క్షేత్ర మాహాత్మ్యం

భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పేరుతో ఒక అధ్యాయం ఉంది. భగవానుడు పార్థుడితో ‘ఈ శరీరం క్షేత్రం. దీన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రాల్లోనూ క్షేత్రజ్ఞుణ్ని నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం’ అని పలికాడు. క్షేత్రమంటే నేల అని సాధారణమైన అర్థం.

Published : 08 Feb 2024 01:28 IST

భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పేరుతో ఒక అధ్యాయం ఉంది. భగవానుడు పార్థుడితో ‘ఈ శరీరం క్షేత్రం. దీన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రాల్లోనూ క్షేత్రజ్ఞుణ్ని నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం’ అని పలికాడు. క్షేత్రమంటే నేల అని సాధారణమైన అర్థం. పరమాత్మ శరీరాన్ని క్షేత్రంగా చెప్పాడు. ఇంకా పై స్థాయిలో పరిశీలిస్తే సంస్కార బీజస్థానమైన మనసూ క్షేత్రమే. ఈశ్వరుడికి ఆవాసయోగ్యమైన ఈ జగత్తంతా క్షేత్రమే. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుల స్థితిని మానవుడు అర్థం చేసుకోవాలని అదే జ్ఞానమని పండితులు చెబుతారు. కర్మక్షేత్రమైన ఈ భౌతిక ప్రపంచమే ప్రకృతి అని, దాన్ని అనుభవించే జీవి పురుషుడని, ఈ రెండింటికీ పైన ఉండే నియంత దేవదేవుడని శ్వేతాశ్వరోపనిషత్తు చెబుతోంది. క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడు పరమ పురుషుడు. అతడే సర్వేశ్వరుడు లేదా పరమాత్మ. బృహదారణ్యకం ప్రకారం పరమాత్మకు పృథివి శరీరం. అదే క్షేత్రం.

‘నేనే క్షేత్రజ్ఞుణ్ని’ అని ప్రకటించిన పరమాత్మ అంతటా ఉన్నా కొన్ని క్షేత్రాలను పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తాం. కొన్ని క్షేత్రాలు స్వయంసిద్ధం. మరికొన్ని సిద్ధపరుషులు, రుషులు ప్రతిష్ఠించినవి. ఆగమశాస్త్ర విధులను అనుసరించి మానవులు ప్రతిష్ఠ చేసినవి కొన్ని క్షేత్రాలు. క్షేత్రం, తీర్థం, దైవం అనే త్రిపుటి- క్షేత్రానికి ఆధారం.

ఆయా క్షేత్రాలకు కొన్ని ప్రత్యేక మహిమలుంటాయి. శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే, వారణాసిలో మరణిస్తే, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని విశ్వాసం. అరుణాచల, సింహాచల క్షేత్రాల్లో గిరి ప్రదక్షిణం సంప్రదాయం. క్షేత్రదర్శనంలో తీర్థస్నానమూ ప్రశస్తమే. కాశీలో గంగ, తిరుపతిలో స్వామి పుష్కరిణి, శ్రీరంగంలో కావేరి... ఈ విధంగా ఆయా క్షేత్రాల్లో నెలకొన్న తీర్థాల్లో స్నానానికి భక్తులు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు.

స్కాంద పురాణం క్షేత్ర మహిమలకు ఆలవాలం. తెలుగు సాహిత్యంలో క్షేత్ర మాహాత్మ్యం ఒక ప్రక్రియ. ఎఱ్ఱాప్రగడ రచించిన శ్రీలక్ష్మీ నృసింహావతారం తెలుగులో తొలి క్షేత్ర మాహాత్మ్య కావ్యం. ఇది నృసింహ పురాణంగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మాండ పురాణంలో నరసింహావతార కథను అనుసరించి అహోబల క్షేత్ర మాహాత్మ్యాన్ని కవి ఈ గ్రంథంలో వర్ణించాడు. అనంతర కాలంలో శ్రీనాథుడి భీమేశ్వర పురాణం, కాశీ ఖండం వెలువడ్డాయి. స్కాంద పురాణంలోని ఆయా క్షేత్రాల గాథల్ని శ్రీనాథుడు ఆంధ్రీకరించాడు. ద్రాక్షారామ భీమేశ్వర ప్రతిష్ఠకు సంబంధించిన కావ్యం భీమేశ్వర పురాణం. కాశీని శపించబోయిన వ్యాసుడిపై కోపగించి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళమని ఆ మహర్షిని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అన్నపూర్ణాదేవి దక్షిణ కాశి అయిన ద్రాక్షారామానికి వెళ్ళమని ఉపదేశిస్తుంది. ద్రాక్షారామం నుంచి వస్తున్న అగస్త్యుడు పిఠాపురం వద్ద వ్యాసుణ్ని కలుసుకుంటాడు. ఆ సందర్భంలో అగస్త్యుడు ద్రాక్షారామ క్షేత్ర వైభవాన్ని వ్యాసుడికి వివరిస్తాడు. కాశీ క్షేత్రానికి సంబంధించిన పలు గాథలు కాశీఖండంలో చోటు చేసుకున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ధూర్జటి సువర్ణముఖి నదీతీరంలోని శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని కావ్యంగా రచించాడు. మహారాష్ట్రలోని భీమరథీ తీరంలోని పుండరీక క్షేత్ర మహిమల్ని తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మాహాత్మ్యంలో చిత్రించాడు. శైవక్షేత్రాల్లో జ్యోతిర్లింగ క్షేత్రాలు ప్రసిద్ధం. వైష్ణవ సంప్రదాయం దివ్యతిరుపతులనే క్షేత్రాలను పేర్కొంటున్నది. ఆయా క్షేత్రాల స్థల పురాణాల్ని, అక్కడ కొలువైన దేవుడి లీలావైభవాలను తెలుసుకోవడానికి క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు బాగా ఉపకరిస్తాయి.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని