వసంత పంచమి

మాఘమాసాన్ని మనోజ్ఞమైన మాసంగా చెబుతారు. మంజులమైiన, మనోహరమైన ప్రకృతి వికాసానికి మాఘం ప్రతీక. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిదాయక, విచార, వివేచనాదుల స్వీకరణకు మాఘమే సరైన తరుణమని పేర్కొంటారు.

Published : 14 Feb 2024 00:27 IST

మాఘమాసాన్ని మనోజ్ఞమైన మాసంగా చెబుతారు. మంజులమైiన, మనోహరమైన ప్రకృతి వికాసానికి మాఘం ప్రతీక. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిదాయక, విచార, వివేచనాదుల స్వీకరణకు మాఘమే సరైన తరుణమని పేర్కొంటారు. సత్త్వ, రజో, తమోగుణాల్ని అనుసరించి- ఆదిశక్తి మూడు శక్తులుగా, భిన్న రూపాల్లో అభివ్యక్తమైంది. ఈ ముగ్గురమ్మల్లో పరమ సౌజన్యమూర్తిగా సరస్వతీదేవి తేజరిల్లుతోంది. మాఘశుద్ధ పంచమి- వాగ్దేవి, విజ్ఞాన ఘన రూపిణిగా ఆవిష్కారమైన రోజు. ప్రకృతిలో ఉత్పాదక శక్తి వసంత పంచమితోనే ఆరంభమవుతుందని ‘కాలామృతం’ విశ్లేషించింది. చైత్రంతో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభ స్వాగతాన్ని పలికే రుతు సంబంధిత పర్వదినం- వసంత పంచమి. మనోశక్తుల్ని ప్రేరేపించే శ్రీవాణిని మాఘ పంచమినాడు విశేషంగా పూజించాలని బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండం వివరించింది.

జీవుల్లో వెల్లివిరిసే ప్రాణశక్తికి సరస్వతి సంకేతం. సమస్త సృష్టిలో వర్ధిల్లుతున్న జీవకళకు శ్రీభారతి ప్రతీక. విద్యావాహినిగా, జ్ఞానాధి దేవతగా, నదీమతల్లిగా పలు పార్శ్వాల్లో శారదా పరమేశ్వరి తన మూర్తిమత్వాన్ని ఆవిష్కరిస్తుంది. జడత్వాన్ని రూపు మాపి, అంతటా జాగృతిని అందించే వేదశక్తిని జ్ఞానానికి ఆత్మగా అభివర్ణిం చారు. జగన్మాత శరీరం నుంచి ఆవిర్భవించిన మాతృగణాల్లో  బ్రాహ్మీ రూపం విశేషమైనది. ఆమె తన కమండలంలోని పావన జలాన్ని చిలక రించి, దానవుల్ని అతి సులభంగా అంతం చేసింది. శుంభుడితో సాగిన యుద్ధంలో సరస్వతి ‘బ్రాహ్మణి’గా పరాక్రమాన్ని ప్రదర్శించిందని చండీసప్తశతి వర్ణించింది. మానవదేహంలో ‘సోహం’ అనే ప్రాణ వాయు సంచారం నిరంతరం కొనసాగు తుంది. ఈ వాయు ప్రసారానికి ‘సదన’ అని పేరు. శరీరమనే భువనానికి ఆ ‘సదనమే’ జీవకారకంగా జగద్గురువు ఆదిశంకరులు విశ్లేషించారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి- అనే స్వరూపాల సమ్మేళనమే శారదాంబ.

వాక్‌ శక్తిగా వాగ్దేవి, బ్రహ్మ మానస సంచారిణిగా బ్రాహ్మణి, సనాతనిగా సరస్వతి, జాడ్యనాశనిగా భారతి, సారస్వతమూర్తిగా శారద, పరావిద్యగా శ్రీవిద్య, వేదనిధిగా వేదవల్లిగా- ఇలా వివిధ అంశాల్లో జ్ఞానదాయిని పరిఢవిల్లుతోంది. సరస్వతీదేవిని అఖిల విద్యలకు అధిష్ఠాత్రిగా వసంతపంచమి నాడు త్రిమూర్తులు నియమించారని పద్మపురాణం తెలియజేసింది. అలాగే, జ్ఞాన సంబంధమైన దివ్య కళల్ని దేవతలంతా విద్యాదేవికి ఆరోజే ఆపాదించారని చెబుతారు.

వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఎలా ఆరాధించాలో, నారదుడికి శ్రీమహావిష్ణువు వివరించాడని దేవీ భాగవతం వెల్లడించింది. మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీ మాతను పుస్తకంలోకి లేదా కలశంలోకి ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో జ్ఞానవాణిని అర్చించాలి. వేదోక్తమైన ‘శ్రీం హ్రీం సరస్వత్యై నమః’ అనే నామాన్ని పఠించాలని నారదుడితో శ్రీహరి పేర్కొన్నాడంటారు. అలాగే భృగు మహర్షికి ఈ మహామంత్రాన్ని నారాయణుడు గంగాతీరంలో ఉపదేశించాడని అంటారు. భృగుమహర్షి ద్వారా ఈ మంత్రానికి ప్రాచుర్యం లభించింది. భృగు- అంటే ప్రకాశించేది అని అర్థం. జీవితాల్ని ప్రకాశింపజేసే శక్తి జ్ఞానానికి మాత్రమే ఉందని ప్రతీకాత్మకంగా వెల్లడించడమే ఇందులోని ఆంతర్యం. అజ్ఞానం నెలకొన్న హృదయానికి ఆమె జ్ఞాన పెన్నిధి. విజ్ఞానలబ్ధి, విద్యాసిద్ధి, సర్వతోముఖాభివృద్ధి అనే త్రివిధ సిరుల్ని అనుగ్రహించే సకల సంపత్సమేత- సరస్వతీమాత!

 డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని