భీష్మాచార్యుడు

శంకరాచార్యులను ‘శంకర భగవత్పాదులు’ అన్నట్లుగానే- భీష్మాచార్యుణ్ని ‘భీష్మ పితామహుడు’ అనడం లోకంలో పరిపాటి. ఆస్తికులందరూ తమతమ పితృదేవతలకు విడిచినట్లుగా- ఏటా మాఘమాసంలో భీష్ముడికీ తర్పణాలు వదులుతారు.

Published : 20 Feb 2024 00:20 IST

శంకరాచార్యులను ‘శంకర భగవత్పాదులు’ అన్నట్లుగానే- భీష్మాచార్యుణ్ని ‘భీష్మ పితామహుడు’ అనడం లోకంలో పరిపాటి. ఆస్తికులందరూ తమతమ పితృదేవతలకు విడిచినట్లుగా- ఏటా మాఘమాసంలో భీష్ముడికీ తర్పణాలు వదులుతారు. ఈ శాస్త్రవిధిని గురించి ఆలోచిస్తే, ఆయనను పితామహుడని సంబోధించడంలోని ఔచిత్యం బోధపడుతుంది.

తండ్రి మాట జవదాటకపోవడంలో రామచంద్రుడు అగ్రగణ్యుడు. కాని, దాని నిమిత్తం ఆయన రాజ్యాన్నే తప్ప దాంపత్య జీవితాన్ని వదులుకున్నవాడు కాదు. అంతే కాదు, రావణాసుర సంహారం దరిమిలా రాముడు చిరకాలం రాజ్యపాలన నిర్వహించాడు. భీష్ముడు మాత్రం తండ్రి కోసం ఆజన్మాంతం అటు రాజ్యాన్ని, ఇటు వివాహాన్ని రెండింటినీ విడిచి పెట్టేశాడు. ఇలా ఒక అవతారమూర్తితో సరితూగే వ్యక్తిత్వం, పోల్చదగిన స్థాయి- మన పురాణాల్లో ఒక్క భీష్మపితామహుడికే దక్కింది. ఆ మాటకొస్తే, మహాభారతంలో సైతం పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడితోను, ధర్మస్వరూపుడైన ధర్మనందనుడితోను సరిసమానుడు అనిపించుకొన్న కర్మయోధుడు- భీష్ముడు ఒక్కడే! నందగోపాలుడు నరుడు కాదని, నారాయణుడని స్పష్టంగా గ్రహించిన సమకాలీనుల్లోనూ భీష్ముడే అగ్రగణ్యుడు. ఆ విషయాన్ని ఆయన భారతంలో అనేక చోట్ల స్పష్టంగా ప్రస్తావించాడు. శిశుపాల, సుయోధనాదులను హెచ్చరించాడు. తన పలుకుల ద్వారా కృష్ణతత్వాన్ని ఈ లోకానికి విశదీకరించాడు. అంత్య దశలో సైతం అంపశయ్యపై పడుకొని ఆయన ఆలోచన చేసింది- కబళిస్తున్న మృత్యువు గురించి కాదు, కరుణిస్తున్న కృష్ణుడి గురించి! తన నోట ఆయన పలికిస్తున్న తీరు గురించి!

ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిఉన్న భీష్మపితామహుణ్ని సమీపించి కృష్ణుడంతటి వాడు ‘ఓ నృపాల మహోత్తర’ అంటూ గొప్పగా సంబోధించాడు. వాస్తవానికి భీష్ముడు ఏనాడూ ఏలిక కాడు. అయినా నరులను పాలించిన వారిలో అత్యంత మహనీయుడిగా, శ్రేష్ఠుడిగా ఆయనను శ్రీకృష్ణుడు సంభావించాడు. ‘ఈ ధర్మరాజు దుఃఖంలో మునిగి ఉన్నాడు. ఇతడికి కర్తవ్య ఉపదేశం చేసి కలతను పోగొట్టు’ అని ఆదేశించాడు. దానికి ఫలితంగా భారతంలో రెండు పర్వాలకు నిండుగా భీష్ముడి ఉపదేశం లోకానికి అందింది. అనంత ధర్మరాశి అందులో ఒదిగిపోయింది. రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు... ప్రవాహంలా ఆయన నోట వెలువడ్డాయి. వాస్తవానికి అదంతా మానవాళికి మహోపదేశం. భీష్మ ధర్మజ సంవాదం చక్కగా అర్థం అయినవారికీ ధర్మజుని వలే హృదయం విప్పారుతుంది. ధర్మ సూక్ష్మం బోధపడుతుంది. అది లోకానికి భీష్ముడు చేసిన మహోపకారం.

మహాభారతంలోని శాంతి, ఆనుశాసనిక పర్వాలు రెండింటినీ లోతుగా అధ్యయనం చేస్తే తప్ప- మనకు భీష్ముడి తపోవిశేష మహనీయతతో, ఉదాత్తతతో సరైన పరిచయం ఏర్పడదు. ఈ లోకం ఆయనకు ఎంతగా రుణపడి ఉందో అర్థం కాదు. ఈనాటికీ ఆయనకు తర్పణాలు విడవడంలోని ఔచిత్యం తెలిసిరాదు. ‘భారత వీరుల్లోనే కాదు, ఇతరత్రాను అలాంటి మహనీయుడు లేనే లేడు’ అన్నారందుకే ‘కథలు-గాథలు’లో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.

శ్రీకృష్ణుణ్ని అవతారమూర్తిగా గుర్తించడంలో భీష్ముడికి తోడ్పడినవి- ఆయన చర్మ చక్షువులు కావు, వివేకం అనే మూడో కన్ను! దాన్నే జ్ఞాననేత్రం అన్నారు. ఆ భీష్ముడి ఉపదేశంతో మనకు జ్ఞాననేత్రాలు తెరుచుకోవాలి. ఆయన కళ్లలోంచి మనం పరమాత్మను దర్శించే ప్రయత్నం చేయాలి. భీష్మ ఏకాదశి నాటి ఈ సంకల్పమే- ఆ మహాపురుషుడికి సరైన నివాళి అవుతుంది!

ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని