష్టిని, ఆనందాన్ని బయటి నుంచి పొందాలనుకునేవాడు లౌకికుడు. ఆ ఆనందాన్ని తనలోనే అన్వేషించుకోగలిగేవాడు ఆత్మజ్ఞాని. ఇంకా ఏదేదో కావాలనుకుంటూ తపిస్తూ, అశాంతిగా సంక్షోభంలో సంఘర్షణలో కొట్టుమిట్టాడేవాడు ఎన్నటికీ సంతృప్తి పొందలేడు. ‘కలిసి పంచుకుందాం... కలిసి భుజిద్దాం, కలిసి నడుద్దాం’ అన్న ఉపనిషత్‌ వాక్యం సంతోష మార్గానికి సరైన దిక్సూచి. ‘తృప్తి కలిగితే సుఖం, తృప్తి తొలగితే దుఃఖం. తృష్ణ పెరిగితే దుఃఖం, తృష్ణ తగ్గితే సుఖం’ అన్నది మనుస్మృతి.

మునులు, యోగులు, అవధూతలు మనకు తమ కృతుల ద్వారా అమూల్యమైన జ్ఞాన భాండాగారం అందించారు. జిజ్ఞాస ఉండాలే కాని, వాటిని అధ్యయనం చేస్తే సచ్ఛీలురైన పౌరులం కాగలం. ఇది చాలదా? పరమాత్మ పంచభూతాత్మకమైన సృష్టిని ప్రసాదించాడు. సద్వినియోగపరచుకుంటున్నామా? అపూర్వ ఆవిష్కరణలు చేయగల మేధావులకు ఈ తపో భూమి మీద పుట్టుకనిచ్చాడు... లోక శ్రేయస్సు కోసం. ఇది చాలదా? ఇతర ప్రాణికోటికి లేని మనసు, మేధ ఇచ్చాడు... జగతి ప్రగతికోసం! ఇది చాలదా? ‘చాలదా హరి నామ సౌఖ్యామృతము మనకు’ అని ఏనాడో అన్నమయ్య భక్త కోటిని ప్రశ్నించి, హెచ్చరించాడు. వేటినీ సద్వినియోగపరచుకోలేక, అన్నీ వ్యాపారాత్మకం చేసి స్వార్థానికి వాడుకుంటున్నాం. మనకు యోగ్యత ఉంటే దైవకృప ఏదైనా చేతికందిస్తుంది. యోగ్యత లేకపోతే ఎంత వాపోయినా ఫలితం దక్కదు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని