దైన్యం వీడి ధైర్యం వహించు!

లేలేత చిగురుటాకులతో విశాలమైన కొమ్మలతో, మొగ్గలు, కాయలు, పండ్లతో ఉన్న పచ్చటి చెట్టును నరికేశారు. భూమిపైన బలమైన వేళ్లతో ఉన్న కాండం మోడుగా మిగిలింది. రోదన, బాధ లేవు... కన్నీరు కార్చలేదు. కాలం గడుస్తోంది. చినుకులతో వర్షాకాలం ప్రారంభం అయింది. నాలుగు నెలల అనంతరం నరికిన చెట్టు మోడు నుంచి నాలుగు వైపులా లేత అంకురాలు చిగురించాయి.

Updated : 15 May 2023 04:30 IST

లేలేత చిగురుటాకులతో విశాలమైన కొమ్మలతో, మొగ్గలు, కాయలు, పండ్లతో ఉన్న పచ్చటి చెట్టును నరికేశారు. భూమిపైన బలమైన వేళ్లతో ఉన్న కాండం మోడుగా మిగిలింది. రోదన, బాధ లేవు... కన్నీరు కార్చలేదు. కాలం గడుస్తోంది. చినుకులతో వర్షాకాలం ప్రారంభం అయింది. నాలుగు నెలల అనంతరం నరికిన చెట్టు మోడు నుంచి నాలుగు వైపులా లేత అంకురాలు చిగురించాయి. క్రమంగా ఎదిగి మహావృక్షమై తిరిగి మొగ్గలు, కాయలు, పళ్లతో కళకళలాడుతూ శోభాయమానమైంది. ఇది ప్రకృతి మనిషికి నేర్పే పాఠం. అవమానాలు, బాధలు, పరాజయాలు కొంతకాలమే ఉంటాయి. అవి కదిలే మేఘాల వంటివి. రెండు విజయాల మధ్య విరామం పరాజయం. శిశిరం ఆకులు రాలుస్తుంది. వసంతం చిగుళ్లు తొడుగుతుంది. ప్రకృతి సమస్తం నిత్య నూతనం. అన్నింటినీ తట్టుకొని సాగే అలుపెరగని ఆధ్యాత్మిక ప్రగతి ప్రయాణం. నిరాశ లేని సంతృప్తికరమైన జీవన విధానమే ఆధ్యాత్మిక జీవనం. భగవంతుడితో అనుబంధం శాశ్వతంగా ధైర్యాన్ని, ఆత్మబలాన్ని కలిగిస్తుంది. దైన్యం నుంచి ధైర్యానికి చేర్చడమే ఆధ్యాత్మికత ఆంతర్యం.

కురుక్షేత్ర సంగ్రామానికి అర్జునుడు సర్వ సన్నద్ధుడై వచ్చాడు. సోదరులు, గురువులు, బంధువులతో యుద్ధం, వారి మరణం కళ్ల ఎదుట కనిపించాయి. కర్తవ్యాన్ని మరచి రోదిస్తూ కూర్చున్నాడు. నిరాశ ఆవహించింది. విషాదం నుంచి ఆనందానికి, పలాయనం నుంచి విజయానికి చేర్చేందుకు శ్రీకృష్ణుడు ఏడువందల శ్లోకాలు గల భగవద్గీత బోధించాడు. తమ బాధ్యతను నిష్కల్మషంగా నిర్వర్తించేవారే కర్మయోగులు, విజయ సారథులు, అదే గీతా సందేశం.

అరవిందులు, రమణులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేశారు. దైన్యం నుంచి ధైర్యానికి చేరడానికి నాలుగు సూత్రాలను అనుసరించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. తనలోని శక్తి సామర్థ్యాలను గుర్తించడం, బలహీనతలను నిరాశావాదాన్ని తొలగించుకోవడం, అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, అవరోధాలను మానసిక పరిపక్వతతో దాటడం... ఇవే, శంఖు చక్ర గద విల్లు(సారంగం) ధరించి శ్రీమన్నారాయణుడు నాలుగు చేతులతో చేసే ధర్మ విజయానికి సంకేతాలు. విజయానికి దగ్గరి దారి అంటూ ప్రత్యేకంగా ఉండదు. కృషి, పట్టుదల, సహనంతో సాధించాలి. ఆనందంలోనే భగవంతుడు ఉంటాడు. మనలో అంతర్గతంగా ఉండేది ఆనంద స్వరూపమే. అది వెలుపలి నుంచి లభించేది కాదు. హృదయమంతా నిండి ఉంటుంది. దాని అనుభూతిని పొందితే మనసు ప్రశాంతమవుతుంది. మానసిక శాంతి ఆనందాన్ని కలిగిస్తుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదివ్వె వెలుగులోనైనా నడక సాగించాలి. మోడు చిగురించి, మొలకెత్తి, ఫల పుష్పాలతో ఎదిగినట్లు దైన్యం నుంచి ధైర్యానికి చేరాలి. ఆనంద స్వరూపుడు భగవంతుడి అభయంతో ధైర్యంగా విజయ తీరాలకు చేర్చేదే ఆధ్యాత్మిక మార్గం. గెలుపు కన్నా పోరాట స్ఫూర్తి, దానికన్నా ఆత్మవిశ్వాసం- జీవన పోరాటంలో అనుసరణీయ ఆధ్యాత్మిక సూత్రాలు.

రావులపాటి వెంకట రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని