కాలభ్రమలు

కాలం పరుగులు తీస్తోంది అంటారు కొందరు. కాలం గడవడమే లేదు అంటారు ఇంకొందరు. నిజంగా కాలం పరుగులు పెడుతోందా లేక మెల్లగా నడుస్తోందా అంటే ఈ రెండు ప్రశ్నలూ భ్రమలే కాని నిజాలు కావు. మనిషి తన పుట్టుకనుంచి ప్రతిదినం భ్రమలకు లోనవుతూ ఉంటాడు. అతడిలోని అజ్ఞానం భ్రమల రూపంలో బయటపడుతూ ఉంటుంది.

Published : 22 Feb 2024 01:21 IST

కాలం పరుగులు తీస్తోంది అంటారు కొందరు. కాలం గడవడమే లేదు అంటారు ఇంకొందరు. నిజంగా కాలం పరుగులు పెడుతోందా లేక మెల్లగా నడుస్తోందా అంటే ఈ రెండు ప్రశ్నలూ భ్రమలే కాని నిజాలు కావు. మనిషి తన పుట్టుకనుంచి ప్రతిదినం భ్రమలకు లోనవుతూ ఉంటాడు. అతడిలోని అజ్ఞానం భ్రమల రూపంలో బయటపడుతూ ఉంటుంది. మనిషి నిత్యం పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా తన జీవిక కోసం పరుగులు పెడుతుంటాడు. కాలంతో పోటీపడుతూ సాగిపోతూ ఉంటాడు. పగలంతా ఎన్ని పనులు చేసినా ఇంకా ఏవో మిగిలిపోతూనే ఉంటాయి. పన్నెండు గంటల పగటి వ్యవధిలో లెక్కకు మించిన బాధ్యతలను నెరవేర్చాలంటే సాధ్యంకాదు. అందుకే ఇంకా పగటి సమయం మిగిలి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అందుకే కాలం ఆగకుండా పరుగులు తీస్తోందని భ్రమపడుతుంటాడు.

పనిలేనివాడికి కాలం గడవదు. క్షణం యుగంలా అనిపిస్తుంది. మన్నుతిన్న పాములా కాలం ఇలా మెల్లగా ఎందుకు నడుస్తోందని భ్రమ కలుగుతుంది. దాంతో అతడిలో అసహనం, అశాంతి, ఆవేశం కలుగుతూ ఉంటాయి.

కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోతే, మనిషిని ఇలాంటి ఆలోచనలే వెంటాడతాయి. సామ్రాజ్యాలను ఏలే చక్రవర్తులకు, సగటు మనుషులకు కాలం ఒక విధంగానే ఉంటుంది. ఏ కాలంలో ఏ పనిచేయాలో నిర్ణయించుకొని, ప్రణాళికాబద్ధంగా కాలానుక్రమణికను ముందుగానే సిద్ధం చేసుకొని సాగే అప్రమత్తుడైన మనిషికి కాలం సహకరిస్తుంది. లేకుంటే కాలమే కాలసర్పమై కాటు వేస్తుంది.

కావ్యశాస్త్ర చర్చలతో అధ్యయనాలతో పరిశోధనలతో అన్వేషణలతో మేధావులు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మూర్ఖులు మాత్రమే చెడు వ్యసనాలతో అతినిద్రతో కలహాలతో కాలాన్ని వ్యర్థంగా గడుపుతారని ప్రాచీన నీతికారులు ప్రబోధించారు. నీతిశాస్త్రాలన్నీ మనిషికి కాలోచిత కర్మలను ఆచరించాలనే ఉపదేశిస్తున్నాయి. కాలం ఎప్పుడూ తన పరిధులను దాటి ప్రవర్తించదు. ఒక్క లిప్తకాలమూ ముందుకుగాని, వెనకకు గానీ దురాక్రమించదు. నిర్దిష్ట వేగంతోనే ముందుకు సాగుతుంది. రుతువులు ఏవీ తమ పరిధులను దాటవు. రుతువులు, అయనాలు, మాసాలు, పక్షాలు, వారాలు, దినాలు ఒకదాన్ని అనుసరించి మరొకటి తమ పరిధుల్లోనే ప్రవర్తిస్తుంటాయి.

కాలలీలలో మనిషి కొట్టుకొని పోతూ ఆర్తనాదాలు చేస్తాడు. మంచి జరిగితే మంచికాలం అని, చెడు జరిగితే చెడుకాలమని కాలానికి పేర్లను ఆపాదిస్తాడు. మంచి చెడులకు కాలంతో సంబంధం ఏమిటి? మనిషి తాను చేసిన సుకృత్యాలకు, దుష్కృత్యాలకు పర్యవసానంగా ఫలితాలను పొందుతాడనేది వాస్తవం.

మనిషి భ్రమ అనే పువ్వు చుట్టూ భ్రమరంలా తిరుగుతుంటాడు. లేనిదేదో ఉందనుకొంటాడు. ఉన్నదాన్ని లేదనుకొంటాడు. సత్యాన్ని అసత్యంలా భావిస్తాడు. అసత్యాన్ని సత్యమని నమ్ముతాడు. మనిషి దృష్టి ఎలా ఉంటే అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. అనంతంగా గడచిన గతకాలం అసలు వాస్తవాన్ని కళ్లముందు ఉంచినా, నమ్మలేని మనిషి కాలరహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు. పాదరసంలా జారిపోతున్న కాలాన్ని పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మరిచి, అయోమయంలో బతుకుతున్నాడు. అయినా, కాలం తన పని తాను చేసుకుంటూ, సాగిపోతూనే ఉంది!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని