క్షమ దైవీగుణం

క్షమాగుణం కలవారిని అందరూ దైవ సమానులుగా చూస్తారు. క్షమాగుణం, సహనం- ఈ రెండూ మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతాయి. క్షమ అనేది చాలా గొప్ప గుణం. అది మనిషి వ్యక్తిత్వానికి బలం. ఈ గుణం ధీరులు, జ్ఞానవంతుల లక్షణం. ఈ గుణం గలవారికి సత్సంబంధాలు బలపడతాయి. వీరికి సమాజంలో అందరూ ఆప్తులవుతారు.

Published : 17 Feb 2024 00:44 IST

క్షమాగుణం కలవారిని అందరూ దైవ సమానులుగా చూస్తారు. క్షమాగుణం, సహనం- ఈ రెండూ మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతాయి. క్షమ అనేది చాలా గొప్ప గుణం. అది మనిషి వ్యక్తిత్వానికి బలం. ఈ గుణం ధీరులు, జ్ఞానవంతుల లక్షణం. ఈ గుణం గలవారికి సత్సంబంధాలు బలపడతాయి. వీరికి సమాజంలో అందరూ ఆప్తులవుతారు.

రామాయణంలో వాల్మీకి శ్రీరాముణ్ని క్షమాగుణంలో పృథ్వితో సమానుడని వర్ణిస్తాడు. ఎందుకంటే భూమిది గొప్ప క్షమాగుణం. నాగలితో దున్నినా, అనేక రకాలుగా తవ్వి హింసించినా అన్నం పెడుతుంది. ఎవరు ఎంతలా బాధపెట్టినా వారిపై పగ తీర్చుకోవాలనుకోదు. భూమి తన మొదటి గురువని దత్తాత్రేయుడు చెప్పాడు. అలాగే తనను నరికిన కొడవలికి, గొడ్డలికి కూడా గంధపుచెట్టు సువాసననిస్తుంది. తనపై రాళ్లు విసిరినవాళ్లకూ వృక్షం ఫలాలను ఇస్తుంది.

పగవల్ల పగ పోదని, ఏ విధంగా చూసినా క్షమాగుణమే గొప్పదని మహాభారతం వివరించింది. ఘోష యాత్ర పేరుతో పాండవులను అవమానించాలని, వారి ఎదుట తమ వైభవాన్ని చాటుకోవాలని దుర్యోధనుడు సంకల్పించాడు. చివరికి గంధర్వుల చేతిలో సపరివారంగా బందీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు భీమార్జునులను పంపి కౌరవులను బంధ విముక్తులను గావించాడు. క్షమ అంటే ఇదే.

క్షమాగుణం గలవారికి కోపం, పగ మొదలైన వికారాలుండవు. తమకు ఎవరైనా అపకారం చేస్తే, తిరిగి అపకారం చేసే శక్తి ఉన్నా ఎదుటివారికి అపకారం చేయనివారే నిజమైన క్షమాగుణం గలవారు. పరిస్థితులు ఎటువంటివైనా, ఎలా వాటిని ఎదుర్కోవలసి వచ్చినా క్షమ అనే దైవీగుణంతో అవతలివారి మనసు గాయపడకుండా ప్రవర్తించాలి. అప్పుడే పరిస్థితులు చక్కబడి ఇరుపక్షాలవారి మనసులు తేలికపడతాయి.

క్షమ విశిష్టతను ప్రపంచంలోని అన్ని మతాలూ ముక్తకంఠంతో నొక్కిచెప్పాయి. జైనమతావలంబకులకు ఆరాధ్యుడైన మహావీరుడు, ‘నీపట్ల అపరాధం చేసినవారిని నువ్వు హింసించాలని అనుకోవద్దు. అలా చేస్తే నువ్వు శిక్షించేది నిన్నే’ అంటారు. మహమ్మదీయులు నిరంతరం స్మరించే అల్లాకు ఉన్న విశిష్టమైన దైవీగుణం- తన శరణు కోరిన భక్తుల అపరాధాలను క్షమించి వారిని కాపాడే క్షమాగుణం.
నిజానికి క్షమాగుణం ఆచరణ యోగ్యమే కాని కష్టసాధ్యం కాదు. ఇది లౌకిక జీవితంలో సుఖశాంతులకు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతికి మనిషికి ఉపకరించే గుణం. పొరపాటు అనేది ప్రతి మనిషికీ సహజం. అలాంటి మనిషిని క్షమించి ప్రేమించాలి. క్షమ పగను చల్లార్చడమే కాదు, మనిషిలో ప్రేమను పెంపొందిస్తుంది. అందుకే ఎవరినైనా ప్రేమిస్తే తిరిగి ఆ ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ఆ ద్వేషాన్నే తిరిగి పొందుతాం. ప్రయత్నం ద్వారా ఓర్పు, క్షమ, శాంతి అనే గుణాలను అలవరచుకోవాలి. తద్వారా జీవితాన్ని అర్థవంతంగా, ఉపయుక్తంగా మలచుకోవచ్చు.

విష్ణు సహస్రనామాల్లో విష్ణువును ‘క్షమ’ అంటారు. అంటే, ఆ భగవంతుడు క్షమాగుణంతో భక్తులను ఆదరించేవాడని అర్థం. ఆ భగవంతుడికి ప్రీతిపాత్రమైన క్షమాగుణాన్ని ప్రతి మనిషీ అలవరచుకోవాలి. అప్పుడే మనం నిజమైన భక్తులమవుతాం. ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులమవుతాం.

విశ్వనాథ రమ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని