వారసత్వం

నిత్య వ్యవహారంలో కుటుంబపరంగా వారసత్వం అనే మాటను తరచుగా వాడుతుంటాం. పూర్వుల నుంచి లభించే స్థిరచరాస్తులను వారసత్వ సంపదగా భావిస్తుంటాం.

Published : 25 Feb 2024 01:28 IST

నిత్య వ్యవహారంలో కుటుంబపరంగా వారసత్వం అనే మాటను తరచుగా వాడుతుంటాం. పూర్వుల నుంచి లభించే స్థిరచరాస్తులను వారసత్వ సంపదగా భావిస్తుంటాం. కొందరికి డబ్బులు, కొందరికి జబ్బులు వారసత్వంగా వస్తుంటాయని ఒక చమత్కారోక్తి. పూర్వుల నుంచి జన్యుపరంగా రోగాలు సంక్రమిస్తాయని శాస్త్రీయ భావన. కుటుంబపరంగా ఆస్తులు, అప్పులు, బంధుమిత్రులు శత్రువులు వారసత్వం కావచ్చు. ప్రతి జాతికీ వారసత్వసంపద ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల జాతీయ జీవనస్రవంతిలో అది సృష్టించిన సాహిత్యం, ప్రతిపాదించిన స్థిరమైన జీవనం, ఆదర్శాలు, ధర్మం, నైతిక సూత్రాలు, పరిపాలనా పద్ధతులు, కళలు, నిర్మాణాలు, ఇరుగు పొరుగు దేశాలతో ఏర్పడే అనుబంధాలు మొదలైనవన్నీ ఈ విశాల భూమికలో చేరతాయి.

సాంస్కృతిక వారసత్వం అనే మాటను చరిత్రకారులు ప్రయోగిస్తుంటారు. మానవ జీవితాన్ని ఫలవంతంచేసి ప్రాణికోటిలో మనిషి ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయడానికి ఉపకరించేది సంస్కృతి. మనిషి సృజించిన భౌతిక భౌతికేతరమైన మేలిమి విషయాల సమాహారం సంస్కృతి అని విస్తృతార్థంలో చెప్పవచ్చు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఒక సామాజిక నడవడి, ఆలోచనా విధానం, భావజాలం- వీటి మిశ్రమ సారం సంస్కృతి.

వారసత్వం అనేది పూర్వీకుల నుంచి సంక్రమించేది. భౌతిక, భౌతికేతరాలు, భావాలు, ఆచార వ్యవహారాలు, సాధించిన విజయాలు, గతవైభవం... వాటి సారమే వారసత్వం.

సాంస్కృతిక వారసత్వం అంటే తరతరాలుగా ప్రసరించిన సంస్కృతి మనది అని గర్వంగా చెప్పుకొనేది. విజ్ఞానం, కళలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, నైతిక దృక్పథాలు, జీవన విధానం- ఇవన్నీ ఒక జాతి సమష్టి సంపద. సంస్కృతి చైతన్యవంతమైన పురోభివృద్ధికి సంకేతం. అది పరిపూర్ణ వ్యక్తిత్వవికాసానికి తోడ్పడుతుంది. ప్రపంచంలోని అనేక జాతులు అనాగరిక దశలో ఉన్నప్పుడు భరతఖండంలో మహా సామ్రాజ్యాలు ఏర్పడి పటిష్ఠమైన పాలన నెలకొల్పాయి. కవిత్వం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం వంటి కళల్లో భారతీయులు ఏనాడో మహోన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక శాస్త్రాలు ఈ జాతికి గొప్ప నిధులుగా ఉన్నాయి. భారతీయులు సామాజిక చట్రంలో ప్రతి కార్యాన్ని యజ్ఞంగా భావించి కృషి సాగించారు. బుద్ధుడు, శంకరాచార్యుడు, రామానుజుడు, దయానంద సరస్వతి, వివేకానందుడు, గాంధీ, అంబేద్కర్‌ వంటి మహాపురుషుల ఆలోచనా సరళి తరాలు మారినా సమాజంపై ప్రభావం చూపుతూనే ఉంది. సనాతన హైందవ ధర్మంనుంచి ఉద్భవించిన శాక్తేయ, సౌర, గాణాపత్య, జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత ధర్మాలెన్నో ఈ నేలపై వికసించాయి. పరదేశాల్లో పుట్టిన మతాలనూ భారతీయులు సహనంతో ఆదరించారు. మానవ జీవిత పరమార్థం కేవలం భోగభాగ్యాలు అనుభవించడానికే కాదని ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాల్ని మన పూర్వులు ప్రతిపాదించారు. మానవుల పోకడ, చిత్త వృత్తుల్ని చిత్రించి ఆదర్శప్రాయమైన నడవడిని రామాయణ మహాభారతాలు ప్రపంచానికి చాటి చెప్పాయి. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి గొప్ప సందేశం.

జాతిపరమైన వారసత్వమే కాకుండా విలక్షణమైన వైయక్తిక వారసత్వమూ కొందరిలో కనిపిస్తుంది. తాతలు, తండ్రులు కవులో, కళాకారులో అయితే ఆ మార్గంలోనే అభివృద్ధి సాధించినవారున్నారు. దేవాలయాలు, ధార్మిక సంస్థల పోషణను వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలు స్వీకరిస్తుంటాయి. జాతి పరంగా గాని, కుటుంబాలు, వ్యక్తుల పరంగా గాని విలువైన వారసత్వం కొనసాగకపోతే సమాజం పతనోన్ముఖమవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి సూత్రమైతే, ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ మన అఖండ వారసత్వ ఆదర్శం.

 డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని